Universities: విశ్వవిద్యాలయాల్లో పడిపోతున్న విద్యా ప్రమాణాలు.. వీరు వస్తేగానీ మారని పరిస్థితి
ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కొరత, మౌలిక సదుపాయాల లేమికితోడు అధ్యాపకుల పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉండటంతో.. యూనివర్సిటీల్లో చదువు గతి తప్పుతోంది. విశ్వవిద్యాలయాలు ఇచ్చే సర్టిఫికెట్లతో మార్కెట్లో ఉద్యోగాలు రావడం లేదని సీఎం రేవంత్ ఇటీవల స్వయంగా పేర్కొన్నారు కూడా. ఇలాంటి సమయంలో స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపైనా దృష్టిపెడితే బాగుంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
చదవండి: UGC Chairman: 'అలాంటి వాళ్లు పీహెచ్‌డీ చేయకండి'.. యూజీసీ ఛైర్మన్ జగదీశ్‌కుమార్
నిధులు లేక.. పట్టించుకోక..
వందేళ్లపైన చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా ‘నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’ గుర్తింపులో వెనుకబడి ఉంది. ర్యాంకు ఏటా దిగజారుతోంది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిస్థితీ ఇదే. ఎన్నో సమస్యలున్నాయని ప్రతీ ప్రభుత్వం చెప్తున్నా.. నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఫలితంగా మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉంటోంది.
కొత్త వీసీలు వస్తేగానీ..
విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోపాటు బోధనేతర సిబ్బంది ఖాళీలు కూడా భారీగా ఉన్నాయి. వీటి భర్తీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. వీసీల ద్వారా కాకుండా.. కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని భావించింది. కానీ అది ముందుకు పడలేదు. నిజానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలే లేరు. ఈ ఏడాది మేలోనే వీసీల పదవీకాలం పూర్తయింది. కొత్తవారి నియామకానికి సెర్చ్ కమిటీలు వేశారు. దరఖాస్తులూ తీసుకున్నారు. కానీ సెర్చ్ కమిటీలు ఇంతవరకు సమావేశం కాలేదు. వీసీల నియామకం జరిగితే తప్ప ఖాళీల భర్తీ కుదరదు. ఖాళీలు భర్తీ చేస్తే తప్ప బోధన గాడినపడేందుకు ఆస్కారం లేదు.
చదవండి: CM Revanth Reddy: అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే తెలుగు వర్సిటీకి ఈ పేరు
చదువు చేప్పేవాళ్లెక్కడ?
రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీయే. అంటే 70శాతం వరకు బోధనా సిబ్బంది లేరు. ఇలా ఉంటే విశ్వవిద్యాలయాల్లో బోధన ఎలా సాగుతుంది? పరిశోధనలు ఎలా సాధ్యమవుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే వర్సిటీల్లో 1,528 ఖాళీలున్నట్టు గుర్తించింది. 1,061 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో నియామకాలు ఆగిపోయాయి. 2021 జనవరి నాటికి ఖాళీల సంఖ్య 1,869కు పెరిగింది. ఇందులో 248 ప్రొఫెసర్, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. తర్వాత మరిన్ని పోస్టులూ ఖాళీ అయ్యాయి. మరోవైపు బోధనేతర సిబ్బంది ఖాళీలూ భారీగానే ఉన్నాయని.. మొత్తంగా 4,500కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి..
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు.
ఏ వర్సిటీ చూసినా.. అన్నీ ఖాళీలే..!
కీలకమైన ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో పరిశోధనలేవీ ముందుకు సాగడం లేదు. పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో బోధన మొక్కుబడిగా ఉందనే విమర్శలున్నాయి. ల్యాబ్‌లలో అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర మౌలిక వసతులు లేవు. జేఎన్టీయూహెచ్‌లోనూ ఇదే దుస్థితి. నిజాం కాలేజీ, కోఠిలోని విమెన్స్ యూనివర్సిటీలోనూ చాలా కోర్సులకు ఫ్యాకల్టీ లేదు.
- కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు.
- మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలకు ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేరు. కాంట్రాక్టు లెక్చరర్లతో అరకొరగా కొనసాగిస్తున్నారు.
- ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత చెప్పుకోదగ్గ వర్సిటీ కాకతీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరూ లేరు. ఈ వర్సిటీ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో చాలా పోస్టులు ఖాళీయే.
- నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొన్ని విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని పరిస్థితి. కీలకమైన ఇంజనీరింగ్ విభాగంలో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులు నామమాత్రమే.
- నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో మేథ్స్, ఎకనామిక్స్, ఫార్మస్యూటికల్స్, కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు.
సదుపాయాలూ సరిగా లేక..
చాలా యూనివర్సిటీల్లో మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటి సౌకర్యం కూడా సరిగా ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లు, టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉంటోందని అంటున్నారు. పాలమూరు వర్సిటీ హాస్టళ్లలో గదుల తలుపులు, కప్‌బోర్డులు విరిగిపోయాయి. శాతవాహన వర్సిటీలో ఫార్మసీ కళాశాల భవనాలు నామమాత్రంగా ఉన్నాయి. ఉస్మానియా వర్సిటీ భవనాల నిర్వహణ సరిగా లేదు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. వీటిని బాగు చేయాలంటే నిధుల కొరత వెంటాడుతోందని అధికారులు చెప్తున్నారు.
యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ పోస్టులు, ఖాళీల తీరు ఇదీ..
యూనివర్సిటీ |
మొత్తం పోస్టులు |
ఖాళీలు |
ఉస్మానియా |
1267 |
845 |
కాకతీయ |
409 |
298 |
తెలంగాణ |
152 |
73 |
శాతవాహన |
64 |
45 |
మహాత్మాగాంధీ |
70 |
35 |
పాలమూరు |
95 |
73 |
జేఎన్టీయూహెచ్ |
410 |
232 |
జేఎన్‌ఎఎఫ్‌ఏయూ |
55 |
31 |
ఆర్జీయూకేటీ |
147 |
128 |
ఓపెన్ వర్సిటీ |
86 |
48 |
తెలుగు వర్సిటీ |
82 |
61 |
70శాతం కాంట్రాక్టు అధ్యాపకులే..
విశ్వవిద్యాలయాల్లో 11 ఏళ్లుగా బోధన సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు. వారిపైనా విపరీతమైన పనిభారం ఉంటోంది. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్ చేయలేదు. తక్షణమే యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టి, ఉన్నత ప్రమాణాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ ఎం.పరమేశ్వర్ (తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ సంఘం నేత)
Tags
- Education
- Universities
- Skill University
- Telangana News
- National Assessment and Accreditation Council
- Osmania University
- HyderabadUniversities
- EducationStandards
- SkillsUniversity2024
- Government education initiatives
- Education research
- Educationists' suggestions
- UniversityFoundation
- HigherEducation
- SakshiEducationUpdates