Skip to main content

NMC: విదేశీ వైద్య విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లో ఎంబీబీఎస్, తత్సమాన మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన విద్యారులు రాష్ట్రంలో కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ (సీఆర్‌ఎంఐ) చేసుకునేందుకు జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ప్రత్యేక అనుమతిచ్చింది.
NMC
విదేశీ వైద్య విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

ఈ మేరకు మే 12న ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉన్న రాష్ట్రంలోని 51 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల వివరాలను పొందుపరిచింది. ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఎంజీఈ) పాసైన విద్యార్థులంతా రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విధంగా ఇంటర్న్‌షిప్‌ చేసే వారికి స్టైఫండ్‌ కూడా ఇవ్వాలని ఎన్‌ఎంసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.  

చదవండి: MBBS Seats: విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌... ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఎంబీబీఎస్ సీటు

3,585 మందికి అవకాశం 

కరోనా కాలంలోనూ, ఆ తర్వాత అనేకమంది విదేశీ ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లు వైద్యవిద్యను అభ్యసించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. కొందరు అక్కడకు వెళ్లి చదవగా, చాలామంది ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా మెడికల్‌ కోర్సు పూర్తిచేశారు. అలా విదేశీ వైద్యవిద్య పూర్తి చేసినవారు తర్వాత దేశంలో మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ కోసం, ప్రాక్టీస్‌ కోసం ఎఫ్‌ఎంజీఈ పరీక్ష రాయాల్సి ఉందన్న సంగతి తెలిసిందే. అలా ఎఫ్‌ఎంజీఈ పరీక్ష పాసైన వారు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంది. గతంలోనూ విదేశీ గ్రాడ్యుయేట్ల కోసం కొన్ని కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉండగా, ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న 51 ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి వీలు కల్పించారు. మొత్తం 3,585 మంది ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు అవకాశం ఉంది.

చదవండి: NMC: వైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్‌.. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఇన్ని కళాశాలలు

ఇప్పటివరకు ఎంబీబీఎస్‌ బ్యాచ్‌ బయటకు రాని మెడికల్‌ కాలేజీల్లో ఆయా కాలేజీలకు చెందినవారు ఇంటర్న్‌షిప్‌కు చేరుకోనందున, అక్కడ పూర్తిస్థాయిలో విదేశీ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించారు. అనుమతించిన మెడికల్‌ కాలేజీల్లోనే ఇంటర్న్‌షిప్‌ చేయాలి. వారికి సంబంధిత రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ ద్వారానే మెడి­కల్‌ కాలేజీ కేటాయింపు జరుగుతుంది. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం లేదా ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రెండేళ్లలోపు దీనిని పూర్తిచేయాలి. విదేశీ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌లను మెరి­ట్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ లేదా సీట్ల కేటాయింపు ద్వారా వివిధ వైద్య కళాశాలలకు కేటాయిస్తారు. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరంలో ఉండి, కోవిడ్‌ లేదా ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కారణంగా భారత్‌కు వచ్చిన విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది.  

చదవండి: Medical and Health Department: ఈ పోస్టులకూ ఆన్‌లైన్‌ పరీక్ష.. పరీక్ష సిలబస్‌ ఇదే..

Published date : 13 May 2023 03:25PM

Photo Stories