Skip to main content

Fee Reimbursement: విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బులేయండి

దళిత విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధన పెట్టింది.
Fee Reimbursement
విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బులేయండి

ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని విద్యా సంస్థలకు కాకుండా నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని తేల్చి చెప్పింది. అప్పడే కేంద్రం నుంచి పథకం వాటా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఆ మేరకు ఖచి్చతమైన హామీనిస్తూ నిర్ణయం తీసుకొని కేంద్రానికి నివేదికివ్వాలని ఆదేశించింది.

కేంద్రం వాటా 15 నుంచి 60 శాతానికి పెంపు

పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించి ఉపకారవేతనాలను విద్యార్థి ఖాతాలో.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విద్యార్థి పేరిట కాలేజీ యాజమాన్యం ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన ఈ పద్ధతినే రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా పాటిస్తోంది. అయితే కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు ఇవ్వడాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆక్షేపిస్తోంది. ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను నేరుగా విద్యార్థి ఖాతాకే ఫీజు నిధులు ఇవ్వాలని తాజాగా ఆదేశించింది. మరోవైపు ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో కేంద్ర వాటా గతంలో 15 శాతం ఉండగా రాష్ట్రం వాటా 85 ఉండేది. అయితే 2021 నుంచి కేంద్రం నిధులను 60 శాతం ఇస్తోంది. రాష్ట్ర వాటా కంటే కేంద్రం వాటా ఎక్కువగా ఉన్నందున కేంద్రం నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర సర్కారుకు చెప్పింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి ఆర్‌.సుబ్రమణ్యం ఫిబ్ర‌వ‌రి 19న‌ హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం స్పష్టం చేశారు.

కొత్త నిబంధనతో నష్టమే

ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల కింద కేంద్ర, రాష్ట్రాలు ఏటా రూ.440 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం సగటున 2.3 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం తాజా నిబంధనతో ఇబ్బందులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ది శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఖాతాకు ఫీజు నిధులు విడుదల చేస్తే కాలేజీ యాజమాన్యానికి చెల్లించడంలో జాప్యం జరుగుతుందని, అలాగే నిధుల విడుదలలో జాప్యం జరిగితే విద్యార్థి వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తుందని వాదనలు వాదనలు వినిపిస్తున్నాయి. ఫీజుల విషయంలో కాలేజీలు కచ్చితత్వాన్ని పాటించే ప్రమాదం ఉందన్నారు. దీని వల్ల చివరకు డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతుందని విమర్శలూ వస్తున్నాయి.

గత ఐదేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ పొందిన ఎస్సీ విద్యార్థులు

సంవత్సరం

రెన్యువల్స్‌

ఫ్రెషర్స్‌

2016–17

1,45,875

1,04,144

2017–18

1,31,706

1,08,365

2018–19

1,23,894

1,00,791

2019–20

1,21,447

98,550

2020–21

1,25,801

1,00,027

చదవండి:

Fee Reimbursement: అప్పు చేసి ఫీజు కడుతున్న వైనం

11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు

Fee Reimbursement: బోగస్‌ పేర్లతో ఫీజురీయింబర్స్‌మెంట్‌ స్వాహా

Published date : 21 Feb 2022 03:41PM

Photo Stories