ఒకప్పుడు పట్వారీ.... ఇప్పుడు ఐపీఎస్ అధికారి!
Sakshi Education
బికనీర్: పట్వారీ, అసిస్టెంట్ జైలర్, ప్రైమరీ స్కూల్ టీచర్, సబ్ ఇన్‌స్పెక్టర్, హైస్కూల్ టీచర్, కాలేజీ లెక్చరర్..చివరికి ఐపీఎస్...2010 నుంచి 2016 వరకు ఓ వ్యక్తి సాధించిన ఉద్యోగాలివి.
ఆశ్చర్యకరంగా ఉందా..ఎలా సాధ్యమంటారా...ఏదో ఒక ఉద్యోగం వచ్చిందని ఆగిపోకుండా లక్ష్యం నెరవేరేవరకు పోరాడితే ఏదైనా సాధ్యమనేనని నిరూపించాడు రాజస్థాన్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రేమ్ సుఖ్ దేవ్. ఈ యువ అధికారి పట్వారీగా ప్రస్థానం ప్రారంభించి ఐపీఎస్ ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబంలో ప్రేమ్ జన్మించాడు. ఏదైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్న ప్రేమ్ కష్టపడి చదువుతూ ఎంఏ హిస్టరీ పూర్తిచేశాడు. 2010లో తొలిసారి పట్వారీ /( రెవెన్యూ అధికారి) ఉద్యోగం సంపాదించాడు. పట్వారీ అయిన ఏడాదే అసిస్టెంట్ జైలర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2011లో ప్రైమరీ టీచర్, 2013లో సబ్-ఇన్‌స్పెక్టర్, హైస్కూల్ టీచర్ ఉద్యోగాలు కూడా వచ్చాయి. తర్వాత బీఈడీ పూర్తిచేసి నెట్ సాధించాడు. అనంతరం ఓ కళాశాలలో అధ్యాపకుడిగా ఎంపికయ్యాడు. అయినా ప్రేమ్ తన పట్టుదలను వీడలేదు. కొలువుల వేటను కొనసాగించాడు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో కొంచెం తేడాతో పోలీస్ ఉద్యోగం చేజారినప్పటికీ , రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. అయితే ఓటమిని అంగీకరించని ప్రేమ్..2015లో యూపీ ఎస్సీ సివిల్స్ పరీక్ష రాశాడు. హిందీ మాధ్యమంలో మెయిన్స్ రాసిన ప్రేమ్..170వ ర్యాంక్ సాధించి 2016లో ఐపీఎస్ అధికారి అయ్యాడు. శిక్షణ పూర్తిచేసుకుని గుజరాత్‌లోని ఆమ్రేలీ జిల్లాలో ఏఎస్‌పీగా ఇటీవల విధుల్లో చేరాడు. ప్రేమ్‌కు ఈ ఉద్యోగాలన్నీ అంత తేలిగ్గా ఏమీరాలేదు. ఎంతో కష్టపడి సాధించుకున్నాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే పరీక్షలకు సన్నద్ధమయ్యేవాడు. ఇందుకోసం ప్రతి రోజూ ఐదు గంటల సమయాన్ని వెచ్చించేవాడు. అమ్మనాన్న చదువుకోలేదు. విద్య ప్రాధాన్యత వారికెవరికీ తెలియదు. ‘‘కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నా అన్నయ్య ప్రోత్సాహంతోనే నేను పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాను’’ అని ప్రేమ్ చెప్పాడు. నీ లక్ష్యం చేరేదాకా ఆగిపోకంటూ తరచూ బోధించే ప్రేమ్...ఐపీఎస్ అధికారిగా తన సత్తా చాటాడు. రెండు పరేడ్‌లకు కమాండెంట్‌గా వ్యవహరించాడు. సర్దార్ వల్లభాయ్ విగ్రహన్ని ఆవిష్కరించటానికి ప్రధాని వచ్చిన సమయంలోఈయనే కమాండెంట్. అటువంటి భారీ కార్యక్రమానికి గుజరాత్ పోలీసుల తరపున ప్రాతినిథ్యం వహించడం తన అదృష్టమని చెప్పాడు.
Published date : 03 Jan 2020 03:38PM