Skip to main content

Child Choice in Education: కాలేజీ సమయం.. చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండయ్యా..

మార్కులు రాలేదని తల్లి పెద్ద ర్యాంకు రాలేదని తండ్రి ఫలానా కోర్సు చదవాలని తల్లి ఆ కాలేజీలోనే చేర్పిస్తానని తండ్రి టీనేజ్‌ పిల్లలకు ఇది కీలక సమయం.
Listen to the Children in the choice of education

వారు ఇంటర్‌లో, డిగ్రీలో చేరాలి. కాని పిల్లల మాట వింటున్నారా? మీరే గెలవాలని పట్టుబడుతున్నారా? అప్పుడు పిల్లలు లోలోపల నలిగి పోవడం కన్నా ఏం చేయలేరు. పత్రికల్లో వస్తున్న ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఆచితూచి అడుగు వేయండి.

‘నువ్వు ఆ కోర్సు చేయాలనేది మా కల’ అనే మాట తల్లిదండ్రుల నుంచి వెలువడితే అది పిల్లల నెత్తిమీద ఎంత బరువుగా మారుతుందో పిల్లలకే తెలుసు. టీనేజ్‌ మొదలయ్యి టెన్త్‌ క్లాస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ‘కలలు వ్యక్తపరచడం’ తల్లిదండ్రులు మొదలెడతారు. 

టెన్త్‌లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో, ఇంటర్‌లో ఏ స్ట్రీమ్‌లోకి వెళ్లాలో, అందుకు ఏ కాలేజీలో చేరాలో, ఆ కాలేజీ ఏ ఊళ్లో ఉంటే బాగుంటుందో ఇన్ని డిసైడ్‌ చేసి పిల్లలకు చెబుతుంటారు. పిల్లలు వినాలి. వారికి ఏ అభిప్రాయం లేకుండా ఆ కోర్సు పట్ల ఆసక్తి ఉంటే మంచిదే. వారికి మరేదో ఇంటరెస్ట్‌ ఉండి, ఇంకేదో చదవాలని ఉంటే.. ఆ సంగతి చెప్పలేకపోతే ఇబ్బంది. అది భవిష్యత్తును కూడా దెబ్బ కొట్టగలదు.

ఏంటి.. ఆ కోర్సా?
ఆ ఇంట్లో తండ్రి అడ్వకేట్, తల్లి గవర్నమెంట్‌ ఉద్యోగి. కుమార్తెకు మేథ్స్‌గాని, బయాలజీగాని చదవాలని లేదు. హాయిగా టీచర్‌గా సెటిల్‌ అవ్వాలని ఉంది. తన స్కూల్‌లో చక్కగా తయారై వచ్చే టీచర్‌ పిల్లల పేపర్లు దిద్దే సన్నివేశం ఆ అమ్మాయికి ఇష్టం. తాను కూడా టీచరయ్యి పేపర్లు దిద్దాలని అనుకుంటుంది. టెన్త్‌ అవుతున్న సమయంలో ‘టీచర్‌ అవుతాను’ అని కూతురు అంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.

Degree Admissions 2024: డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

‘మన హోదాకు టీచర్‌ కావడం ఏం బాగుంటుంది.. మన ఇళ్లల్లో టీచర్లు ఎవరూ లేరే’ లాంటి మాటలు చెప్పి ఎంపీసీలో చేర్పించారు. ఆ అమ్మాయి ఆ లెక్కలు చేయలేక తల్లిదండ్రులకు చెప్పలేక కుమిలిపోయింది. డిప్రెషన్‌ తెచ్చుకుంది. అదే ‘టీచర్‌ కావాలనుకుంటున్నావా? వెరీగుడ్‌. అక్కడితో ఆగకు. నువ్వు హార్వర్డ్‌లో ప్రోఫెసర్‌ అవ్వాలి. అంత ఎదగాలి’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే హార్వర్డ్‌కు వెళ్లకపోయినా ఒక మంచి యూనివర్సిటీలో లెక్చరర్‌ అయినా అయ్యేది కదా.

అన్నీ మాకు తెలుసు..
తల్లిదండ్రులకు అన్నీ మాకు తెలుసు అనే ధోరణి ఉంటుంది. నిజమే. కాని వాళ్లు ఇప్పుడున్న స్థితి రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల దారుల్లో ప్రయత్నించి ఒక మార్గంలో సెటిల్‌ అయి ఉంటారు. తమ లాగే తమ పిల్లలు కూడా కొన్ని దారుల్లో నడవాలని అనుకోవచ్చు అని భావించరు. అన్నీ తమ ఇష్టప్రకారం జరగాలనుకుంటారు, ఓవర్‌ కన్సర్న్‌ చూపించి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. 

ఉదాహరణకు ఒకబ్బాయికి ‘నీట్‌’లో మెడిసిన్‌ సీటు వచ్చే ర్యాంకు రాలేదు. కాని డెంటిస్ట్రీ సీటు వచ్చే ర్యాంకైతే వచ్చింది. అబ్బాయికి ఆ కోర్సు ఇష్టమే. కాని తల్లిదండ్రులకు తమ కొడుకు ఎలాగైనా ఎంబిబిఎస్‌ మాత్రమే చదవాలనేది ‘కల’. ‘లాంగ్‌ టర్మ్‌ తీసుకో’ అని సూచించారు. లాంగ్‌ టర్మ్‌ అంటే ఒక సంవత్సరం వృథా అవుతుంది.. పైగా ఈసారి ఎంట్రన్స్‌లో కూడా మంచి ర్యాంక్‌ వస్తుందో రాదో అనే భయం ఆ అబ్బాయికి ఉన్నా బలవంతం చేస్తే ఎంత చెప్పినా వినకపోతే ఆ అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అవ్వడా?

ప్రతిదీ నిర్ణయించడమే..
తల్లిదండ్రుల స్తోమత పిల్లలకు తెలుసు. వారు చదివించ దగ్గ చదువులోనే తమకు ఇష్టం, ఆసక్తి, ప్రవేశం ఉన్న సబ్జక్టును చదవాలని కోరుకుంటారు. పైగా తమ స్నేహితుల ద్వారా వారూ కొంత సమాచారం సేకరించి ఫలానా కాలేజీలో ఫలానా కోర్సు చదవాలని నిశ్చయించుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఆసక్తికి ఏ మాత్రం విలువ లేకుండా ఎలాగైనా చేసి రికమండేషన్లు పట్టి తాము ఎంపిక చేసిన కాలేజీలోనే చదవాలని శాసిస్తారు. ఇది అన్నివేళలా సమంజసం కాదు.  

Government Schools: స‌ర్కారు బ‌డుల్లో ప్ర‌వేశాల‌కు విద్యార్థుల ఆస‌క్తి.. కార‌ణం..?

ఒత్తిడి వద్దు..
టీనేజ్‌ సమయంలో పిల్లల భావోద్వేగాలు పరిపక్వంగా ఉండవు. కొంత తెలిసీ కొంత తెలియనితనం ఉంటుంది. ఆసక్తులు కూడా పూర్తిగా షేప్‌ కావు. ఇంటర్, గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి వారికి ఎన్నో సందేహాలుంటాయి. ఎంపికలు ఉంటాయి. ఇవాళ రేపు తల్లిదండ్రులు ‘తాము చదివించాలనుకున్న కోర్సు’ కోసం ఏకంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇంట్లో ఉండి చదివే వీలున్నా రెసిడెన్షియల్‌ కాలేజీల్లో పడేస్తున్నారు. 

అంతంత మాత్రం చదువు చెప్పినా పర్లేదని మెడిసన్‌ పట్టా ఉంటే చాలని ఆసియా దేశాలకు సాగనంపుతున్నారు. పిల్లలతో ఎంతో మాట్లాడి, కౌన్సెలింగ్‌ చేసి, మంచి చెడ్డలన్నీ చర్చించి, వారికి సంపూర్ణ అవగాహన కలిగించి రెండు ఆప్షన్లు ఇచ్చి వారి ఆప్షన్లు కూడా పరిగణించి సానుకూలంగా ఒక ఎంపిక చేయడం ఎప్పుడూ మంచిది. లేదంటే ‘కోటా’ లాంటి కోచింగ్‌ ఊర్లలో జరుగుతున్న విషాదాలు, హైదరాబాద్‌లాంటి చోట్ల ఇల్లు విడిచి పోతున్న సంఘటనలు ఎదుర్కొనాల్సి వస్తుంది.

Inter 2nd Round Admission List: ‘బీసీ గురుకుల కాలేజీ’ల్లో రెండోవిడత ప్రవేశాల జాబితా విడుదల

Published date : 08 Jun 2024 03:37PM

Photo Stories