Skip to main content

Burra Venkatesham: కాలేజీల్లో డ్రగ్స్‌ కట్టడికి క్లబ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ రక్కసిని అరికట్టడం, డ్రగ్స్‌ ముప్పును నివారించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది.
Clubs for selling drugs in colleges

ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు 24/7 పనిచేసే టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేనుంది. వారం పది రోజుల్లో ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆగ‌స్టు 18న‌ ప్రకటించారు.

ఎక్కడ ఇలాంటి తప్పులు జరిగినా విద్యార్థులు నిర్భయంగా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆగ‌స్టు 18న‌ మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరి­యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌ వినియోగం వారి వారి జీవితాలతోపాటు దేశాన్ని సైతం నాశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటుచేశామని, కాలేజీల్లో సైతం ఇలాంటి క్లబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

చదవండి: Child Choice in Education: కాలేజీ సమయం.. చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండయ్యా..

పటిష్టమైన వ్యవస్థ: డీజీపీ జితేందర్‌

తెలంగాణను డ్రగ్‌ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ అన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్‌ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగానే ప్రభుత్వం స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటుచేసి, స్కిల్స్‌ కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.

నగరాల్లోని వర్సిటీలు, కాలేజీలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చిన్న కాలేజీల వరకు డ్రగ్స్‌ చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్‌తో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు.

కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన మాట్లాడుతూ.. యాంటీనార్కోటిక్స్‌ బ్యూరో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. మన యువతను నాశనం చేయాలని కొంతమంది దుష్టులు కంకణం కట్టుకున్నారని, డ్రగ్స్‌ అనే యాసిడ్‌ను పిల్లలపై ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

యాంటీనార్కోటిక్స్‌ బ్యూరో డైర్టెర్‌ సందీప్‌ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్‌ సంబంధిత సమాచారాన్ని 87126 71111 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులపై కేసులు నమోదు చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్లు ప్రొఫెసర్‌ వెంకటరమణ, ప్రొఫెసర్‌ ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 19 Aug 2024 01:37PM

Photo Stories