కోవిడ్‌నే అదుపులో పెట్టిన ఆఫీసర్‌కి లాండ్ మాఫియా ఒక లెక్కా...?
కోవిడ్ విరుచుకు పడింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేశారు. భూ వ్యాపారులు దిగబడ్డారు. రైతుల్ని కాపాడారు. ఇన్ని చేసిన కణ్మణి జాయ్.. ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. చిన్న స్మైలిచ్చి వెళ్లిపోయేవారు. జాయ్.. డిప్యూటీ కమీషనర్. ఇప్పుడామె.. జేజమ్మా.. జాయమ్మా..!
పేదవాళ్లకు ఆప్యాయంగా అన్నం వడ్డిస్తూ...
ఒక మంచి ఫేక్ ప్రపంచానికి త్వరలోనే మీరు తలవంచవలసి రావచ్చు. మీరు గనుక అబ్బాయి లేదా పురుషుడు అయితే.. ‘మిర్చి’ సినిమాలో అచ్చు మీలా ఉండే ప్రభాస్ లాంటి వ్యక్తి భోజనం బల్లల ముందు వరుసగా కూర్చున్న పేదవాళ్లకు ఆప్యాయంగా అన్నం వడ్డిస్తూ ఉంటాడు. ‘పండగలా దిగివచ్చావు.. ప్రాణాలకు వెలుగిచ్చావు...’ అంటూ, ఇంకా మీరు చేసిన మంచి పనులన్నిటినీ కీర్తిస్తూ ఉన్న ఒక వీడియో అక్కడి తిరిగి, ఇక్కడ తిరిగి, లోకమంతా తిరిగి చివరికి మీ వాట్సాప్‌కే రావచ్చు!
అదే మీరు అమ్మాయి లేదా మహిళ అయితే.. ‘అరుంథతి’ సినిమాలో అచ్చు మీలా ఉండే అనుష్క లాంటి మంచమ్మాయి భోజనానికి నేల మీద వరుసగా పరిచిన అరటి ఆకుల ముందు కూర్చున్న పేదలకు ఆప్యాయంగా అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ‘కమ్ముకున్న చీకట్లోనా.. కమ్ముకొచ్చే వెలుతురమ్మా.. జేజమ్మా మాయమ్మా.. జేజమ్మా ఓయమ్మా..’ అంటూ, ఇంకా మీరు చేసిన మంచి పనులన్నిటినీ కీర్తిస్తూ ఉన్న ఒక వీడియో తిరిగి తిరిగి, చివరికి మీ వాట్సాప్‌కే రావచ్చు.
ఆ వీడియోలో ఉన్నది మీరు కాదని మీకు తెలుస్తూనే ఉంటుంది. అయితే వీడియోలో మీలాంటి మనిషే చేసిన మంచి పనులు మాత్రం అచ్చంగా మీరు చేసినవే అయి ఉంటాయి. అప్పుడు మీకు సంతోషమే కదా. అయితే ‘అందులో ఉన్నది నేను కాదు’ అని లోకానికి చెప్పాలని కూడా అనిపిస్తుంది. ఎవరికి చెబుతారు? యానిస్ కణ్మణి జాయ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కాబట్టి, తన వాట్సాప్‌కు ఫార్వర్డ్ అయిన వీడియోలో తనలా ఉన్న యువతి, తను ఒకటి కాదని చెప్పేందుకు ఒక ప్రకటన విడుదల చేయగలిగారు.
మనుషుల్ని మంచి పనులకు ఇన్‌స్పైర్ చేసే ఆ అబద్ధపు సోషల్ మీడియా వీడియో యానిస్ కణ్మణి జాయ్ పేరు మీద ఇప్పుడు నెట్‌లో తిరుగుతోంది. వీడియోలోని యువతి ఏదో ఆఫీస్ లోపలికి నడుచుకుంటూ వస్తుండగా సూట్లు వేసుకుని ఉన్న సిబ్బంది అంతా లేచి నిలబడి ఆమెకు నమస్కరిస్తుంటారు. వారిలో కొందరు వంగి ఆమె కాళ్లకు దండం పెడుతుంటారు. ఆమె చిరునవ్వుతో ఇబ్బందిగా పక్కకు తప్పుకుని వెళుతుంటుంది... ఆ వీడియోకు అటాచ్ చేసిన పోస్టులో.. ‘‘ఒకప్పుడు ఈమె త్రివేండ్రం మెడికల్ కాలేజ్‌లో నర్సు. ఐ.ఎస్.ఎస్. అయ్యి, కొడగు జిల్లా కలెక్టరుగా వెళ్లారు. నర్సుగా తనకు ఉన్న అనుభవంతో కొడగు జిల్లాలో కోవిడ్ వ్యాప్తిని విజయవంతంగా కట్టడి చేశారు. ఈమె పేరు యానిస్ కణ్మణి జాయ్. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఈమె చూపిన దీక్షాదక్షతలకు, అంకిత భావానికి జిల్లా ప్రజలు కరోనా వారియర్ గా పట్టం కడుతున్నారు. పాదాభివందనాలు చేస్తున్నారు’’ అని ఉంటుంది.
ఆ వీడియో నేరుగా యానిస్ కణ్మణికే ఫార్వార్డ్ అయింది! వీడియోను చూసి ఆమె నవ్వుకున్నారు. ‘‘నిన్నటి నుంచీ నాకు అభినందనలు తెలుపుతూ మెజేస్‌లు వస్తున్నాయి. అయితే అందులో ఉన్నది నేను కాదు’’ అని మర్నాడే ఒక ప్రకటన విడుదల చేశారు. వీడియోలో ఉన్నది యానీస్ కణ్మణి కాకపోయినా, కర్ణాటక కొడగు జిల్లాలో ప్రభుత్వం కోవిడ్‌ను నియంత్రించ గలిగిందంటే.. అది కణ్మణి వల్లనే. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కనిపిస్తున్న యువతి తప్ప, తక్కిన వివరాలన్నీ వాస్తవమైనవే. కణ్మణి నర్సుగా చేశారు. ఐ.ఎ.ఎస్. చదివారు. కొడగు జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా చేస్తున్నారు. కరోనా ఆరంభం అయిన నాటి నుంచీ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. అందరి మన్ననలు అందుకుంటున్నారు. అనేక సంస్థలు ఆమెకు సన్మానం చేయడానికి ముందుకు వచ్చినా ఆమె నవ్వుతూ ‘‘నా డ్యూటీ నేను చేస్తున్నాను. అంతే’’ అని నిరాకరిస్తుంటారు.
కొడగు డిప్యూటీ కమిషనర్‌గా యానిస్ కణ్మణి జాయ్‌కి కి ఇది తొలి పోస్టింగ్. 2009లో త్రివేండ్రంలో నర్సింగ్ కోర్సు చదివారు. 2012లో సివిల్స్ రాశారు. ఆలిండియాలో 65 వ ర్యాంకు సంపాదించారు. కొడగు పోస్టింగ్‌కి ముందు బీదర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్నారు. కర్ణాటక భవన్‌లో, తుమకూరు జిల్లా పరిషత్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో కొడగు డీసీగా వచ్చారు. మరుసటి నెలలోనే దేశంలోకి కోవిడ్ ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం కంటే త్వరగా స్పందించారు కణ్మణి జాయ్. మార్చి 25 లాక్‌డౌన్‌కు ముందే ఆమె తన ప్రత్యేక అధికారాలతో కొడగులోని పర్యాటక స్థలాలను మూసి వేశారు.
అంతా కష్టపడి పనిచేస్తేనే ఇది సాధ్యమయింది...
ఇటీవల అక్కడ కావేరీ తీర్థోత్సవం, మడికెరి దసరా వేడుకలు జరిగాయి. ప్రజలు గుమికూడకుండా, దూరం పాటించేలా కణ్మణి జాయ్ గట్టి చర్యలు తీసుకున్నారు. కేసులేమీ నమోదు కాలేదు. ‘‘టీమ్ అంతా కష్టపడి పనిచేస్తేనే ఇది సాధ్యమయింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖలు సహకరించాయి’’ అంటారు కణ్మణి జాయ్. కోవిద్ ఒక్కటే కాదు. డిప్యూటీ కమిషనర్‌గా ఈ ఏడాదిన్నరలో అనేక సంక్షోభాల్లో జిల్లాను కంటికి రెప్పలా చూసుకున్నారు కణ్మణి. వరదలు వచ్చాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ ప్రమాదాల నుంచి ప్రజల్ని తప్పించారు. పంట భూములు రియల్ ఎస్టేట్ వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కూడా అడ్డుకున్నారు. ప్రజలకు ఆమె మీద ఎంత అభిమానం ఉందో, రియల్టర్‌లకు అంత కోపం ఉంది. కోపాలకు భయపడే వ్యక్తి కారు కణ్మణి. కోవిడ్‌నే అదుపులో పెట్టిన ఆఫీసర్‌కి లాండ్ మాఫియా ఒక లెక్కా?!