Gaurishankar: చదువే కాదు.. సాహిత్యమూ ముఖ్యమే
ఆ దిశగా ప్రత్యేక కార్యక్రమాలు
కోవిడ్ కారణంగా గతేడాది నిలిచిపోయిన పుస్తక ప్రదర్శనను డిసెంబర్ 18 నుంచి 28 వరకు 10 రోజులపాటు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నాం. తెలంగాణలో కోటి మందికిపైగా విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్నారు. ఈ పిల్లలంతా తమ పాఠ్యపుస్తకాలతో పాటు సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయాలి. సామాజిక చింతనకు, ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చు కొనేందుకు సాహిత్య అధ్యయనం ఒక్కటే మార్గం. సాహిత్యాన్ని జీవితంలో భాగంగా చేసుకున్న వాళ్లే గొప్ప విజేతలుగా నిలిచారు. ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈసారి ప్రత్యేక కార్యక్రమాలను, సదస్సులను ఏర్పాటు చేయబోతున్నాం.
మహానగరం నుంచి మారుమూల పల్లెకు...
హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ గత ఆరేళ్లుగా ఎంతో కృషి చేసింది. తెలంగాణ అంతటా పుస్తకపఠనంపై అనేక కార్యక్రమాలను నిర్వ హించింది. దీంతో పుస్తక ప్రదర్శన కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాలకు, పల్లెలకు చేరింది. ఈసారి పుస్తక ప్రదర్శనలో పర్యావరణ పరిరక్షణపైన ప్రత్యేక కార్యక్ర మాలు ఏర్పాటు చేయదలిచాం. సదస్సులు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కవులు, రచయితలు, కళాకారులు పాల్గొంటారు. అలాగే ప్రత్యామ్నాయ సినిమా పైన కూడా ఒకరోజు సదస్సు నిర్వహించి చర్చలను ఆహ్వానిస్తాం, గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలపైన సమాలోచనలు ఉంటాయి. కోవిడ్ దృష్ట్యా ప్రతి స్టాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి.
పఠనాసక్తి పెరిగింది..
ప్రపంచవ్యాప్తంగా పఠనాసక్తి పెరిగింది. పుస్తకపఠనంలో థాయ్లాండ్ తర్వాత భారతదేశం రెండోస్థానంలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఆ తరువాత చైనాలో ఎక్కువమంది పుస్తకాలు చదువుతున్నారు. కోవిడ్ లాక్డౌన్ కాలంలో వినోద కార్యక్రమాలను వీక్షించడం కంటే ఎక్కువమంది పుస్తక పఠనంతోనే గడిపారు. కొత్తగా చదివే అభిరుచిని అలవర్చుకున్నవాళ్లు కొందరైతే, తమ చదివే అభిరుచికి మరింత పదునుపెట్టుకున్న వాళ్లు మరికొందరు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. నచ్చిన పుస్తకం చదవడంలోనే గొప్ప ఆనందం, సంతృప్తి ఉంటాయి. ఈసారి పుస్తక ప్రదర్శనపట్ల అనూహ్యమైన ఆసక్తి కనిపిస్తోంది.
జూలూరు గౌరీశంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ అధ్యక్షుడు