Kakani Govardhan Reddy: ఐఐటీలకు దీటుగా ఉద్యాన వర్సిటీ
అన్నమయ్య జిల్లా అనంతరాజుపేటలోని వైఎస్సార్ ఉద్యాన కళాశాలలో రూ.22.81 కోట్లతో నిర్మించిన అకడమిక్ బ్లాక్, రెండు గర్ల్స్ హాస్టళ్లు, ఒక బాయ్స్ హాస్టల్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఉత్పత్తుల ఎగ్జిబిషన్ భవనాలను ఏప్రిల్ 28న మంత్రి కాకాణి ప్రారంభించారు. వనిపెంటలోని కేవీకే అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటుచేసిన ఉద్యాన వర్సిటీ అంచెలంచెలుగా ఎదుగుతోందన్నారు.
చదవండి: వైఎస్సార్ ఉద్యాన వర్సిటీకి బీఓఎం ఏర్పాటు
ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ అభివృద్ధికి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. అనంతరాజుపేట ఉద్యాన కళాశాల పరిధిలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ అనంతరాజుపేట కళాశాలలో రైతుల వసతిగృహం, అతిథిగృహం ఏర్పాటుచేయాలని మంత్రిని కోరారు. వైఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకీరాం మాట్లాడారు. అనంతరం పుట్టగొడుగుల సాగుపుస్తకం, కరపత్రాలు, అంబాజీపేట పరిశోధనా స్థానం రూపొందించిన కొబ్బరి సాగుకు సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
చదవండి: ఉద్యాన వర్సిటీ వంగడాలకు ప్రభుత్వ గుర్తింపు.. ఆ వంగడాలు ఇవే..