Skip to main content

సాఫ్ట్‌వేర్ కొలువు నుంచి సివిల్స్ వైపు

ఐఐటీ మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా అందుకుని ప్రపంచ ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థలైన అమెజాన్, గూగుల్‌ల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించాడు. కానీ ఇవేవీ అతనికి సంతృప్తి ఇవ్వలేదు.
సమాజంపై తనకున్న అవగాహన, సేవా భావం అతడిని సివిల్ సర్వీసు వైపు మరల్చాయి. భారీ వేతన ప్యాకేజీలను కాదనుకుని దేశంలోని అత్యున్నత సర్వీసుల్లో చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు కర్నూలు జిల్లాకు చెందిన సీఎం సాయికాంత్ వర్మ. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2014లో సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో 18వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.

మాది కర్నూలు జిల్లా. నాన్న చంద్రకాంత్ రిటైర్ట్ ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ రిటైర్ట్ ఉపాధ్యాయురాలు. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. 2011లో ఐఐటీ మద్రాసులో కంప్యూటర్ సైన్స్‌లో డ్యుయల్ డిగ్రీ పూర్తి చేశాను. ఆమెజాన్, గూగుల్ సంస్థల్లో పనిచేశాను. సమాజంపై నాకున్న అవగాహన, సేవా భావం దృష్ట్యా సివిల్ సర్వీసులను ఎంచుకున్నాను. అన్న శశికాంత్ వర్మ నాకు స్ఫూర్తి. ఆయన గెడైన్స్‌తోనే సివిల్స్ ప్రిపరేషన్‌ను ప్రారంభించాను.

స్వీయ ప్రణాళికే ప్రధానం
సివిల్స్ ప్రిపరేషన్‌లో కోచింగ్ తీసుకున్నప్పటికీ స్వీయ ప్రణాళిక లేకపోతే వృథానే. కాబట్టి పక్కా వ్యూహం, ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. రోజంతా పుస్తకాలకే అంకితం కాలేదు. రోజుకు 4 నుంచి 8 గంటలు చదివాను. ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే సమయంలోనే మెయిన్స్‌లో ఉపయుక్తంగా ఉండే సబ్జెక్టుల ప్రామాణిక పుస్తకాలను చదివి సొంత నోట్సు తయారు చేసుకున్నాను. తద్వారా మెయిన్స్ ప్రిపరేషన్ సులువైంది. వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ రాత పరీక్షలు రాశాను. ఒత్తిడి అనిపించినప్పుడు సినిమాలు కూడా చూశాను. సమయం చిక్కినప్పుడల్లా చదివిన అంశాలను రివిజన్ చేసుకున్నా.

మ్యాథ్స్ ఆప్షనల్
చాలా తక్కువ మంది మ్యాథ్స్ ఆప్షనల్‌గా ఎంచుకుంటారు. కానీ నాకు చిన్నతనం నుంచి మ్యాథ్స్ సబ్జెక్టు అంటే ఆసక్తి. ముందు నుంచీ పట్టు ఉన్నందున నేను మెయిన్స్‌లోనూ మ్యాథమెటిక్స్ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. మెయిన్‌‌సలో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వమే ఇంటర్వ్యూ గెడైన్‌‌స అందిస్తే బాగుంటుంది. అభ్యర్థులకు బ్యూరోకాట్ల సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. అప్పుడు మన రాష్ట్రాలకు మరిన్ని ర్యాంకులు లభించడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఇంటర్వ్యూ సాగిందిలా!
ప్రశాంతమైన వాతావరణంలో పర్సనాలిటీ టెస్ట్ సాగింది. ఐదుగురు సభ్యులున్న డాక్టర్ కిలెమ్‌సుంగ్లా బోర్డు దాదాపు అరగంట సమయం ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సామాజిక అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాలపై ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్ని..

చైర్మన్: మన దేశంలో ఇప్పటి వరకు సిలికాన్ వ్యాలీ వంటి నగరం లేకపోవడానికి కారణమేంటి? భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ విషయంపై ఐటీ నేపథ్యం నుంచి వచ్చిన నీ అభిప్రాయం ఏంటి?
సమాధానం: మేడమ్, మనదేశంలో సిలికాన్ వ్యాలీలా నగరాలు ఉండాలని నేను అనుకోవడం లేదు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమూహాలు ఏర్పాటు అవసరం. ఆ దిశగానే దేశం పయనిస్తోంది. ఉదాహరణకు బెంగళూరుతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణే, కోల్‌కతా, గుర్‌గావ్ తదితర అనేక నగరాల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది.

బోర్డు సభ్యుడు-3 (మధ్యలో కలుగజేసుకుని): యూఎస్‌ఏ సిలికాన్ వ్యాలీ విధానం సరైంది కాదంటారా?
సమాధానం: అలా కాదు. అక్కడి విధానం మనదేశ పరిస్థితులకు సరితూగదు. యూఎస్‌ఏ అభివృద్ధి చెందిన, ఆర్థికంగా బలమైన దేశం. ఎన్నో వైరుధ్యాలు, అసమానతలున్న మన దేశంలో ఆ విధానం ఆచరణీయం కాదు.

చైర్మన్: ఈశాన్య రాష్ట్రాల్లో ఐటీ సామర్థ్యాలు ఏమున్నాయి?
సమాధానం: అక్కడి యువతే ఆ రాష్ట్రాల సామర్థ్యం. నిర్మాణ రంగంతో పోల్చుకుంటే ఐటీ రంగానికి తక్కువ పెట్టుబడులు అవసరం. ఆ రాష్ట్రాల్లోని యువతకు తగిన ఎడ్యుకేషన్, నైపుణ్యాలు అందిస్తే ఐటీ కంపెనీలు వారికి విస్తృత అవకాశాలు అందిస్తాయి.

వీటితోపాటు అడిగిన మరిన్ని ప్రశ్నలు:
  • బిట్‌కాయిన్స్‌పై నీ ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో ఆ కరెన్సీ పరిధి ఏ విధంగా ఉండబోతుంది?
  • ఐటీ రంగంలో భారత్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ దేశంలో సరిపడా తయారీ కేంద్రాలు లేవు. దీనిపై నీ ఆలోచనలేంటి?
  • పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ పనితీరుపై నీ అభిప్రాయం ఏంటి?
  • ఎన్‌జీఓలు విదేశీ నిధులు పొందడాన్ని ప్రభుత్వం నిషేదించడంపై నీ అభిప్రాయం ఏంటి? అసలు విదేశాల నుంచి నిధులు పొందాల్సిన అవసరమేంటి? దేశంలోనే ఎందుకు నిధులు సమీకరించలేకపోతున్నాయి?
  • అంతర్జాతీయ ర్యాంకుల్లో ఇండి యన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ఎందుకు వెనుకంజలో ఉంటున్నాయి?
  • రాత పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు అరగంటసేపు ఇంటర్వ్యూ నిర్వహించి సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేస్తున్నాం. యూపీఎస్సీ అమలు చేస్తున్న ఈ విధానం సరైనదేనా? ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివిన వారు కూడా సివిల్ సర్వీసెస్‌వైపు రావడం వల్ల.. వారిని ఇంజనీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దడానికి చేసిన ఖర్చు వృథా అయినట్లేగా? అందుకే ఇంటర్మీడియెట్ పూర్తి కాగానే సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసి, వారికి పాలిటీ, ఎకానమీ, టెక్నాలజీ తదితర అన్ని విభాగాల్లో పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి మంచి పాలనాధికారులుగా తీర్చిదిద్దాలని నేనంటాను. దీనిపై నీ అభిప్రాయం ఏంటి?
  • ప్రధాని నరేంద్ర మోదీ చైనా, సౌత్ కొరియా పర్యటించడానికి కారణం తెలుసు. కానీ మంగోలియా వెళ్లడానికి కారణమేంటి? ఒకే వాక్యంలో సమాధానం చెప్పండి? (నా ఇంటర్వ్యూకు ఒక రోజు ముందు ప్రధాని మంగోలియా పర్యటనలో ఉన్నారు)

ప్రణాళిక ప్రకారం
సివిల్స్‌లో విజయం అంటే ఒక మహా సముద్రాన్ని ఈదడం అనే భావన నుంచి బయటపడాలి. పక్కా వ్యూహం సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే సాధించలేనిది ఏదీ ఉండదు. పాత ప్రశ్న పత్రాలను పరిశీలించి సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.
Published date : 10 Jul 2015 03:00PM

Photo Stories