Skip to main content

Collector Nishanth Kumar: పార్వతీపురంలో ఇన్నోవేషన్‌ హబ్‌

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో నీతిఆయోగ్‌ ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టు కింద ఇన్నోవేషన్‌ హబ్‌, అనుభవ పూర్వక అభ్యాస కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ తెలిపారు.
Innovation hub at Parvathipuram

నీతిఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం న‌వంబ‌ర్ 1న‌ ఆశావహ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆశావహ జిల్లాల కింద పార్వతీపురం మన్యం జిల్లాకు నీతి ఆయోగ్‌ ప్రోత్సాహకంగా రూ. 3కోట్లు మంజూరు చేసి ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. ఈ మేరకు అభ్యాస కేంద్రమైన ఇన్నోవేషన్‌ హబ్‌ను స్థాపించడానికి పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం ప్రాజెక్టును సిద్ధం చేసిందని కలెక్టర్‌ చెప్పారు.

చదవండి: Sky Bus: స్కై బస్సు సర్వీస్‌ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేయడంతో పార్వతీపురం జిల్లాను మరోసారి ప్రశంసించడం పట్ల నీతి ఆయోగ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనుభవ పూర్వకంగా విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులను ప్రోత్సహించడం, పరిశీలన, డేటా రికార్డుచేయడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను పెంపొందించడం, నాణ్యమైన విద్యను సాధించడం, విద్యార్థులు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో ఉన్నత చదువులు చదవాలనే సంకల్పంతో జిల్లాలో ప్రతిపాదించామన్నారు.

లక్షల మందికి ప్రయోజనం

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు, గిరిశిఖర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల నుంచి ఆర్ధిక స్థోమత లేని గిరిజన సమూహాల నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు గల సుమారు 2లక్షల 21వేల 917మంది విద్యార్థులు ఈ ప్రాజెక్టు నుంచి ప్రయోజనం పొందబోతున్నారని కలెక్టర్‌ అన్నారు. జేఎన్‌టీయూ, ఆంధ్రా యూనివర్సిటీ తదితర ప్రాంతాల నుంచి మాస్టర్‌ ట్రైనర్లను గుర్తించామని, పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఈ ప్రాజెక్టును 15 రోజుల్లో ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం యోచిస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవిందరావు, ఆర్డీఓ కె. హేమలత, ఇంటర్మీడియట్‌ జిల్లా విద్యాశాఖాధికారిణి డి. మంజుల వీణ, డీఈఓ ఎన్‌.ప్రేమ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 02 Nov 2023 01:19PM

Photo Stories