Skip to main content

ప్లానింగ్ + హార్డ్ వర్క్ = విజయం సివిల్స్‌ 754 ర్యాంకర్ ఉదయనాథ్..

లక్షల్లో వేతనం, సాఫ్ట్‌వేర్ సదుపాయాలు వదిలి 5 సంవత్సరాల నుంచి ప్రిపేరయ్యాను.. ర్యాంకు వస్తుందని ముందే ఊహించాను.. ఇంటర్వ్యూకు వెళ్లడం ఇది నాలుగోసారి.. చివరి మూడు సార్లు చేసిన తప్పులు గుర్తించి పూర్తి ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరానని చెప్తున్న కోట్ల ఉదయనాథ్ 2012 సివిల్స్‌లో 754 ర్యాంకు సాధించారు.

చాలా సంతోషంగా ఉంది.. మెరిట్‌లిస్ట్‌లో నా పేరు కన్పించగానే చాలా ఆనందపడ్డాను. ఈ సారి తప్పకుండా ఎంపికవుతానని ముందే ఊహించాను. ఎందుకంటే నేను ఇంటర్యూకు వెళ్లడం ఇది నాలుగోసారి. ముందు ఇంటర్వ్యూల్లో చేసిన పొరపాట్లను గుర్తించి కొంచెం ఎక్కువ పోకస్ చేశాను. చివరి సారి 1050 మార్కులు వచ్చాయి. కేవలం 6 మార్కుల్లోనే ర్యాంకు పోయింది. ప్రస్తుత ర్యాంకు 754. ఇది సరిపోదు. నాకు ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి. మరింత మంచి ర్యాంకు కోసం ప్రయత్నిస్తాను.

ప్రత్యేక కారణాలేమీ లేవు.. సివిల్స్ రాయడానికి ప్రత్యేక కారణాలేమీ లేవు. ఐఏఎస్ అవ్వాలని అనుకున్నాను. అంతే ప్రిపరేషన్ ప్రారంభించాను. ఇదిగో నాలుగోసారి ఇలా ర్యాంకు సాధించాను. 2005లో ఇంజనీరింగ్ పూర్తి చేసి సత్యం కంప్యూటర్‌‌సలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాను. తర్వాత ఉద్యోగం వదిలేసి సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాను.

అమ్మా, నాన్న ఇద్దరూ టీచర్లే.. మాది మహబూబ్‌నగర్ జిల్లా. అమ్మా, నాన్న ఇద్దరూ టీచర్లే. పదో తరగతి వరకు నల్గొండ జిల్లా దేవరకొండలో చదివాను. ఇంటర్ నెల్లూరు నారాయణ కాలేజీలో పూర్తి చేశాను. తర్వాత హైదరాబాద్‌లో ఈసీఈలో ఇంజనీరింగ్ పూర్తి చేశాను.

ఇప్పటికే నేను ప్రభుత్వోద్యోగిని.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. గతేడాది ఎస్‌ఎస్‌సీ పరీక్ష ద్వారా కాగ్‌లో ఆడిటర్‌గా ఎంపికయ్యాను. 2012లో మళ్లీ సివిల్స్ రాశాను. ఈ సారి తప్పకుండా ఎంపికవుతాననుకున్నాను.

రోజుకు 8 గంటలు చదివేవాణ్ని.. ఉద్యోగం మానేసి 2008లో ప్రిపరేషన్ ప్రారంభించాను. మొదట్లో చాలా చోట్ల కోచింగ్ తీసుకున్నాను. రోజుకు దాదాపు 8-10 గంటలు చదివేవాణ్ని. క్లాస్‌రూమ్ నోట్సే ఎక్కువగా చదివాను. కొన్ని ప్రామాణిక పుస్తకాలు చదివాను. ఈ ఐదేళ్లలో చాలా పుస్తకాలు చదివాను. మొదటిసారే ఇంటర్వ్యూకు వరకు వెళ్లగలిగాను. ఈ సారి కొత్తగా ప్రిపేర్ అవ్వలేదు. అంతా రివిజన్ మాత్రమే. కరెంట్ అఫైర్‌‌సపై ఎక్కువగా ఫోకస్ చేశాను. అయితే మొదటి ప్రిపరేషన్‌లోనే పూర్తిస్థాయి అవగాహన ఏర్పడింది.

నా ఆప్షనల్స్ చరిత్ర, తెలుగు లిటరేచర్.. మెయిన్‌‌సలో నా ఆప్షనల్స్ చరిత్ర, తెలుగు లిటరేచర్. హిస్టరీకి కరీమ్ సర్, లిటరేచర్‌కు నాగరాజు సర్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను.

ఇతర వ్యాపకాలు ఉండకూడదు.. పక్కాప్రణాళికతో దాదాపు ఒకటిన్నర సంవత్సరం కష్టపడితే విజయం వరిస్తుంది. రోజుకు కనీసం 8 గంటలు చదవాలి. రివిజన్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక అంశాన్ని ఎక్కువసార్లు చదివేలా చూసుకోవాలి. అన్నింటికి మించి ఏ ఇతర వ్యాపకాలు ఉండకూడదు.

ఇంటర్వ్యూ 35 నిమిషాలైంది.. నన్ను అల్క సిరోహి నేతృత్వంలోని బోర్డు దాదాపు 35 నిమిషాలు ఇంటర్య్యూ చేసింది. ఇంటర్వ్యూ ఇంగ్లీష్‌లోనే చేశాను.
  • కాగ్ ఇటీవల క్రియాశీల పాత్ర పోషిస్తుంది కదా?
  • కుంభమేళా గురించి చెప్పండి?
  • సంజయ్‌దత్‌కు బెయిల్ పొడిగించడంపై మీ అభిప్రాయం?
  • సత్యం కుంభకోణం ఎలా జరిగింది?
  • ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా వైదొలగితే భారత్‌కు ఉండే సమస్యలేంటి? వంటి ప్రశ్నలు అడిగారు.
Published date : 03 May 2013 07:43PM

Photo Stories