Skip to main content

How to Overcome Exam Stress: త్వరలోనే టెన్త్‌&ఇంటర్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

How to Overcome Exam Stress   Stress management for students

పరీక్షల కాలం మొదలైంది. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో టెన్త్‌, ఇంట‌ర్ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది విద్యార్థులు పూర్తి ప్రిప‌రేష‌న్‌లో ఉన్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఒత్తిడి, ఆందోళనగా అనిపించడం సహజమే. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

 

ఇలా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు..

  • పరీక్షల సమయంలో పిల్లల్లో ఒత్తిడిని దూరం చేయాలంటే హాయిగా నిద్రపోవాలి. చాలా మంది విద్యార్థులు రేపు పరీక్ష అంటే ముందు రోజు రాత్రుళ్లు ఎక్కువసేపు మేల్కొని చదువుతుంటారు. ఇది మెదడుపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే కశ్చితంగా 7-9 గంటల నిద్ర ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. పరీక్షకు ముందు రోజు రాత్రి హాయిగా నిద్రపోతే జ్ఞాపకశక్తి మెరుగ్గా వుంటుంది. 
     
  • పరీక్షల సమయంలో తప్పనిసరిగా ఉదయం పూట మంచి పోషకాలున్న అల్పాహారం తీసుకోవాలి. ఇది మీకు ఇన్‌స్టంట్‌ శక్తిని ఇవ్వడంతో పాటు మరింత ఫోకస్‌ చేసేందుకు వీలవుతుంది. సాధ్యమైనంత వరకు బ్రేక్‌ఫాస్ట్‌లో చక్కెర, ఉప్పును స్కిప్‌ చేయండి. మంచి ప్రోటీన్‌ ఫుడ్‌ను తీసుకోండి. 
     
  • పరీక్షకు సాధ్యమైనంత త్వరగా చేరుకోండి. లేదంటే హడావిడిగా పరుగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. 
     
  • పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో ఉండండి. పరీక్షకు బాగా సిద్ధమయ్యారని మిమ్మల్ని మీరు నమ్మాలి. స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్‌ చేయండి.నిండుగా ఊపిరి పీలుస్తూ 3 అంకెలు లెక్కించండి. ఆపైన ఊపిరి బిగబట్టి 3 అంకెలు, ఊపిరి విడుస్తూ 3 అంకెలు లెక్కించండి. ఇలా మీరు స్థిమితపడే దాకా శ్వాస మీదనే ధ్యాసను కొనసాగించండి.
     
  • పరీక్ష వేళ ప్రశ్నపత్రంలో మీకు జవాబు తెలిసిన ప్రశ్నలకే ముందు సమాధానాలు రాయండి. ఇతరులు ఏం చేస్తున్నారో పట్టించుకోకండి.మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను ఉపయోగించండి. 
     
  • సమయానికి ఆహారం తీసుకోకపోవడం అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో టైం టు టైం భోజనం చేయాలి. పరీక్షలకు సన్నద్ధమయ్యేటపుడు, పరీక్షా సమయాల్లో భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్యం, చికాకు, తక్కువ శక్తికి దారితీయవచ్చు.పరీక్షల సమయంలో షెడ్యూల్‌ పెట్టుకోండి. దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తినేలా చూసుకోండి.
     
  • మంచి ఆహారం తీసుకోవడంతోపాటు శరీరంలో నీటిశాతం తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతి రోజు ఎనిమిది పెద్ద గ్లాసుల నీటిని తాగాలి. పుష్కలంగా నీరు తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండండి. ఈ సీజన్‌‎లో మీ శరీరం డీహ్రెడేషన్‌‎కు గురవుతుంది. కాబట్టి నీటితోపాటు జ్యూస్‌లు కూడా తీసుకోండి. 
     
  • పరీక్ష రాసేముందు అక్కడ పేర్కొన్న సూచనలను జాగ్రత్తగా చదవండి. పరీక్ష రాస్తున్నప్పుడు ముందుగా మీకు బాగా తెలిసిన ప్రశ్నలకు మొదట సమాధానాలు రాయడం మేలు. ఇలా చేస్తే చాలా సమయం మిగులుతుంది. ఇది తర్వాతి ప్రశ్నలకు పనికొస్తుంది.
     
  • పరీక్ష సమయంలో ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలి అన్నదానిపై ఓ అవగాహనకు రండి. ఒకే ప్రశ్న వద్ద సమయాన్ని వృథా చేసుకోవద్దు. 
     
  •  ఇక ఎగ్జామ్‌ సెంటర్‌ నుంచి బయటికి వచ్చాక చాలామంది క్లాస్‌మేట్స్‌తో వాళ్లు ఎలా రాశారు, మీరేం చేశారు అన్నది చర్చిస్తారు. ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఇది మీ తదుపరి పరీక్షలపై ప్రభావం  చూపిస్తుంది. 
  • పరీక్ష సమయంలో ఎక్కువగా టెన్షన్‌కు గురికాకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. 
     
Published date : 26 Feb 2024 04:04PM

Photo Stories