Education: మారుతున్న ‘గురు’తర బాధ్యత
ప్రపంచ పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం అనివార్యమైంది. విశ్వ వ్యాప్త విజ్ఞానం వైపు విద్యార్థుల ఆకాంక్షలు పరుగులు తీస్తున్నాయి. ఈ మేరకు బోధన తీరు మారుతోంది. తగిన నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం నేటి తరం గురువులకు తప్పనిసరైంది. ఎల్‌కేజీ నుంచే ఐఐటీ పునాదులు కోరుకునే తల్లిదండ్రుల ఆలోచన ధోరణికి అనుగుణంగా టీచర్లూ సంసిద్ధులు కావాల్సిన అవసరం ఏర్పడింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జాతీయ విద్యా విధానం ఈ తరహా మార్పులను నొక్కి వక్కాణించింది. ఉపాధ్యాయుడికీ పునఃశ్చరణ అవసరమని పేర్కొంది. నేషనల్ కౌన్సెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్టీ) 2022లో జరిపిన అధ్యయనం.. పాఠశాల విద్య నుంచే మార్పులు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ సూచనను జాతీయ విద్యా విధానం–2020లో పొందుపరిచారు. విద్యార్థి మానసిక ధోరణికి, సామాజికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా బోధన ప్రక్రియ సాగాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.
చదవండి: Best Teacher Awards: ప్రైవేటు ఉపాధ్యాయులకూ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు
డిజిటల్ విద్యలో వెనుకంజ
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళలో 95 లక్షలమంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. తెలంగాణలో వీరి సంఖ్య దాదాపు 2.5 లక్షల వరకూ ఉంది. ఎన్‌సీఈఆర్టీ అధ్యయనం ప్రకారం 58 శాతం ఉపాధ్యాయులు ఇప్పటికీ పాత పద్ధతిలోనే బోధన చేస్తున్నారు. కోవిడ్ తర్వాత వచ్చిన డిజిటల్ విద్యపై పెద్దగా అవగాహన పెంచుకోలేదని పేర్కొంది. వర్చువల్ మోడ్‌లో బోధన సాగుతున్నా, ఆన్‌లైన్ విద్యా విధానం ప్రాధాన్యత పెరుగుతున్నా, ఆ దిశగా నైపుణ్యాన్ని పెంచుకునే వారి శాతం 46కు మించి ఉండటం లేదని స్పష్టం చేసింది.
ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి ఉన్నారు. సర్కారీ స్కూళ్లలో మౌలిక వసతుల కొరత ఇందుకు ఓ కారణమని చెబుతున్నారు. డిజిటల్ విద్యలో పూర్తిగా గ్రాఫిక్ వీడియోతో బోధించే విద్యా విధానం అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రభుత్వ స్కూల్ టీచర్లు దీనికి పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదు.
చదవండి: Best teacher award: ఒంగోలులో ఉత్తమ ఉపాధ్యాయుడు ఈయనే..
గురువూ నిత్య విద్యార్థే
దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన విధానం పెరుగుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులూ దీన్నే కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ప్రైవేటు స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య గడచిన పదేళ్ళలో 47 శాతం పెరిగింది. పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక విద్యా విధానాన్ని ఎన్‌పీఏ సూచిస్తోంది. పాఠ్యాంశాన్ని ప్రాక్టికల్‌గా నిరూపించే సైద్ధాంతిక విధానాన్ని ఉపాధ్యాయులు అనుసరించాలి. బోధనకు ముందే ఉపాధ్యాయుడు పాఠ్యాంశంపై పట్టు పెంచుకోవాలని ఎన్‌సీఈఆర్టీ సూచిస్తోంది. అంటే నిరంతర పునఃశ్చరణతో పాటు, విషయ పరిజ్ఞానం ఎçప్పటికప్పుడు పెంచుకోవాల్సి ఉంది. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖలు శిక్షణ ఇస్తున్నా ప్రయోజనం పెద్దగా ఉండటం లేదు. ఈ కారణంగానే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) విద్యలోనే జాతీయ స్థాయి మార్పులకు శ్రీకారం చుట్టారు. రెండేళ్ళకు బదులుగా నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఈడీని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రధానంగా విద్యార్థి సైకాలజీని అంచనా వేయడం, అతని ఐక్యూను గుర్తించడం, అందుకు అనుగుణంగానే బోధన చేపట్టడం చేస్తారు. విద్యార్థిని ప్రతి వారం పరీక్షించడం, వెనుకబడ్డ పాఠ్యాంశాలకు పదును పెట్టే మెళకువలు ఉపాధ్యాయులు అనుసరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక గురువు కూడా నిత్య విద్యార్థిగా మారాల్సిన పరిస్థితి ఉంది.
సరికొత్త బోధనకు అలవాటు పడాలి
ఆధునిక బోధన పద్ధతులు దూసుకొస్తున్న తరుణంలో ఉపాధ్యాయులూ ఈ దిశగా మార్పులు చేసుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవడం, సరికొత్తగా బోధించడానికి అలవాటు పడాలి. అప్పుడే రోబోలు గురువుల స్థానాన్ని అక్రమించలేవు. విద్యార్థుల్లో దాగున్న అంతర్గత శక్తిని టీచర్ వెలికితీయాలి.
– పి.రాజా భానుచంద్రప్రకాశ్ (గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
పిల్లల ఐక్యూ మేరకు బోధించాలి
ఉపాధ్యాయుడు ముందుగా చైల్డ్ సైకాలజీ తెలుసుకోవాలి. అతని ఐక్యూని గుర్తించి బోధన చేపట్టాలి. ఇది పుస్తకాల ద్వారా వచ్చే నాలెడ్జ్ కాదు. విద్యార్థితో గురువుకు నిరంతర సంబంధం అవసరం. తన పిల్లలు ఎంత ఎదగాలని కోరుకుంటాడో, తాను చదువు చెప్పే విద్యార్థీ అంతే జ్ఞానం పొందాలని ఆకాంక్షించాలి.
– చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)