వాట్సప్ ‘గురు’..ఈ అభ్యర్థులకు భవిష్యత్‌లోనూ అండగా...
ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి...విధి నిర్వహణలో తీరిక లేని పనులు...దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన కమిషనరేట్‌కు బాస్ కావడంతో నిరంతరం శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలై ఉండాల్సిన పరిస్థితి...అయినా దేశంలో అత్యున్నతమైన పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు గురువు అవతారమెత్తారు. సివిల్స్ పరీక్షలో కీలకమైన ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సలహాలు, సూచనలను వాట్సాప్ గ్రూప్‌ల ఏర్పాటు ద్వారా అందించారు.
మహేష్ భగవత్ మార్గదర్శనంలో...
ఇప్పటికే ‘సివిల్స్ గురు’గా అవతారమెత్తిన మహేష్ భగవత్ మార్గదర్శనంలో.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్‌ఎస్) విడుదలైన ఫలితాల్లో దాదాపు పది మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన అభ్యర్థులకు ఆయన సలహాలు అందించారు. ఇందులో పాటిల్ సుమిత్‌కుమార్ సుభాష్ రావు(7వ స్థానం), కాజోల్ పాటిల్ (11), ఆనంద్‌రెడ్డి (41), తవల్‌నిఖిల్ దశరథ్ (46), జాదవ్ సుదర్శన్ (47), కస్తూరి ప్రశాంత్ (56), శ్వేత (70), షిండే అమిత్ లక్ష్మణ్ (73), సతీశ్ ఆశోక్ (79), మానే శశాంక్ సుధీర్ (100) విజేతలుగా నిలిచారు.
సివిల్స్ ఫలితాల్లో 84 మంది...
మహేష్ భగవత్ సలహాలను పాటించిన 300 మందిలో 84 మంది గతేడాది సివిల్స్ ఫలితాల్లో అర్హత సంపాదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులతో ఆయన లోగడ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమేగాక సందేహాలను నివృత్తి చేశారు. ఆయన సలహాలు పొందిన వారిలో పుణేకు చెందిన వైశ్ణవి గౌడ్ 11వ ర్యాంక్ సాధించడం విశేషం. తొలి 100 ర్యాంకుల జాబితాలో ఆరుగురు స్థానం పొందారు.
ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ తనయుడు ముజామిల్ ఖాన్ (22), ఒంగోలుకు చెందిన రిజ్వాన్ భాషా షేక్ (48), స్వప్పిల్ పాటిల్ (55), అన్వేష్ రెడ్డి (80), పర్జీత్ నాయర్ (87), శోడిశెట్టి మాధవి (104), పోలుమెట్ల అభిషేక్ (373), కపిల్ జీబీ గేడ్(401), శరత్‌చంద్ర ఆర్రోజు (425), వాసగిరి శిల్ప (547), రంజిత్ (555), మధుసూదన్‌రావు (588), కుమార్ చింత (608), పిన్నని సందీప్‌కుమార్ (732), నర్ర చైతన్య (733), బి.రవితేజ (741), కాపల పవన్‌కుమార్ (799), నరేశ్ మన్నే (979), ప్రేమ్ ప్రకాశ్ (1015), శాలిని (1047) వీరిలో ఉన్నారు.
భవిష్యత్‌లోనూ అండగా...
గతేడాది మొత్తం 1099 మంది సివిల్స్ ఎంపిౖకైతే వారిలో నేను సలహాలిచ్చిన 84 మందికి స్థానం దక్కడం సంతోషంగా ఉంది. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో నా మార్గదర్శనంలో సలహాలు, సూచనలు అందుకున్న పది మంది అభ్యర్థులు విజేతలుగా నిలవడం గర్వంగా భావిస్తున్నా. భవిష్యత్‌లోనూ వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా మరెంతో మంది అధికారులను వెలుగులోకి తెస్తా. అండగా ఉంటా.
– మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్