Skip to main content

Andhra Pradesh: నవోదయం.. విద్యార్థులకు శుభోదయం

విశాఖ విద్య: జిల్లాలోని కొమ్మాదిలో గల నవోదయ విద్యాలయంలో విద్యార్థుల భవిష్యత్‌కు పటిష్టమైన పునాదులు వేసేలా ఉన్నత ప్రమాణాలతో చదువులు సాగుతున్నాయి.
Navodaya students   Visakha Vidyalaya Education System  Navodaya Vidyalaya Kommadi Classroom

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అండగా నిలుస్తోండటంతో ఇక్కడి విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌తో బోధన సాగుతుండటంతో కొమ్మాది నవోదయ విద్యాలయంలో చేరేందుకు విద్యార్థులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

ఆరో తరగతిలో సీటు లభిస్తే, 12వ తరగతి (ఇంటర్మీడియెట్‌) వరకు ఇక్కడ ఉచితంగానే చదువుకోవచ్చు. 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నవోదయ విద్యాలయ అధికారులు సిద్ధమయ్యారు. 6, 9వ తరగతులతో పాటు, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అర్హులైన ప్రతిభ గల విద్యార్థులకు అడ్మిషన్‌ కల్పించే నిమిత్తం ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో 12 సీట్లు, 9వ తరగతిలో 11 సీట్లు ప్రస్తుతం ఖాళీ ఉండటంతో వీటి భర్తీ కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

చదవండి: Jawahar Navodaya Vidyalayas: విద్యాల‌య ప్ర‌వేశానికి జాతీయ స్థాయిలో ప‌రీక్ష‌లు..

ఎన్‌ఈపీ అమలుతో క్రేజ్‌

కొమ్మాదిలోని నవోదయ విద్యాలయంలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు సైతం వర్తింపజేస్తున్నారు. 6 నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన జరుగుతోంది.

2023–24 విద్యా సంవత్సరంలో 442 మంది చదువుతున్నారు. వీరిలో బాలురు 235 మంది, బాలికలు 207 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన విద్యాలయంలో అడ్మిషన్లు కల్పిస్తున్నారు.

జాతీయ విద్యావిధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సీబీఎస్‌సీ సిలబస్‌తో బోధన సాగే నవోదయ విద్యాలయానికి క్రేజ్‌ బాగా పెరిగింది.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పెద్దపీట

6వ తరగతిలో ఒక్కో సెక్షన్‌కు 40 మంది చొప్పున మొత్తం 80 మందికి ప్రవేశం కల్పించనున్నారు. అదే విధంగా 12వ తరగతి (ఇంటర్మీడియట్‌)లో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూపుల్లో మొత్తం 45 మందికి అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ ఎక్కువగా చదువుకుంటున్నారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం 2024 జనవరి 10న, ఇంటర్మీడియట్‌కు ఫిబ్రవరి 10న ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకే సీటు సొంతమౌతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంతం వారికి 25 సీట్లు కేటాయించనున్నారు.

విద్యార్థుల అభ్యున్నతికి కృషి

పేద వర్గాలకు చెందిన పిల్లలే ఇక్కడ చదువుతున్నారు. వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా చదువులు చెబుతున్నాం. కార్పొరేట్‌ మాదిరి బట్టీ చదువులు కాకుండా, ఒత్తిడి లేని చదువులు అందిస్తాం. ఆటపాటలతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నాం. విద్యార్థులకు దేశంలో ఎక్కడ పోటీలు జరిగినా మా నవోదయ విద్యాలయ పిల్లలు భాగస్వామ్యయ్యేలా శ్రద్ధ తీసుకుంటాం.
– కె.సంజయ్‌, ప్రిన్సిపాల్‌, కొమ్మాది నవోదయ విద్యాలయం
 

Published date : 04 Dec 2023 12:25PM

Photo Stories