బస్తీ బడి.. దాతల ఒడి..
దినదిన ప్రవర్థమానం
‘‘ఇక్కడ 2008లో మూతబడిన స్కూలును నాలుగేళ్ల కిందట తిరిగి ప్రారంభిస్తూ ఫిల్మ్‌నగర్ స్కూల్లో ఉన్న నన్ను డిప్యుటేషన్ మీద ఇక్కడ డ్యూటీ వేశారు. ఆ రోజు ముప్పై మందితో మొదలు పెట్టాం. అకడమిక్ ఇయర్ పూర్తయ్యే లోపు ఆ నంబరు 120కి చేరింది. రెండో ఏడాదికి ఇంకా పెరిగారు. ఇప్పుడు ఎన్ రోల్‌మెంట్ 295. మా వంతుగా బస్తీల్లో తిరిగి స్కూల్లో చేరని వాళ్లను, డ్రాప్ అవుట్ అయిన వాళ్లను తిరిగి స్కూలుకి రప్పించగలుగుతున్నాం. కానీ టీచర్లను పెంచకపోవడంతో దాతల సహాయం కోరాం. అలా ఈ స్కూల్‌ని 2019 నుంచి రోటరీ క్లబ్ వాళ్లు దత్తత తీసుకున్నారు. వాళ్ల సహకారంతో నడిపిస్తున్నాం’’ అని చెప్పారు స్కూల్ హెడ్మాస్టర్.
విద్యాప్రదానం
‘‘మా బంజారాహిల్స్ రోటరీ క్లబ్ సౌకర్యాల లేమితో బాధపడుతున్న ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. దేవరకొండ బస్తీ స్కూల్‌ని 2010లో దత్తత తీసుకున్నాం. అక్కడ టాయిలెట్స్ కట్టించడం, కంప్యూటర్ ల్యాబ్ పెట్టించడం, టీచర్లను రిక్రూట్ చేసి జీతాలివ్వడం వంటివి చేస్తూ వచి్చంది రోటరీ క్లబ్. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన ఉన్న వాళ్లందరూ స్వచ్చందంగా చేస్తున్న కార్యక్రమాలివి. విద్యాప్రదానం వల్ల దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో స్కూళ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది రోటరీ క్లబ్. ఇప్పుడు వెంకటగిరి స్కూల్ కూడా మా దత్తత లో ఉంది. ఇక్కడ కూడా అవసరమైన సిబ్బందిని నియమించడంతోపాటు పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లు, నోట్‌బుక్స్, షూస్ ఇవ్వడం, జూ పార్క్, సాలార్‌జంగ్ మ్యూజియం వంటి చోట్లకు పిక్‌నిక్‌కు తీసుకువెళ్లడం... ఇలా మేము చేయగలిగినవి చేస్తున్నాం. పిక్‌నిక్‌లకు మా క్లబ్ మెంటర్స్ ఒకరు వెహికల్ సపోర్టు, ఒకరు ఎంట్రీ టికెట్‌లు, మరొకరు ఫుడ్... ఇలా అందరూ తమ సొంత డబ్బు ఇచ్చారు. ఒక్కో స్కూల్ మీద ఏడాదికి రెండున్నర నుంచి మూడు లక్షల ఖర్చు చేస్తున్నారు మా సభ్యులు. తరచూ వర్క్‌షాపులు నిర్వహిస్తూ నీటి పరిశుభ్రత వంటివి నేర్పిస్తుంటాం. హెల్త్ క్యాంపులు పెట్టి పరీక్షలు చేయిస్తున్నాం. పోషకాహారలోపంతో ఎదురయ్యే సమస్యలకు మందులను హాస్పిటళ్ల సహకారంతో ఇస్తున్నాం. విద్యార్థుల్లో టీచర్ పట్ల గౌరవం పెరిగినప్పుడే వాళ్లలో సమగ్రవికాసం ఉంటుంది. అందుకే టీచర్స్ డే సందర్భంగా టీచర్లకు చిన్న పురస్కారాలు కూడా నిర్వహిస్తాం. బస్తీల్లో పిల్లలు ఎంత చురుగ్గా ఉన్నారంటే... ఏదైనా థీమ్ ఇచ్చి ఒక పెయింటింగ్ వేయమన్నా మరుసటి రోజుకు వేసేస్తున్నారు. వాళ్లలో వాళ్లే కొంతమంది టీమ్‌గా ఏర్పడి చిన్న స్కిట్ వేస్తున్నారు. త్వరగా గ్రహిస్తూ చాలా క్యాచీగా ఉంటున్నారు. వాళ్ల ఉత్సుకత చూస్తుంటే ఇంకా ఏదైనా చేయాలనిపిస్తోంది. కానీ ఇది సొంత బిల్డింగ్ కాకపోవడంతో మాకు చేతులు కట్టేసినట్లు ఉంది. గవర్నమెంట్ స్థలం కేటాయిస్తే బిల్డింగ్ సపోర్టు చేయడానికి మా క్లబ్ సభ్యులు ఆసక్తిగా ఉన్నారు. ఈ బిల్డింగ్ పైన ఒక ఫ్లోర్ వేయడానికి అనుమతి ఇచ్చినా సరే తక్కువ బరువుతో కనీస స్థాయి నిర్మాణమైనా చేసివ్వగలుగుతాం’’ అన్నారు రోటరీ క్లబ్, బంజారాహిల్స్ చాప్టర్‌లో క్రియాశీలక సభ్యురాలు నీరజ గోదావరి. ప్రభుత్వ ప్రయత్నాలు ఆగిన చోట ఆ బాధ్యతను తలకెత్తుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వాళ్లూ మన చుట్టూనే ఉన్నారు. వాళ్లను కృతజ్ఞతభావంతో చూస్తున్నాం. ‘ప్రభుత్వ టీచర్లు స్కూళ్లకు వెళ్లరు’ అనే వార్తను చూసిన కళ్లతోనే... స్కూలు నిర్వహణ కోసం దాతలను వెతికి వారి సహాయాన్ని అర్థించి పిల్లలకు నాణ్యమైన విద్యనందించడానికి తపన పడే ఉపాధ్యాయులను కూడా చూస్తున్నాం. ఏమైనా మన విద్యారంగం ఇంకా బలోపేతం కావాల్సి ఉంది. పేద పిల్లలందరికీ సంపన్నుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్య అందాలి.