Education Loans: ఈ విద్యార్థులకు సబ్సిడీతో రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు
విద్యా రుణాలకు సంబంధించి ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలపై మూడు శాతం సబ్సిడీతో ఈ–వోచర్లు నేరుగా అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్యార్థులు, విద్యారంగానికి ఇది మేలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు.
యువత ఆకాంక్షలను నెరవేర్చడం, నాణ్యమైన విద్య, మెరుగైన నైపుణ్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించవచ్చన్నారు.
ఆవిష్కరణలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం
విద్యాసంస్థలలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో మరో రూ.161 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు కేటాయింపులు రూ.1,300 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.1,800 కోట్లకు పెరిగాయి. యూజీసీకి నిధుల కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలు రూ.6,409 కోట్లతో పోలిస్తే ఈసారి 60.99 శాతం తగ్గించి రూ.2,500 కోట్లకు కుదించారు.
ఐఐఎంలకు బడ్జెట్‌లో కోతలు తప్పలేదు. గతేడాది బడ్జెట్‌లో ఐఐఎంలకు కేటాయింపులు సవరించిన అంచనాలు రూ.608.23 కోట్లతో పోలిస్తే రూ.300 కోట్లకు కుదించగా ఈసారి మరింత కోత పడింది.
ఈ ఏడాది సవరించిన అంచనాలు రూ.331 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.212 కోట్లకు కుదించారు.
సెంట్రల్ వర్సిటీలకు మరికొంత..
దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యకు నిలయాలైన ఐఐటీలకు కూడా బడ్జెట్ కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సవరించిన అంచనాలు రూ.10,384.21 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.10,324.50 కోట్లకు తగ్గాయి.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సెంట్రల్ వర్సీటీలు) కేటాయింపులు మాత్రం 28 శాతం పెరిగాయి. సెంట్రల్ వర్సిటీలకు సవరించిన అంచనాలు రూ.12,000.08 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.15,472 కోట్లకు పెరిగాయి.
పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎన్‌సీఈఆర్టీ, పీఎంశ్రీ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూళ్లకు బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి.
మేనేజ్‌మెంట్ విద్య బోధించే ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లకు వరుసగా రెండో ఏడాదీ కేంద్రం కేటాయింపులు కుదించింది. గత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పాఠశాల విద్యకు కేటాయింపులు రూ.535 కోట్లకుపైగా పెంచగా ఉన్నత విద్య గ్రాంట్‌ను రూ.9,600 కోట్లకుపైగా కుదించింది. మొత్తమ్మీద విద్యారంగానికి కేటాయింపులు రూ.9,000 కోట్లకుపైగా తగ్గాయి. విద్యాశాఖకు 2024–25 బడ్జెట్‌లో రూ.1.25 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
Tags
- 10 Lakhs
- Education Loans
- central government
- higher education
- Union Finance Minister
- Department of Education
- Nirmala Sitharaman
- Dharmendra Pradhan
- quality education
- India Budget
- FinanceMinister
- EducationLoans
- Rs10Lakh
- HigherStudies
- DomesticInstitutions
- EVouchers
- subsidy
- StudentLoans
- SakshiEducationUpdates