Skip to main content

Education: విద్యపై విషపు రాతలా?

‘వెనుక‘బడి’నా గొప్పలే’ అంటూ ఈనాడు దినపత్రిక అక్టోబర్‌ 10న వండివార్చిన కథనంలో అన్నీ అసత్యాలేనని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న దుర్బుద్ధితో తప్పుడు కథనాన్ని ప్రచురించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్య) బి. రాజశేఖర్‌ తీవ్రంగా ఖండించారు.
Education
విద్యపై విషపు రాతలా?

ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ కథనాన్ని రాసిందని, ఇందులో దురుద్దేశమే కాకుండా నేరపూరిత ఆలోచనలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సచివాలయంలో అక్టోబర్‌ 10న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు రాసిన కథనంలోని ప్రతి అంశమూ అసత్యమేనని సవివరంగా స్పష్టంచేశారు. అంశాల వారీగా ఈనాడు తప్పుడు రాతలను రాజశేఖర్‌ ఎండగట్టారు. ఆయన ఏమన్నారంటే..

చదవండి: ఏడో తరగతి కొలువుకు.. పీజీ అభ్యర్థుల ఎంపిక!

వరల్డ్‌ బ్యాంకు ప్రాజెక్టుపై ఈనాడుకు అవగాహనలేదు..

జాతీయ విద్యా విధానంలో 5+3+3+4 విధానాన్ని కేవలం కరిక్యులమ్‌ వరకు మాత్రమే అమలుచేయాలని చెప్పిందని.. 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయాలని ఎక్కడా చెప్పలేదని, ప్రపంచ బ్యాంకు ఒత్తిడికి తలొగ్గి టీచర్ల సంఖ్యను తగ్గించేందుకు విలీనం చేస్తున్నారంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే.. వరల్డ్‌ బ్యాంకు సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టు మీద ఈనాడుకు అవగాహనలేదు. దానిపేరు సాల్ట్‌ (సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌). గత మూడేళ్లలో చేపట్టిన కార్యక్రమాల్లోని ప్రగతిని గమనించి ఆ ప్రభుత్వాలకు ఆర్థిక సహకారమిచ్చి మరింత ముందుకుపోయేలా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్‌ డాలర్లను అందిస్తోంది. గతంలో మాదిరిగా తాను ఎలాంటి జోక్యం చేసుకోకుండా కేవలం సాధించే ఫలితాల ఆధారంగా ఆర్థిక సహాయాన్ని అందించే కొత్త విధానాన్ని ప్రపంచబ్యాంకు చేపట్టింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు 139 మంజూరు చేయగా అందులో ఏపీ ఒక్కటి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సాధిస్తున్న పురోగతిని గమనించి ప్రపంచబ్యాంకు ఈ ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఇందులో ఎలాంటి షరతుల్లేవు. రాష్ట్ర విద్యారంగ చరిత్రలోనే ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా రాలేదు. అయితే, ఈనాడులో ప్రపంచ బ్యాంకు ఒత్తిడిచేసి విలీనం చేయిస్తోందని తప్పుడు వార్త రాసింది. ఎన్‌ఈపీలో విద్యార్థులకు అన్ని సదుపాయాలనూ అందుబాటులోకి తెచ్చేలా వనరులన్నిటినీ వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ఆ దిశగా 5+3+3+4 విధానాన్ని అనుసరించాలని ఎన్‌ఈపీ 7.5 పేరాలో కేంద్రం స్పష్టంగా చెప్పింది. కానీ, దీనిపై అవగాహన లేకుండా ఈనాడు ప్రజలను తప్పుదోవపట్టించింది.

చదవండి: నేటి నుంచి స్కూళ్లు.. విద్యా బోధనపై సందేహాలు..

చేరికల అంకెల్లోనూ అడ్డగోలు రాతలే

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయని తప్పుడు అంకెలతో కథనం రాశారు. అసలు చేరికల లెక్కలకు సంబంధించి కేంద్రం ప్రామాణికంగా నిర్దేశించిన యూడైస్‌ ప్లస్‌ గణాంకాల ఇంకా ఖరారు కాలేదు. ఇష్టమొచ్చిన సంఖ్యలు రాశారు. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో కేంద్ర విద్యాశాఖ దక్షిణాది రాష్ట్రాలతో వర్కుషాపును నిర్వహించాక ఈ గణాంకాలు ఖరారవుతాయి. 2022 లెక్కలు ఇంకా ఖరారుకానందున ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగానికి 2021 గణాంకాలను అందించాం. యూడైస్‌ ప్లస్‌ ఏడాదికి ఒక్కసారే అప్‌డేట్‌ అవుతుంది. కానీ, రాష్ట్రంలో చైల్డ్‌ ఇన్ఫో పేరుతో రోజువారీ అప్‌డేషన్‌తో గణాంకాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడినుంచో కొన్ని అంకెలను తీసుకుని ఈనాడు ప్రభుత్వంపై విషం చిమ్మింది. ఏ విద్యార్థీ బడిబయట ఉండరాదన్న ఉద్దేశంతో అమ్మఒడి సహ అనేక కార్యక్రమాలను ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రభుత్వం చేస్తోంది. చరిత్రలో ఎవరూ పెట్టని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టిపెట్టింది. ప్రతి పిల్లాడినీ బడిలో చేర్చేలా కసరత్తు చేశాం. రాష్ట్రం ఏర్పాటయ్యాక గణాంకాలు పరిశీలిస్తే.. 2014–15లో 72,32,771 చేరికలు కాగా 2015–16కు 69,07,004కు తగ్గింది. 2016–17లో 68,48,197, 2017–18లో 69,75,526, 2018–19లో 70,43,071లుగా చేరికలు ఉన్నాయి. ఇక 2019–20లో ఆ సంఖ్య 72,43,269లకు 2020–21లో 73,12,852కు పెరిగింది. 2021–22లో 72,45,640కు చేరింది. ఇక 2022–23లో సెప్టెంబర్‌ 30 వరకు 71,59,441లుగా చేరికలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 86,199 తగ్గింది. ఈ తగ్గడం ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మైగ్రేషన్‌వల్ల 16,857, సీజనల్‌ మైగ్రేషన్‌వల్ల 38,951, మరణాలవల్ల 1,289 మంది చేరికలు తగ్గాయి. ఇక జనాభా తగ్గుదలవల్ల దేశవ్యాప్తంగా ఒకటో తరగతిలో చేరికలు తగ్గాయి. మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా 29,102 మంది తగ్గారు. సీజనల్‌ మైగ్రేషన్‌ అయిన వారిని తిరిగి స్కూళ్లలో చేర్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 12వేల మంది చేరారు.

చదవండి: Education: బడి పిల్లల చదువులకు సానబెట్టండి

చేరికలు ఐదు లక్షలకు పైగా పెరిగాయి

ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు చూస్తే.. వాటిపై శ్రద్ధ గత ప్రభుత్వానికి, ఇప్పటికి ప్రభుత్వానికి మధ్యనున్న తేడా తెలుస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో 2014–15లో 41,83,441 మంది పిల్లలుండగా 2015–16లో 39,24,078కు, 2016–17లో 37,57,000లకు, 2017–18లో 37,29,000లకు, 2018–19లో 37,20,988లకు చేరింది. అదే 2019–20లో 38,18,348లకు పెరగ్గా 2020–21లో 43,42,874లకు చేరింది. అంటే ఏకంగా 5 లక్షల మేర చేరికలు అదనంగా పెరిగాయి. 21–22లో 44,29,569లు కాగా 2022–23లో అది 40,31,239లుగా ఉంది. కరోనావల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి చేరికలు పెరిగాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే, ఈ చేరికల్లో ఏపీ 14 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాలు మనకన్నా తక్కువగా ఉన్నాయి. అసర్‌ నివేదిక కూడా ఇదే చెబుతోంది. జనాబా తగ్గుదలవల్ల కూడా చేరికలు తగ్గుతున్నట్లు ఎన్‌సీఈఆర్టీ నివేదిక చెబుతోంది. 2025 నాటికి 14 శాతం మేర తగ్గుతుందని నివేదించింది. ఇక 2019–20లో ప్రభుత్వ స్కూళ్లలో 38,18,348 మంది పిల్లలుండగా ప్రైవేటులో 32,28,681 మంది ఉన్నారు. అదే ప్రస్తుత విద్యాసంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో 40,31,239 మంది పిల్లలున్నారు. అంటే రెండు లక్షల మంది అదనంగా పెరిగారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 2019–20తో పోలిస్తే 2,12,407 చేరికలు తగ్గాయి. ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తగ్గాయని ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. కరోనా పరిస్థితులు తగ్గి ఆర్థిక స్థితి కొంత పెరిగి తిరిగి ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని అనుకున్నా అందరూ ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లడంలేదని ఈ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంతో పాటు పథకాలు, ఇతర కార్యక్రమాలవల్ల తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ఐఏఎస్‌ అధికారులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తున్నారంటే రాష్ట్రంలో విద్యారంగంలో ప్రమాణాలు ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయో స్పష్టమవుతోంది. ఇక బెండపూడి స్కూలులో ప్రసాద్‌ అనే టీచర్‌ చేసిన ప్రయత్నంవల్ల విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. దీన్ని రాష్ట్రంలోని ఇతర స్కూళ్లలోనూ అమలుచేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇంత మంచిగా కార్యక్రమాలు జరుగుతూ విద్యారంగం అభివృద్ధి సాధిస్తుంటే వెనుకబడిపోయిందని ఈనాడు తప్పుడు రాతలు రాయడం సరికాదు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వెనుక ఈనాడుకు నేరపూరిత ఉద్దేశాలున్నాయి.

చదవండి: ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల బోధనలో మార్పులు 

ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమనా ఈనాడు ఉద్దేశ్యం?

ఆంగ్ల మాధ్యమంలో ఒక్క వాక్యాన్నీ చదవలేకపోతున్నారని రాశారు. కానీ, అది అవాస్తవం. ఈ ఏడాది టెన్త్‌ ఫలితాల్లో తెలుగు మీడియంలో 1,08,543 మంది హాజరైతే 43.97 పాసయ్యారు. ఇంగ్లీషు మీడియంలో 4,22,743 మంది రాస్తే 77.55 శాతం పాసయ్యారు. ఈ పరీక్షలను ఎలాంటి వాతావరణంలో నిర్వహించామో అందరికీ తెలుసు. మాస్‌కాపీయింగ్‌ చేసిన వారిని, దానికి సహకరించిన టీచర్లను కూడా సస్పెండ్‌ చేశాం. ఇంత పకడ్బందీ నిర్వహణలోనూ ఇంగ్లీషు మీడియం పిల్లలు పాస్‌ అత్యధికంగా ఉంది. ఏదీ రాయడం, చదవడం రాకుండానే ఇంతమంది పాసవుతారా? అన్నది అర్థం చేసుకోవాలి. ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను మిస్‌లీడ్‌ చేయడం వెనుక ఈనాడు ఉద్దేశమేమిటి? ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం అయ్యాయంటూ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమని పిల్లలకు చెబుతున్నారా? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. 

Published date : 11 Oct 2022 01:04PM

Photo Stories