Skip to main content

Raksha Bandhan: అన్న- చెల్లి బంధానికి ప్రతీక రాఖీ పండుగ.. రక్షా బంధన్‌ ఎలా మొదలైంది?

ఆత్మీయత.. ఆప్యాయత.. సోదరభావం.. భద్రత ఇవన్నీ మిళితమైన సెంటిమెంటే రాఖీ పండుగ.
Raksha Bandhan
అన్న- చెల్లి బంధానికి ప్రతీక రాఖీ పండుగ.. రక్షా బంధన్‌ ఎలా మొదలైంది?

 అందుకే అన్నకు చెల్లి... తమ్ముడికి అక్క రాఖీ కట్టి ఆశీర్వాదాలొకవైపు.. అండగా ఉంటా అనే భరోసా మరోవైపు.. ఇలా భిన్న పార్శ్వాలు కనిపించే సెంటిమెంట్ పండుగ రాఖీపౌర్ణమి. అయితే, రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకున్న ఓ చిన్నారి.. కాస్త భిన్నంగా రాఖీని తానే స్వయంగా తయారు చేసిన కథే ఇది.

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మామిడి సహస్ర తల్లి ఇంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే, అమ్మతో పాటు కుట్లు, అల్లికలూ ప్రాక్టీస్ చేస్తున్న సహస్రకు ఓ ఆలోచన తట్టిందే ఆలస్యం.. ఓ క్లాత్ తీసుకుని దానిపై పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఆకట్టుకునేలా ఓ రాఖీగా మల్చింది.  అంతేకాదు.. తమ్ముడు అని ఎంబ్రాయిడరీ చేసిన ఆ రాఖీని రేపు రాఖీ పున్నమ సందర్భంగా తన సోదరుడికి కట్టబోతోంది చిన్నారి సహస్ర.

అలా సహస్ర ఐడియా షాపుకెళ్లి రాఖీ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చేస్తూనే.. అందరికంటే భిన్నమైన రాఖీని తమ్ముడికి కట్టేందుకు కారణమైంది.

రక్షా బంధన్‌ ఎలా మొదలైంది?

రక్షాబంధన్‌పై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా సోదరుల క్షేమాన్ని కాంక్షించి అక్కాచెల్లెళ్లు మహావిష్ణువును ధ్యానిస్తూ సోదరుల చేతికి రక్ష కట్టే సందర్భంగా చెబుతారు. అందుకే ఈ పండుగను రక్షాబంధనం అంటారు. దీన్ని శ్రావణ పౌర్ణమి రోజున తోడబుట్టిన వాళ్లు తన సోదరులకు రాఖీ కట్టి తమ పేగుబంధాన్ని చాటుకుంటారు.

బలి చక్రవర్తితో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన ఇంద్రుడు తన సర్వాధిపత్యాన్ని కోల్పోతాడు. పూర్వవైభవం కోసం విష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకునేందుకు సిద్ధమవుతాడు. ఆ తరుణంలో భరత విజయాన్ని కాంక్షిస్తూ ఇంద్రుడి భార్య శచీదేవి ఆదిపరాశక్తిని స్మరిస్తూ కంకణం కడుతుంది. ఇది తొలి రాఖీ అని పురాణాల్లో చెబుతుంటారు.

Raksha Bandhan

నిజానికి రక్షాబంధన్‌ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన పండుగ. అప్పట్లో రాజపుత్రులు ఎక్కువగా ఈ వేడుక జరుపుకునేవారని చెబుతారు. రాజపుత్ర రాజైన పురుషోత్తముడు అలెగ్జాండర్‌తో జరిగిన యుద్ధంలో ఓడిపోవడానికి ఈ రక్షాబంధనమే కారణమంటారు. అలెగ్జాండర్‌ భార్య రొక్సానా పురుషోత్తముడికి రాఖీ కట్టి తనకు పతిభిక్ష పెట్టమని వేడుకున్నందునే కావాలని ఓడిపోయాడనేది కొందరి కథనం. యేనాబద్దో బలిరాజా.. దానవేంద్రో మహాబలం.. తేనేత్వ మబిబద్నామి రక్షే మాచల.. అంటే ఓ రక్షాబంధమా.. మహా బలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అని పురాణ కవుల నుంచి వినిపిస్తోంది. మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతడితో పాటు పాతాళంలో ఉండిపోతాడు.

మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. ధర్మరాజు రక్షాబంధనం గురించి అడగ్గా శ్రీకృష్ణుడు ఈ గాథను వివరించినట్లు పురాణాల్లో ఉంది.

Published date : 31 Aug 2023 01:18PM

Photo Stories