Selected for PM-USHA: భైంసా డిగ్రీ కళాశాలకు మహర్దశ..!
ఈ మేరకు కళా శాల అభివృద్ధికి రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. న్యాక్ గుర్తింపు ఉన్న పలు కళాశాలలను జాతీయస్థాయిలో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసి అభివృద్ధి చేస్తోంది.
ఇందులో భా గంగా రాష్ట్రం నుంచి 65 కళాశాల ఎంపికకు ప్రతిపాదనలు పంపగా, వీటిలో 13 కళాశాలలను ఎంపిక చేస్తూ నిధులు కేటాయించింది. ఇందులో భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చోటు దక్కిచుకుంది. ఫలి తంగా పీఎం–ఉష కింద కళాశాలలో విద్యార్థులకు నూతనంగా తరగతి గదుల నిర్మాణం, ఇతర మరమ్మతులు, ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ బోర్డులు,వసతులు అందుబాటులోకి రానున్నాయి.
చదవండి: Education Loans for Students: ఉన్నత విద్యకు ఊతంగా విద్యా రుణాలు.. ఈ అర్హులకు మాత్రమే!
అధ్యాపక బృందం కృషితో...
భైంసా పట్టణంలో పార్డి(బి) బైపాస్‌రోడ్‌లో జీఆర్‌పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1995లో ఏర్పాటైంది. మొదట బీఏ, బీకాం కోర్సులతో కళాశాల ప్రారంభం కాగా, 2005 బీఎస్సీ, 2018లో ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించారు. అదే సంవత్సరం కంప్యూటర్ సైన్స్ కోర్సు కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో కలిపి మొత్తం 600 మంది విద్యార్థులు ఉన్నారు.
కళాశాల ఏర్పడిన దాదాపు 25 ఏళ్ల వరకు న్యాక్ గుర్తింపు పొందలేదు. దీంతో ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సుధాకర్ నేతృత్వంలోని అధ్యాపక బృందం విశేష కృషితో 2021–22లో న్యాక్ బి గ్రేడ్ గుర్తింపు దక్కించుకుంది. ఉన్నత విద్యామండలి నిధులు కేటాయించాలంటే న్యాక్ గుర్తింపు తప్పనిసరి. దీన్ని గుర్తించిన అధ్యాపకులు ఈ మేరకు కళాశాలకు న్యాక్ గుర్తింపు కోసం కలిసికట్టుగా పనిచేశారు.
దాతల సహకారంతో కళాశాలలో వసతుల కల్పన, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు, పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది అందుబాటులో ఉంచడంతో న్యాక్ సంస్థ గుర్తించి బి గ్రేడ్ ఇచ్చింది. న్యాక్ గుర్తింపు ఉండడంతో పీఎం–ఉష కింద కళాశాలలో వసతుల కల్పనకు రూ.5 కోట్లతో ప్రిన్సిపాల్ సుధాకర్ ప్రతిపాదనలు పంపగా, ఆమోదించిన కేంద్రం ఈ మేరకు నిధులు కేటాయించింది.
సెమినార్లతో జాతీయస్థాయి గుర్తింపు...
మారుమూల ప్రాంతంలో ఉన్న భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలనుకున్న అధ్యాపక బృందం ఇందుకుగాను జాతీయస్థాయి సెమినార్లను నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత వృక్షశాస్త్రం అధ్యాపకులు డాక్టర్ వెల్మల మధు ఆధ్వర్యంలో ఒకరోజు జాతీయ సెమినార్ నిర్వహించారు.
ఈ సెమినార్‌కు దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పరిశోధన విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం హిందీ, ఆర్థిక శాస్త్రం ఆధ్వర్యంలో సైతం జాతీయస్థాయి సెమినార్లు నిర్వహించారు. ఫలితంగా భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఫలితంగా ప్రస్తుతం పీఎం–ఉష కింద ఎంపికకు దోహదపడింది.
ఆనందంగా ఉంది...
భైంసా డిగ్రీ కళాశాల పీఎం ఉష పథకం కింద ఎంపికై ంది. రూ.5 కోట్లు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. కళాశాలకు న్యాక్ గుర్తింపు కోసం అధ్యాపక బృందం విశేషంగా కృషి చేసింది. జాతీయస్థాయి సెమినార్లు నిర్వహించడం, పీహెచ్‌డీ చేసిన అధ్యాపకులు ఉండడంతో కళాశాలకు గుర్తింపు వచ్చింది. దీంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, దాతల సహకారంతో విద్యార్థులకు మెరుగైన విద్య, వసతులు కల్పించేందుకు కృషి చేస్తాం.
– డాక్టర్ ఎం.సుధాకర్, ప్రిన్సిపాల్, భైంసా
ప్రజాప్రతినిధులు, నాయకులు దృష్టి సారించాలి..
భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
స్థానికంగా కళాశాలల్లో సరైన వసతులు లేకపోవడంతో నియోజకవర్గం నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం నిజామాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. స్థానిక డిగ్రీ కళాశాల ప్రస్తుతం పీఎం–ఉష కింద ఎంపికై న నేపథ్యంలో అదనపు తరగతి గదులు, ఫర్నిచర్, కంప్యూటర్ టేబుళ్లు, రీడింగ్ టేబుళ్లు, డ్యూయల్ డెస్క్‌లు, ప్రొజెక్టర్లు, ఇతర వసతులు అందుబాటులోకి రానున్నాయి.
అయితే, స్థానికంగా డిగ్రీ కళాశాలకు అనుసంధానంగా బాలికల కోసం హాస్టల్ మంజూరు చేసేలా ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలని అధ్యాపకులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. తద్వారా కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగి న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
Tags
- Bhainsa Degree College
- PM-USHA
- Pradhan Mantri Uchchatar Shiksha Abhiyan
- Selected for PM-USHA
- Department of Higher Education
- Dr M Sudhakar
- Telangana News
- Adilabad District News
- GRP Government Degree College
- PM USHA scheme
- Commissioner of Higher Education
- NAAC recognition
- central government
- Education Schemes
- sakshieducation updates