CBSE Board Exams 2024: 10, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు.. గడువు పొడిగిస్తూ సీబీఎస్‌ఈ నిర్ణయం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)పదో తరగతి, 12వ తరగతి ప్రాక్టికల్స్ గడువు తేదీని పొడిగించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్స్/ప్రాజెక్ట్ వర్క్/అసెస్‌మెంట్‌లు మరియు గ్రేడ్ షీట్స్‌ను అప్‌లోడ్ చేసేందుకు మరికాస్త సమయం ఇవ్వాలని పలు పాఠశాలలు సీబీఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లాయి.
ఇందుకు బోర్డు నుంచి కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో మార్చి 31వరకు గడువు తేదీని పొడిగిస్తూ సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకుంది. నిర్ణీత సమయంలోగా పాఠశాలలు మార్కుల వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సిందిగా తెలిపింది.
మరోసారి గడువు పొడిగించబోమని స్పష్టం చేసింది. కాగా పది, 12వ తరగతులకు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సీబీఎస్‌ఈ తాజా ప్రకటనతో ఇంతకుముందు ప్రాక్టికల్స్‌కు హాజరు కాలేని వారికి మరో అవకాశం ఇచ్చినట్లయ్యింది. మరిన్ని వివరాల కోసం CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inను సంప్రదించగలరు.