ప్రైవేటు మెడికల్ సీట్లలో రిజర్వేషన్ .. రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం
అంటే 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా ఉంటుంది. ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ శాఖ కార్యదర్శి రిజ్వీ సెప్టెంబర్ 29న ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా బీ కేటగిరీ కింద 35 శాతం సీట్లు (మైనారిటీ కాలేజీల్లో 25 శాతం సీట్లు) కేటాయిస్తారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇందులో 85% తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 24 ప్రైవేటు మెడికల్ కళాశాలలుండగా, వాటిల్లో 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు లభించనున్నాయి.
చదవండి: అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు పోస్టింగ్ కోసం కౌన్సెలింగ్
అదనపు సీట్లు ఇలా..
రాష్ట్రంలో 20 నాన్ మైనారిటీ, 4 మైనారిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం 3,750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనారిటీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 1120 సీట్లున్నాయి. ఆ సీట్లకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు నీట్ ర్యాంకు ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పటివరకు ఉంది. కానీ ప్రస్తుతం సవరించిన నిబంధనలతో బీ కేటగిరీలో ఉన్న 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగతా 15 శాతం (168) సీట్లకు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడే వీలు ఉంటుంది. ఓపెన్ కోటా కాబట్టి ఇందులోనూ తెలంగాణ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మైనారిటీ కాలేజీలో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటివరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి.
చదవండి: PG Admissions : పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
ఇతర రాష్ట్రాల వారికి చెక్
ఇప్పటివరకు బీ కేటగిరీలో ఉన్న 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు అమలు చేయక పోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు ఎక్కువ ఫీజు చెల్లించి ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను కొనుగోలు చేయాల్సి వచ్చేది. బీ కేటగిరీ ఫీజుకు రెండింతలు ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు చెల్లించాల్సి వచ్చేది. లేదా ఇతర రాష్ట్రాలకు, ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లి అక్కడ ఎక్కువ ఫీజుతో చేరాల్సి వచ్చేది. దీనిపై మంత్రి హరీశ్‌రావు ఆదేశం మేరకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధికారులు అధ్యయనం చేశారు. అనంతరం తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుండి అన్ని బీ కేటగిరీ సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేయడం గమనార్హం.
రాష్ట్రంలోనే డాక్టర్ కల సాకారం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి వైద్య విద్యను పటిష్టం చేస్తున్న క్రమంలో, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ స్థానిక విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బీ కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్ 85 శాతానికి పెంచి తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. డాక్టర్ కావాలనే కలను రాష్ట్రంలోనే ఉండి చదివి సాకారం చేసుకోవాలనుకునే ఎంతోమందికి దీనిద్వారా గొప్ప అవకాశం కల్పించింది.
– హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
చదవండి: TS: మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీఎంఈల వయోపరిమితి 65 ఏళ్లకు పెంపు