Skip to main content

Admissions: పీయూలో ఉర్దూ దూరవిద్య

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో ఇప్పటి వరకు సాధారణ కోర్సులు మాత్రమే ఉండేవి.
 Educational Opportunities in Mahbubnagar   Urdu distance learning in PU   New Urdu Medium Courses Offered  Higher Education in Urdu Medium at Palamuru University

కానీ, ఇప్పుడు ఓపెన్‌ విధానంలో ఉర్దూ మీడియంలో ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం పీయూ అధికారులు మౌలానా ఆజాద్‌ యూనివర్సిటీతో గత ఆగస్టులో ఎంఓయూ (మెమోరాండం ఆఫ్‌ అండస్టాండింగ్‌) చేసుకున్నారు.

యూనివర్సిటీలో వసతులు పరిశీలించిన అనంతరం పీయూలో ఇటీవల ఎల్‌సీఎస్‌ సెంటర్‌ (లర్నర్‌ సపోర్ట్‌ సెంటర్‌)ను అధికారులు ప్రారంభించారు. దీని ద్వారా ఉర్దూ చదువుకునే విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. ఈ జనవరి నుంచి కౌన్సిలింగ్‌ తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. సుమారు 50 నుంచి 100 మంది అడ్మిషన్లు పొందవచ్చు.

చదవండి: JNTUH: ఆన్‌లైన్ సర్టిఫికెట్‌ కోర్సులకు జేఎన్‌టీయూ నోటిఫికేష‌న్‌.. కోర్సు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..

అందుబాటులో ఉన్న కోర్సులు

ఓపెన్‌ విధానంలో ఉర్దూ మీడియంలో యూజీ, పీజీ కోర్సులు చదివే వారికి మౌలానా యూనివర్సిటీ వివిధ కోర్సులు అందిస్తుంది. పీజీలో ఎంఏ ఉర్దూ, ఎంఏ ఇంగ్లిష్‌, ఎంఏ ఇస్లామిక్‌ స్టడీస్‌, ఎంఏ హిస్టరీ, అరబిక్‌, హిందీ యూజీలో బీఏ, బీకాం వంటి కోర్సులు ఉన్నాయి. ఇక డిప్లొమాలో పలు సర్టిఫికెట్‌ కోర్సులు అందించనున్నారు.

అయితే వీటిని నేరుగా మౌళానా యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ జాబితాను యూనివర్సిటీ పీయూలోని ఎల్‌సీఎస్‌ సెంటర్‌కు పంపిస్తే.. దానిని బట్టి ఇక్కడ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. గత నెల మొదట్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగా.. వచ్చే నెలలో అడ్మిషన్లు తీసుకున్న వారికి ఇక్కడ తరగతులు నిర్వహించనున్నారు.

ఎంఈడీ భవనంలో..

పాలమూరు యూనివర్సిటీలోని ఎంఈడీ భవనంలో ప్రత్యేక గదిని కేటాయించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ను కోఆర్డినేటర్‌గా నియమించారు. ఇక్కడ అడ్మిషన్లు తీసుకున్న వారి కోసం ఓపెన్‌ డిగ్రీ కౌన్సిలింగ్‌ తరగతులు నిర్వహించనున్నారు. దీంతోపాటు అసైన్‌మెంట్లు, రికార్డుల పరిశీలన చేయనున్నారు.

అంతేకాకుండా ఇక్కడే విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు కూడా జరిపిస్తారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఉర్దూ చదువుకోవాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ ఒక మంచి వేదిక కానుంది. దీన్ని తీసుకువచ్చేందుకు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ పలుమార్లు మౌళానా యూనివర్సిటీ అధికారులతో చర్చించి ఈ సెంటర్‌ను తీసుకురావడం పట్ల పలు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఆసక్తి గలవారికి..

ఉమ్మడి జిల్లాలో ఉర్దూ మీడియంలో వివిధ కోర్సులు చదువుకునే వారికి ప్రత్యేకంగా ఒక సెంటర్‌ ఉండాలన్న ఉద్దేశంతో మౌళానా యూనివర్సిటీని సంప్రదించగా ఓపెన్‌ విధానంలో చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఎంఓయూ చేసుకుని ఇక్కడ లర్నింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. దీని ద్వారా ఆసక్తిగల వారు చదువుకునేందుకు మంచి అవకాశం లభిస్తుంది.
– లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, పీయూ వైస్‌ చాన్స్‌లర్‌

విద్యార్థులకు ఎంతో మేలు..
ఉర్దూ చదువుకునే విద్యార్థులకు మౌళానా యూనివర్సిటీ ఒప్పందం ద్వారా ఓపెన్‌ డిగ్రీ చదువుకునే వారికి అవకాశం కల్పించడం గొప్ప విషయం. ఇక్కడ విద్యార్థులకు కౌన్సిలింగ్‌ తరగతులు, పరీక్షల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడతాం. ఉర్దూ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
– బషీర్‌ అహ్మద్‌, ఎల్‌ఎస్‌సీ కోఆర్డినేటర్‌, పీయూ

Published date : 27 Dec 2023 09:30AM

Photo Stories