Skip to main content

అటు నైపుణ్యం... ఇటు ఉద్యోగం

ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
Internship and skill training
అటు నైపుణ్యం... ఇటు ఉద్యోగం

విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్‌షిప్‌.. మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కేవలం ఒక్క ఇంజనీరింగ్‌ కోర్సులకే కాకుండా అన్ని డిగ్రీ కోర్సులకు ప్రభుత్వం ఇంటర్న్‌షిప్‌ను వర్తింపచేసింది. ఆయా కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను కొనసాగించడానికి వీలుగా 27 వేలకుపైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసింది. ఇంటర్న్‌షిప్‌ కోసం ఏకంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో మూడేళ్ల డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల కాలపరిమితితో హానర్స్‌ కోర్సులుగా మార్చింది. విద్యార్థుల్లో స్కిల్స్‌ను పెంచడం కోసం నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. దీనితోపాటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంతో విద్యార్థులు మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ప్రభుత్వ చర్యలతో ప్లేస్‌మెంట్స్‌ ఏటా అంతకంతకూ పెరుగుతున్నాయి.

చదవండి: Reskilling and Upskilling: స్కిల్‌.. అప్‌స్కిల్‌.. రీ–స్కిల్‌...

ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ..

రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌తోపాటు తదితర సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మైక్రోసాఫ్ట్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌ కింద 1.62 లక్షల మందికి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనాలసిస్, నెట్‌వర్కింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సర్టిఫికేషన్‌ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.37 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోంది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, పైథాన్, క్లౌడ్, డేటా అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటా, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది.

చదవండి: Skill Training: లక్ష మందికి నైపుణ్య శిక్షణ

నాస్కామ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ పేరిట..

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) ఫ్యూచర్‌ స్కిల్స్‌ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్‌ విభాగాల్లో వర్చువల్‌గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ప్రెస్‌’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్‌వీస్, హోండా, మారుతి సుజికి వంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, బీఎఫ్‌ఎస్‌ఐ అనలిస్ట్‌ తదితర అంశాల్లో ఈ శిక్షణ అందించింది. అదేవిధంగా ఎడ్యుస్కిల్స్‌ ఫౌండేషన్‌ సంస్థతో వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమానికి వీలుగా ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.50 లక్షల మంది విద్యార్థులకు ఈ సంస్థ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ అందించనుంది. మరోవైపు ప్రీ–మాస్టర్‌ ఇండియా’ పేరుతో మన దేశంలో జర్మనీ ప్రారంభించిన కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆ దేశంలోని అవకాశాలను దక్కించుకునేలా చర్యలు చేపట్టింది. దీని ద్వారా రాష్ట్ర విద్యార్థులు బీటెక్‌ పూర్తిచేశాక జర్మనీలో మాస్టర్స్‌ డిగ్రీని అభ్యసించడంతోపాటు నేరుగా అక్కడి ఉద్యోగాల్లో కొలువుదీరుతున్నారు.

చదవండి: Skill Training: యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ

ప్లేస్‌మెంట్లలో గణనీయ ప్రగతి

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గత మూడేళ్లలో విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో ప్లేస్‌మెంట్ల సంఖ్య 37 వేలు మాత్రమే కాగా ఇప్పుడు ఆ సంఖ్య 69 వేలకు చేరుకుంది. వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ సంఖ్య లక్షను దాటుతుందని అంచనా. 2018–19లో 2.5 లక్షల మంది వివిధ స్థాయిల విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తిచేయగా అప్పట్లో 37 వేల ప్లేస్‌మెంట్లు మాత్రమే లభించాయి. 2019–20లో 3.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యను ముగించుకొని బయటకు రాగా ప్లేస్‌మెంట్లు 51 వేలకు పెరిగాయి. 2020–21లో 4.2 లక్షల మంది ఉన్నత విద్యార్థులు చదువులు ముగించగా వారిలో 69 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. కరోనా సమయంలోనూ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే ఈ పెరుగుదల సాధ్యమైంది.

చదవండి: నిరుద్యోగ యువతకు భరోసా

విభాగాలవారీగా ఇంటర్న్‌షిప్‌ కోసం ఎంపిక చేసిన సంస్థలు

కేటగిరీ

మాన్యుఫాక్చరింగ్‌

సర్వీస్‌

మైక్రో

11,510

1,378

స్మాల్‌

10,169

1,757

మీడియం

569

149

లార్జ్‌

1,191

227

మెగా

144

25

Published date : 29 Jul 2022 01:33PM

Photo Stories