Skip to main content

English Language Learning: ఆంగ్లంపై పట్టు.. ఆత్మస్థైర్యానికి మెట్టు

మదనపల్లె సిటీ: నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్లభాషకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. నేడు ఎంత చిన్న కొలువు రావాలన్నా ఆంగ్లభాష తప్పనిసరైంది.
English Language Learning
లర్న్‌ ఏ వర్డ్‌లో పదాలు గురించి తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు

అందుకే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర‌  ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టింది. అలాగే ఆంగ్లభాషా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ‘లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే ( రోజుకో పదం నేర్చుకో) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ విధానం ద్వారా విద్యార్థులకు రోజుకో ఆంగ్లపదం పరిచయం చేస్తారు. రోజువారీ పాఠాలు యథావిధిగా బోధిస్తూ ఆ కొత్త పదం గురించి విపులంగా వివరిస్తారు. ఈ పదానికి అర్థం, నానార్థాలు, వ్యతిరేక పదం తదితర వాటిని నేర్పుతారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా తరగతి గది కృత్యాలు తయారు చేయాల్సి ఉంటుంది. 15 రోజులకోసారి పరీక్ష, స్పెల్‌బీ కార్యక్రమం నిర్వహిస్తారు. గతంలోనే ఇంగ్లీషుభాషపై పట్టును పెంచేందుకు వీలుగా విద్యార్థులకు ’తెలుగు టు ఇంగ్లీషు’కు సంబంధించిన జిల్లాలో ఈ ఏడాది 17,750 ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు అందజేసింది.

చదవండి: State College Education: ఆంగ్లం బోధనలో నైపుణ్యం పెంపొందించుకోవాలి

ప్రభుత్వ బడుల్లో....

జిల్లాలో 2213 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి వరకు1,54,789 మంది విద్యార్థులు చదువుతుండగా వీరికి లర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే కార్యక్రమం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఆంగ్లభాషలో రాణించడానికి ఈ పద్దతి మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు,ఆంగ్లభాషా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తరగతులను బట్టి పదాలు నేర్పడానికి ప్రత్యేకంగా జాబి తాను కూడా సిద్ధం చేశారు. ఈ జాబితాలో ఉన్న పదాలను విద్యార్థుల స్థాయిని బట్టి ఉపాధ్యాయులు పరిచయం చేస్తున్నారు. లెవల్‌–1లో 1,2 తరగతులు, లెవెల్‌–2లో 3 నుంచి 5 తరగతులు, లెవెల్‌–3లో 6నుంచి 8 తరగతులు, లెవెల్‌–4లో 9,10 తరగతులు ఉంటాయి.

చదవండి: APPSC: ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ఈ పరీక్షలు

నిర్వహణ విధానం ఇలా..

  • ప్రతి రోజూ మొదటి పీరియడ్‌లో ఒక కొత్త ఆంగ్లపదాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలి.
  • రెండో పీరియడ్‌లో పిల్లల చేత డిక్షనరీలో ఆ పదం అర్థాన్ని వెతికించాలి.
  • లెవల్‌ 1 విద్యార్థులకు రెండో పీరియడ్‌ ఉపాధ్యాయుడు పదం యొక్క అర్థాన్ని వివిధ ఉదాహరణలతో ఎలా ఉపయోగించాలో విద్యార్థుఽలకు వివరించాలి.
  • ఆంగ్ల ఉపాధ్యాయుడు తన పీరియడ్‌లో పదాన్ని వివిధ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో తెలియజేయాలి. ఇదే క్రమంలో వివిధ పీరియడ్‌లో ఓరల్‌ డ్రిల్లింగ్‌, స్పెల్లింగ్‌ గేమ్‌ విద్యార్థులు డిక్షనరీ సహాయంతో పదం యొక్క పార్ట్‌ ఆఫ్‌ స్పీచ్‌ కనుక్కోవడం,వ్యతిరేక పదాలు, సమానార్థ పదాలు వెతకడం, పదాన్ని రిపీట్‌ చేయడం నేర్పించాలి. కార్యక్రమం కోసం విద్యార్థులు ప్రత్యేకంగా వంద పేజీల నోట్‌ బుక్‌ ఉంచుకోవాలి. దానిని ఉపాధ్యాయుడు తరచూ తనిఖీ చేయాలి. ఇంటి వద్ద పదాలను ప్రాక్టీస్‌ చేయమని ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. తర్వాత విద్యార్థులు ఆంగ్లభాష పట్ల పట్టు సాధించగలిగేలా చేయాలి.

ఆంగ్లంపై పట్టు సాధించవచ్చు

రోజుకో కొత్త పదాన్ని తెలుసుకోవడం వల్ల ఆంగ్లంపై మంచి పట్టు సాధించవచ్చు. దీని వల్ల విద్యార్థుల్లో ఆంగ్లంపై ఆసక్తి కలుగుతుంది. ప్రతి రోజు కొత్త పదాన్ని, దాని అర్థాన్ని ఉపాధ్యాయులు పిల్లలతో ప్రాక్టీస్‌ చేయిస్తారు. పాఠశాలలో నేర్చుకున్న పదాన్ని ఇంటి వద్ద కూడా ప్రాక్టీస్‌ చేయాలి. ఇలా చేస్తే ఆంగ్లంపైమంచి పట్టు వస్తుంది.
– సుబ్బారెడ్డి, హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌, మదనపల్లె

కొత్త పదాలు నేర్చుకోవచ్చు

లర్న్‌ ఏ వర్డ్‌ డే మంచి కార్యక్రమం. రోజుకో కొత్త పదం నేర్చుకోవచ్చు. ఆంగ్లంలోని భాషాభాగాలపై పట్టు లభిస్తుంది.
–షేక్‌ సాదియా, 10వ తరగతి విద్యార్థి, జెడ్పీహెచ్‌ఎస్‌,మదనపల్లె

విద్యార్థులకు ఉపయోగకరం

లర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే కార్యక్రమం వల్ల ఆంగ్లభాషాభివృద్ధి సాధ్యమవుతుంది. రోజూ ఓ కొత్త పదం నేర్చుకోవడం వాటి వినియోగంపై పిల్లలకు తర్పీదు ఇవ్వడం మంచి ఫలితాన్నిస్తోంది. విద్యార్థులకు చాలా ఉపయోగకరం.

– పి.మహమ్మద్‌ఖాన్‌, ఆంగ్ల ఉపాధ్యాయుడు, జెడ్పీహెచ్‌ఎస్‌, మదనపల్లె

Published date : 21 Jul 2023 04:24PM

Photo Stories