Skip to main content

ICAR: వ్యవసాయ విద్యలో మన వర్సిటీకి 11వ ర్యాంక్‌

వ్యవసాయ విద్యలో ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందడుగు వేస్తోంది.
ICAR
వ్యవసాయ విద్యలో రంగా వర్సిటీ ముందడుగు

జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తోంది. 2020 విద్యా సంవత్సరానికి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) ప్రకటించిన ర్యాంకుల్లో ఈ వర్సిటీ జాతీయ స్థాయిలో 11వ స్థానం పొందింది. 2019లో 13వ ర్యాంకులో ఉన్న వర్సిటీ మరింత మెరుగైన పనితీరుతో రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. 2019లో 64వ స్థానంలో ఉన్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ఈసారి 57వ ర్యాంకు పొందింది. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్న గూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం (హార్టీకల్చర్‌ వర్సిటీ) ర్యాంకుల్లో వెనుకబడింది. 2019లో 34వ స్థానంలో ఉన్న ఉద్యాన వర్సిటీ ఇప్పుడు 49వ స్థానానికి పడిపోయింది. దేశంలోని మొత్తం 67 వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన వర్సిటీలకు ఐసీఏఆర్‌ ప్రతి ఏటా ర్యాంకుల్ని ప్రకటిస్తుంది. ర్యాంకుల ఆధారంగానే విద్యా సంబంధిత ప్రాజెక్టులకు నిధులు ఇస్తుంది. విద్యార్థులు కూడా ర్యాంకుల ఆధారంగానే కళాశాలల్లో చేరుతుంటారు.

సీఎం ఆశయ సాధనలో భాగంగా..

11వ ర్యాంకు సాధించడం పట్ల ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఏ విష్ణువర్ధన్ రెడ్డి హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని, ఆయన ఆశయ సాధనకు వర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సమష్టిగా కృషి చేస్తున్నారని, దాని ఫలితమే ఈ ర్యాంకు అని చెప్పారు. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని, రానున్న రోజుల్లో మరింత మంచి ర్యాంకు సాధించడానికి ప్రతి ఒక్కరూ దీక్ష బూనాలని ఆయన సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. రైతులకు వ్యవసాయ కేంద్రాలలోని ఫలితాలు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తామన్నారు.

తెలంగాణ వర్సిటీల ర్యాంకులు

తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం 30వ ర్యాంకు సాధించింది. శ్రీ కొండా లక్ష్మణ్‌ ఉద్యానవర్సిటీ 62వ స్థానంలో, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ 64వ స్థానంలో నిలిచాయి.

చదవండి: 

‘ఐసీఏఆర్’ ర్యాంకింగ్స్ లో బెస్ట్ యూనివర్సిటీలు ఇవే

ఎన్జీ రంగా వర్సిటీతో ఎంవోయూ.. ఎందుకంటే..

దూరవిద్యలో వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులు!

Published date : 04 Dec 2021 12:44PM

Photo Stories