Skip to main content

చిన్న కిరాణ కొట్టు యజమాని కొడుకు సివిల్స్ విజేత

కృషి, పట్టుదల ఉంటే అత్యున్నత లక్ష్యాలను సాధించవచ్చని ఓ కిరాణ కొట్టు యజమాని కుమారుడు నిరూపించారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని అతను చాటి చెప్పారు. 2016 సివిల్స్ ఫలితాల్లో అతను ఏకంగా 220వ ర్యాంకు సాధించి తన ‘ఆకాంక్ష’ను నెరవేర్చుకున్నారు.
కుటుంబ నేపథ్యం:
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయనిపేటకు చెందిన వి.సుధాకర్, వి.లక్ష్మిదేవి దంపతుల కుమారుడు వి.సాయివంశీవర్దన్ ..సివిల్స్‌లో మెరిశారు. చదువులో మొదటి నుంచి ముందంజలో ఉండటంతో అతనని.. తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ప్రాథమిక విద్య వైఎస్‌ఆర్‌జిల్లా జమ్ములమడుగు నుంచి మొదలైంది. ఇక్కడ 1 నుంచి 7వ తరగతి వరకు సెయింట్ మేరీస్ స్కూలు, 8 నుంచి 10వ తరగతి వరకు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీవాణి స్కూలులో చదివారు.

ఇంటర్మీడియట్ నెల్లూరు నారాయణ కళాశాలలో ఎంపీసీ గ్రూపు చదివి 950 మార్కులు సాధించారు. 2010లో చిత్తూరు జిల్లాలోని విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

నలుగురు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు...
2010లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయగా ర్యాంక్ రాలేదు. అనంతరం టాటా కన్సల్టెన్సీ సర్వీసులో 2010-12 వరకు ఉద్యోగం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన ఫెలోషిప్‌కు ఎంపికై .. రెండు సంవత్సరాల పాటు జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో పని చేశారు. ఈ సమయంలో పరాస్‌నాథ్ కొండల్లో పర్యటిస్తుండగా.. నలుగురు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే 48 గంటల తర్వాత తిరిగి అతన్ని వదిలేశారు.

స్ఫూర్తిగా...
జార్ఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో పంజాబ్ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ లక్రాను స్ఫూర్తిగా తీసుకొని.. 2015 నుంచి సివిల్స్‌కోసం ఢిల్లీలోని వాదిరామ్ ఇన్సిట్యూట్‌లో శిక్షణ పొందారు. 2016 నోటిఫికేషన్ విడుదల కావడంతో సోషియాలజీ ఆప్షన్ పరీక్ష రాసి 220 ర్యాంకు సాధించారు.

ఈ ఆకాంక్ష ..
టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో స్నేహితులతో కలిసి పేద విద్యార్థులను, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఆకాంక్ష పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కోసం పని చేస్తున్న సమయంలోనే పేదరికం నిర్మూలించాలంటే ఐఏఎస్ సాధించి సమాజానికి తమవంతుగా సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు సాయి వంశీవర్థన్ తెలిపారు. అక్క సౌజన్య, బావ ప్రసాద్‌లు తనకు ఆర్థికంగా సాయం చేశారని చెప్పారు. స్నేహితులు రమేష్, రాజేష్...సలహాలు సూచలు ఇచ్చేవారని తెలిపారు.
Published date : 16 Nov 2020 07:14PM

Photo Stories