Education: డిగ్రీలు కాదు .. నైపుణ్యానికే ప్రాధాన్యత
అత్యున్నత ప్రమాణాలతోనే తెలంగాణ విద్యకు భవిష్యత్తు ఉంటుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా సమూల సంస్కరణలు అవసరమని సూచించారు. పారిశ్రామిక అవసరాల వేగాన్ని తట్టుకునేలా బోధన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉపాధి అవకాశాల్లో మార్కులతో కూడిన డిగ్రీల కన్నా నైపుణ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే వాస్తవాన్ని విశ్వవిద్యాలయాలు గుర్తించాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో బేసిక్ నాలెడ్జ్ అతి ముఖ్యమైనదని చెప్పారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఒడియన్ స్కూల్, అనురాగ్ యూనివర్సిటీ డిసెంబర్ 8న సంయుక్తంగా ‘భవిష్యత్తులో తెలంగాణ విద్య’అంశంపై సదస్పు నిర్వహించా యి. పలువురు విద్య, పారిశ్రామిక రంగ నిపుణులు విద్యారంగంలో మార్పులపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. విజ్ఞానం, విలువలు అందించే పురాణేతిహాసాలను నేటి తరానికి అందించాలని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎక్స్‌పోర్ట్ కమిటీ సదరన్ కౌన్సిల్ చైర్మన్ జీబీ రావు అభిప్రాయపడ్డారు. సాంకేతిక విద్యలో డిగ్రీలు లేని వాళ్లే ఎక్కువగా వృత్తి పరమైన నైపుణ్యం కనబరుస్తున్నారని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) వ్యవస్థాపకులు జేఏ చౌదరి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలిచ్చే సంస్థలు యూనివర్శిటీ డిగ్రీలకే పరిమితం కావడం లేదని, వాళ్లలో ఉన్న నైపుణ్యం ఏంటో గమనిస్తున్నాయని కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ చెప్పారు. జోహో, సిగ్మా, గూగుల్ వంటి కంపెనీలు విద్యార్థుల నైపుణ్యానికే ప్రాధాన్యతనివ్వడం విద్యా ప్రమాణాలు పెరగాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. విద్యార్థుల ఆలోచనలకు విరుద్ధంగా తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్, ఇంజనీరింగ్ మాత్రమే చదవాలని ఒత్తిడి చేయడం మంచి ఫలితాలనివ్వవని ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా బలమైన విద్యావ్యవస్థ మూలాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఉన్నత విద్య మండలి వైఎస్ చైర్మన్ వి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Jobs: పోస్టులకు అర్హులు లేకుంటే ఓపెన్ కేటగిరీలో భర్తీ.. దరఖాస్తులు స్వీకరణకి చివరి తేదీ ఇదే..