Skip to main content

Medical Seats: పీజీ మెడికల్ సీట్లు డబుల్

తెలంగాణ రాష్ట్రంలో పీజీ మెడికల్‌ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
Medical Seats
పీజీ మెడికల్ సీట్లు డబుల్

రాష్ట్ర ఏర్పాటు నాటికి వెయ్యి సీట్లే ఉండగా.. తర్వాత ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కలిపి మరో వెయ్యి సీట్లు సమకూరాయి. తాజాగా ప్రభుత్వ కాలేజీలకు మరో 232 పీజీ మెడికల్‌ సీట్లను కేంద్రం మంజూరు చేసింది. 2022 నుంచే వాటికి అడ్మిషన్లు నిర్వహించనున్నారు. తాజాగా అనుమతి వచ్చిన సీట్లలో కీలకమైన జనరల్‌ సర్జరీ విభాగంలో 28 సీట్లు, పీడియాట్రిక్స్‌లో 25, గైనకాలజీ విభాగంలో 19 సీట్లు, ఆర్థోపెడిక్స్‌లో 12 సీట్లు ఉన్నాయి. ఇవిగాక ఎండీ అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియోలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, సైకియాట్రీ, ఆప్తల్మాలజీ, రేడియో డయాగ్నసిస్, పల్మనరీ మెడిసిన్, ప్లాస్టిక్‌ సర్జరీ వంటి విభాగాల్లో సీట్లు పెరిగాయి.

చదవండి: మెడికల్ అడ్మిషన్లు రద్దయిన విద్యార్థులకు ఊరట

సిద్దిపేట కాలేజీకి ఏకంగా 80 సీట్లు

రాష్ట్రంలో మొత్తంగా ప్రైవేట్‌లో 23, ప్రభుత్వంలో 9 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. 2022 నుంచి కొత్తగా మరో 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో ఎంబీబీఎస్‌ కోర్సులు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 232 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో అత్యధికంగా సిద్ధిపేట మెడికల్‌ కాలేజీకి 80 పీజీ మెడికల్‌ సీట్లు మంజూరయ్యాయి. సూర్యాపేట మెడికల్‌ కాలేజీకి 25, నల్లగొండ మెడికల్‌ కాలేజీకి 30, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీకి 16, ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి 32, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీకి 10, కాకతీయ మెడికల్‌ కాలేజీకి 3, ఆదిలాబాద్‌ రిమ్స్‌కు 22, గాంధీ మెడికల్‌ కాలేజీకి 14 సీట్లను కొత్తగా మంజూరు చేశారు. పీజీ సీట్ల సంఖ్య పెరగడం వల్ల ఎంబీబీఎస్‌ పూర్తయిన విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది.

చదవండి: MBBS: ఫస్ట్‌ ఇయర్‌ ఈలోపు పూర్తి చేయాలి

నాన్‌ క్లీనికల్‌లో పెరగడంతో..

క్లినికల్‌ విభాగాల కంటే నాన్‌ క్లినికల్‌ విభాగాల్లో సీట్లు ఎక్కువగా పెరగడంపై నిరాశ వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన విద్యార్థులు మెడికల్‌ పీజీ చేసి.. స్పెషలిస్టు వైద్యులుగా కెరీర్‌ను మలుచుకోవాలని భావిస్తుంటారు. అందువల్ల క్లినికల్‌ విభాగాలకు సంబంధించి ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు కూడా కోట్లు చెల్లించి చేరుతుంటారు. నాన్‌ క్లినికల్‌ పీజీ సీట్లకు మాత్రం డిమాండ్‌ తక్కువ. కొన్ని విభాగాల్లో అయితే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లలోనూ విద్యార్థులు చేరని పరిస్థితి ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి. అలాంటిది మళ్లీ నాన్‌ క్లినికల్‌ సీట్లు పెంచారని పేర్కొంటున్నారు. 

చదవండి: PMU: వైద్య పరికరం పాడైతే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు

Published date : 30 Aug 2022 12:51PM

Photo Stories