Skip to main content

రెండవ చాయిస్ లేకుండా చదివా..మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ కొట్టా..: స్నేహలత, క‌లెక్ట‌ర్

‘‘నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి. వ్యవసాయం, విద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. భారతదేశానికి వ్యవసాయం రంగం నుంచి వచ్చే వాటా ఎంతో ఉంది. దీనిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అందించే పథకాలు, రైతులకు ఆర్థిక లబ్ధిచేకూర్చేలా చూస్తాను. ఆడపిల్లలకు చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తాను. వారిని విద్యావంతులను చేయడం, మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై వారిని చైతన్యవంతులను చేయడం నా కర్తవ్యంగా భావిస్తాను..’’ అని ఐఏఎస్‌ మొగిలి స్నేహలత అన్నారు. పలు విషయాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు.

మీ బాల్యం, చదువు ఎక్కడ..?
పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. 10వ తరగతి, ఇంటర్‌ అంతా హైదరాబాద్‌. సీబీఐటీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశాను.

కుటుంబం నేపథ్యం గురించి..
స్నేహలత :
నాన్న పేరు రాజేంద్రకుమార్, హైదరాబాద్‌లో కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మ మాధవి గృహిణి, అక్క నిఖిత, చెల్లి అలేఖ్యలు ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. తమ్ముడు సాయితేజ గ్రూప్స్‌కు సన్నద్ధం అవుతున్నాడు.

ఐఏఎస్‌ వైపు ఎలా వచ్చారు..
స్నేహలత : డిగ్రీ చదువుతున్నప్పుడు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ప్రజలకు మరింత దగ్గరవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగంలో మంచి స్థానంలో ఉంటే సాధ్యం అని ఐఏఎస్‌కు సన్నద్ధం కావాలని నిర్ణయించకున్నారు. బీటెక్‌ పూర్తి కాగానే ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పాను. వారు కూడా ప్రోత్సహించారు.

ఐఏఎస్‌ ఏ బ్యాచ్, శిక్షణ ఎక్కడ తీసున్నారు..
స్నేహలత : 2016లో పరీక్ష రాశాను. 2017లో వచ్చిన ఫలితాల్లో ఎంపికయ్యాను. మా బ్యాచ్‌కు లాల్‌బహదూర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలో రెండు నెలలపాటు భారత్‌ దర్శన్‌ యాత్రకు వెళ్లాను.

సొంత రాష్ట్రంలో శిక్షణపై మీ అభిప్రాయం?
స్నేహలత : ఐఏఎస్‌ ట్రైనింగ్‌ను సొంత రాష్ట్రంలో కేటాయించడం సంతోషంగా ఉంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలో ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం దొరికింది. జిల్లా అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తాను. శిక్షణ పూర్తయ్యేలోపు ఇక్కడి పరిస్థితులపై పట్టు సాధించడమే లక్ష్యం.

పరీక్షకు ఎలా సన్నద్ధం అయ్యారు..
స్నేహలత :
పరీక్షకు ముందే రెండవ చాయిస్‌ ఉండకూదనుకొని చదివాను. సంవత్సర కాలం అంతా పుస్తకాలతో గడిపాను. రోజులో సింహభాగం ప్రిపరేషన్‌కు కేటాయించాను. నా కష్టానికి తోడు కుటుంబం నుంచి అందిన ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్‌ అయ్యాను. శిక్షణ అనంతరం ఒక సంవత్సరంపాటు ట్రైనీ ఐఏఎస్‌గా మంచిర్యాలకు పోస్టింగ్ ఇచ్చారు.

యువతకు మీరిచ్చే సందేశం..?
స్నేహలత : సమయం ఎక్కువగా ఉన్నదని లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నష్టపోతాం. కష్టపడి చదివే వారిని విజయం తప్పకుండా వరిస్తుంది. దానిని సాధించేవరకు తపస్సులా శ్రమించాలి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో మొదలు పెట్టిన ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపవద్దు. ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళితే లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటాం. మన చదువు మనకే కాకుండా మన దేశానికి ఉపయోగపడేలా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమాజ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలి.

ప్రభుత్వ ఆస్పత్రిలోనే అదనపు కలెక్టర్‌ ప్రసవం..

కలెక్టర్‌ స్నేహలత


ఖమ్మం జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవ‌ల‌ ప్రసవం చేయించుకున్న అదనపు కలెక్టర్‌ స్నేహలత, ఆమె భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌లను రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అభినందించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి.. స్నేహలతకు జన్మించిన చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు. భార్యాభర్తలిద్దరూ ఉన్నతాధికారులైనా.. సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత గౌరవం పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. 

సామాన్య మహిళలా..
కాగా  ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత , భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్​పీ శబరీస్​ దంపతులకు ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. స్నేహలత సామాన్య మహిళలా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. డెలివరీ టైం అని వైద్య సిబ్బంది కలెక్టర్ స్నేహలతకు అక్కడే డెలివరీ చేశారు. తల్లిబిడ్డా క్షేమమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ కలెక్టరమ్మ డెలివరీ న్యూస్ నెట్టింట్లో హడావిడీ చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడుపోసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంటూ స్నేహలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీ నిర్ణయంతో ప్రభుత్వాసుపత్రుల పై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.

 

Published date : 25 Oct 2021 12:47PM

Photo Stories