Collector P.Uday Kumar: 290 పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం
నాగర్‌కర్నూలు: జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద మొదటి విడతగా చేపట్టిన 290 పాఠశాలల్లో చేపట్టిన పనులు సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులతో సోమవారం సమావేశమై మాట్లాడారు. మన ఊరు మన బడి పనులను ఆయా ఇంజినీరింగ్ శాఖాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయా ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని త్వరగా పూర్తి చేయాలన్నారు. రూ.30లక్షలలోపు అంచనా గల 217 పాఠశాలలు, రూ.30 లక్షలు పైగా అంచనాగల 73 పాఠశాలల వారీగా పనుల పురోగతి ఎప్పటివరకు పూర్తి చేస్తారో అనే వివరాలను ఏఈ వారీగా సమీక్షించారు. ఇప్పటివరకు రూ.15 కోట్లు విడుదల చేశామని, అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయిస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని, రాజీ పడవద్దన్నారు. మండలాల వారీగా పురోగతి పనులను సమీక్షించి జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో పూర్తి అయ్యేలా లక్ష్యం నిర్ణయించారు. జిల్లాలో రెండో విడత పాఠశాలలను సైతం ఆగస్టులో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్, డీఈఓ గోవిందరాజులు, ఈఈలు దామోదర్ రావు, రామచంద్ర రావు, డిప్యూటీ ఈఈలు దుర్గాప్రసాద్, ప్రతాప్, నాగలకి్‌ష్మ్, నయుముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.