Skip to main content

Digital Teaching: హైటెక్‌ బోధన.. ఆన్‌లైన్‌ సాధన.. ఇక్క‌డ‌ విద్యలో అంతా టెక్నాలజీయే..

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌లాంటి అత్యాధునిక సాంకేతిక కోర్సుల బోధన తొమ్మిదవ తరగతి నుంచే మొదలు పెడుతున్నారు. ఈ కోర్సుల డిజైన్, బోధన ప్రణాళిక విషయంలోనూ విద్యా కమిటీలదే పూర్తి అజమాయిషీ. గూగుల్‌ క్రోంలో వర్క్‌ షీట్లు, అందులోనే మూల్యాంకన విధానం విద్యార్థులను సాంకేతిక పురోగతి వైపు తీసుకెళ్తున్నాయి. మన విద్యా విధానంలోనూ ఇలాంటి సంస్కరణలు అవసరం అంటున్నారు అమెరికా విద్యా విధానాన్ని పరిశీలించిన తెలంగాణ ఉపాధ్యాయుడు సంక్రాంతి రవి కుమార్‌.
Hi tech teaching

అమెరికాలో నిర్వహించిన ‘ఫుల్‌ బ్రైట్‌ టీచింగ్‌ ఎక్సలెన్స్‌ అచీవ్‌మెంట్‌ ప్రోగ్రాం’లో భాగంగా ఆయన అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశారు. ఇందులో మొత్తం 60 దేశాల నుంచి టీచర్లను ఎంపిక చేయగా, మనదేశం నుంచి ఎంపికైన ఏడుగురిలో రవికుమార్‌ ఒకరు. ఒహియోలో రాష్ట్రంలోని కెంట్‌ నగరంలో 50 రోజుల పాటు అక్కడి విద్యా విధానంపై ఈయన అధ్యయనం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవికుమార్‌ అమెరికా విద్యా విధానంపై తన పరిశీలనను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

అడుగడుగునా టెక్నాలజీ..

అమెరికాలో సెకండరీ విద్య పూర్తిగా ఉచితం. ప్రైవేటు స్కూళ్లు కనిపించవు. ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో నడిచే స్కూళ్లలో ఎక్కువ భాగం సాంకేతిక పరిజ్ఞానం కనిపిస్తోంది. పెన్, నోట్‌బుక్‌ ఎప్పుడో దూరమయ్యాయి. గూగుల్‌ క్రోం బుక్స్‌లో అసైన్‌మెంట్స్‌ ఇస్తారు. అందులోనే మూల్యాంకనం చేస్తారు. అయితే, విద్యార్థులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే అవకాశం ఉందని టీచర్లు అంటున్నారు. 

చదవండి: Telangana Breaking News: 3,673 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ బోధన

ఆక్యులెస్, మెటాక్వెస్ట్‌ వంటి పరికరాలు, వర్చువల్‌ రియాలిటీ వంటి సాంకేతికతత అక్కడ ప్రతీ స్కూల్‌లో కనిపిస్తున్నాయి. ప్రయోగాలను వర్చువల్‌ రియాలిటీ ద్వారా తెలుసుకునే విధానం ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా నాలెడ్జ్‌ పొందడంలో అమెరికన్‌ విద్యార్థులు ముందున్నారు. ఇందుకు తగ్గ అప్లికేషన్లు కూడా అందుబాటులోకి తెచ్చారు.

9వ తరగతి నుంచే భవిష్యత్‌ ప్రణాళిక

విద్యార్థి భవిష్యత్‌ నిర్దేశం 9వ తరగతిలోనే మొదలవుతుంది. 11 రకాల వృత్తి విద్యా కోర్సులను ఈ దశలోనే అందుబాటులోకి తెచ్చారు. డాక్టర్, ఇంజనీర్, టీచర్‌... ఇలా ఏ రంగాన్ని ఎంచుకున్నా 9వ తరగతిలో పునాది పడుతుంది. దీంతో సబ్జెక్టుపై విద్యార్థికి పట్టు పెరుగుతుంది. అక్కడ విద్యతో పాటు సామాజిక, సాంస్కృతిక అంశాలకూ ప్రాధాన్యమిస్తున్నారు. సంగీతం, గేమ్స్, మోడ్రన్‌ మ్యూజిక్‌.. ఇలా ఏదో ఒక అంశాన్ని విద్యార్థి నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. 

చదవండి: Free Job Vacancies Information: ‘డీట్‌’తో మరిన్ని ప్రైవేటు కొలువులు!.. ఉచితంగా ఉద్యోగ ఖాళీల సమాచారం.. రిజిస్ట్రేషన్‌ చేసుకోండి ఇలా..

నైపుణ్యానికి పెద్దపీట

ఇంజనీరింగ్‌ విద్య అమెరికాలో భిన్నంగా ఉంది. థియరీ కన్నా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పొందే బోధన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇంజనీరింగ్‌ విద్యలో ఎక్కడికో వెళ్లి ఇంటర్న్‌షిప్‌ చేయడం ఉండదు. ప్లానింగ్, డిజైనింగ్‌ ఇంజనీరింగ్‌ విద్యలో భాగం. ఏదో ఒక కొత్త ప్రయోగాన్ని విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేయాలి. ఈ విధానం పాఠశాల విద్యలోనూ కనిపిస్తుంది. దీనివల్ల విద్యార్థిలో నైపుణ్యం పెరుగుతుంది. అయితే, భారత విద్యార్థులకంటే గణితంలో అమెరికా విద్యార్థులు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు.  

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

టీచర్లు, అదనపు టీచర్లు..

ప్రతి క్లాసులోనూ 20–24 మంది విద్యార్థులనే అనుమతిస్తారు. ఒక్క విద్యార్థి పెరిగినా కొత్త సెక్షన్‌ నిర్వహించాల్సిందే. ప్రతి సబ్జెక్టుకూ టీచర్లతోపాటు అదనపు టీచర్లనూ నియమిస్తారు. ప్రతి సబ్జెక్టును, క్లాసును విద్యా కమిటీలు పర్యవేక్షిస్తాయి. లోపాలను టీచర్లకు చెబుతాయి. 

కమ్యూనిటీ పరంగా ఎక్కువ నిధులు ఇచ్చే సంస్థల పర్యవేక్షణలోనే విద్యా కమిటీలు ఏర్పడతాయి. వీటిపై ప్రభుత్వ పెత్తనం ఏమాత్రం ఉండదు. టీచర్ల నియామకం విషయంలోనూ కమిటీలు అన్ని అర్హతలు పరిశీలిస్తాయి. కొన్ని నిబంధనల మేరకు వీళ్లు పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం కుదరదు.

ప్రభుత్వానికి నివేదిక ఇస్తా..
విద్యా విధానంలో మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అమెరికా విద్యా విధానంపై సమగ్ర అధ్యయనం అవసరం. నేను అక్కడ గమనించిన ప్రతి అంశాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలో విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళికి కూడా నివేదిక పంపుతా. సాంకేతికంగా అభివృద్ధి పథంలోకి రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకెళ్లడానికి అమెరికాలోని కొన్ని మంచి అంశాలను మనం స్వీకరించాల్సిందే. 
– సంక్రాంతి రవి కుమార్‌  

Published date : 17 Jan 2025 09:26AM

Photo Stories