Skip to main content

చెప్పిన మాటను నిజం చేస్తూ...'ఐపీఎస్' అయ్యానిలా..: పవన్ కుమార్ రెడ్డి

సన్మాన గ్రహీత రమేష్‌రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే నిశ్శబ్ద వాతావరణం...సుమారు 20 నిమిషాల ప్రసంగం.. మద్యలో ఒక యువకుడిని వేదిక మీదకు పిలిచి, నా తర్వాత సివిల్స్ విజేత ఇతనే అంటూ పరిచయం చేశాడు. రమేష్‌రెడ్డి చెప్పిన మాటలకు అక్కడున్న వారిలో పూర్తి నమ్మకం..
కారణం అతడు క్లాస్‌టాపర్‌ మాత్రమే కాదు అనుకున్నది సాధించే మొండి వాడు కూడా. అనాడు రమేష్‌రెడ్డి చెప్పిన మాటలను నిజం చేస్తూ సివిల్స్‌లో 179వ ర్యాంక్‌ సాధించారు ప్రకాశం జిల్లాకు చెందిన అల్లాటిపల్లి పవన్‌ కుమార్‌ రెడ్డి.

కుటుంబ నేప‌థ్యం :
అల్లాటిపల్లి పవన్‌ కుమార్‌ రెడ్డిది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు. తండ్రి నారాయణరెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. తల్లి వెంటకరత్నమ్మ గహిణి. ఐదవ తరగతి వరకు నేరేడుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆ తర్వాత 10 వరకు ఒంగోలులోని నవోదయ పాఠశాలలో, ఇంటర్‌ రత్నం కళాశాలలో పూర్తి చేశారు. బాపట్ల వ్యవసాయ కళాళాలలో అగ్రికల్చర్‌ బీఎస్సీ జాయిన్‌ అయ్యారు. బీఎస్సీ పూర్తి కాగానే ఉత్తరాఖాండ్‌లోని జీపీ పంత్‌ కళాశాలలో అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత దొనకొండ ఏఈఓగా 2011 లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు.

ఓడిపోయిన ప్రతిసారి ఈ మాటలే గుర్తుకు వ‌చ్చేవి...
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌ సన్నాహాలు ప్రారంభించారు పవన్‌. 2012లో సివిల్స్‌ రాయడం మొదలుపెట్టి 2015 వరకు సివిల్స్‌పై సమరం సాగించారు. 2012లో ప్రిలిమినరీ, 2014, 2015లో మెయిన్స్‌ వరకు వచ్చి ఓడిపోయినా నిరాశ చెందలేదు. జీవితంలో ఓడిపోయానని అనిపించిన ప్రతిసారి స్టేజీపై రమేష్‌ రెడ్డి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి. 2016లో ఢిల్లీ నుండి హైదరాబాదుకు తిరిగి వచ్చి స్నేహితులతో కలసి మళ్లీ ప్రిపరేషన్‌ మొదలుపెట్టారు. గతంలో ఏర్పడిన వైపల్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నారు. నాలుగవ ప్రయత్నంలో మెయిన్స్‌ను పూర్తి చేసి ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఇంటర్వ్యూను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.

నా జీవితంలో మ‌రిచిపోలేని జ్ఞాపకం..
ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్లారు పవన్‌. 2016 మే10న పలితాలు విడుదలయ్యాయి. 179వ ర్యాంక్‌తో ఐపిఎస్‌కు సెలక్ట్‌ అయ్యారు. ఆరోజు సంఘటన ఆయన మాటల్లోనే ‘‘ ఫలితాల్లో నా పేరు చూడగానే అమ్మానాన్న అంటూ గట్టిగా అరిచేసా. పక్కరూమ్‌లో వున్న అమ్మానాన్నలు పరుగెత్తుకొచ్చి గట్టిగా కౌగలించుకున్నారు. ఓ అరగంట పాటు ఆనందభాష్పాలు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్న సంతృప్తి. ఆరోజు రమేష్‌రెడ్డి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. సర్వీస్‌ రాకముందు, వచ్చిన తర్వాత ఆ ఒక్కక్షణం జీవితంలో ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవనేవారు ఆయన. అది నిజమే’’ అంటూ ఆ మధుర జ్ఞాపకాలను సాక్షికి వివరించారు పవన్‌.

సమయం దొరికితే ...
పవన్‌కుమార్‌రెడ్డికి తన విధులు ఎంతో ముఖ్యమో అంతకంటే తెలుగు సాహిత్యంపైన మక్కువ. సమయం దొరికితే చాలు పుస్తకాలతో సావాసం చేస్తారు. తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతోనే సివిల్స్‌ మెయిన్స్‌కు తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. కుక్కపిల్ల..సబ్బుబిల్ల,.. కాదేదీ కవితకు అనర్హం అంటూ శ్రీశ్రీ చెప్పిన మాటల స్ఫూర్తితో ఇప్పటి వరకు 30 పైగా కవిత్వాలు కూడా రాశారు. తెలుగు మీడియం విద్యార్థులకు సివిల్స్‌పై ఉన్న భయాన్ని పోగట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు పవన్‌. స్నేహితులతో కలిసి తెలుగులో సివిల్స్‌ మెటీరియల్‌ తయారు చేస్తున్నారు.

ఈ గ్రామాలపై ప్రత్యేక దృష్టి...
పొన్నేరీ ఏఎస్పీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మత్య్సకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపాళయవనం పొన్నేరి తదితర ప్రాంతాల్లో 35 మత్సకార గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ తరచూ ఘర్షణలు, హత్యలు, దాడులతో నిత్యం రణరంగంగా ఉండేవి. ఈ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్‌ కుమార్‌ అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. గ్రామాల్లో శాంతి కమిటీలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు.

తెలుగోడి సత్తాను చూపించాడు...
సివిల్స్‌లో విజయం సాధించాక ఎన్‌పీఏలో ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని పొన్నేరీ అసిస్టెంట్‌ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. రౌడీలకు షెల్టర్‌గా వున్న పొన్నేరీలో శాంతిభద్రతల అదుపు కోసం అల్లరిమూకలను జల్లెడపట్టారు. సుమారు 25 మంది రౌడీలను అరెస్టు చేశారు.. 10 మందిపై గూండాచట్టం ప్రయోగించారు. ఎర్రచందనం, రేషన్‌బియ్యం, గంజా విక్రయంపై ఉక్కుపాదం మోపారు. 300 పైగా సీసీ కెమరాలను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాపిక్‌ను నియంత్రించి శభాష్‌ అనిపించుకున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక మాఫియాను నెలరోజుల్లోనే అణచివేసి అక్రమార్కులకు సింహస్వప్నంలా మారారు. ఎంతలా అంటే ఆయన సెలవు పెట్టి రెండు రోజులు ఊరికి వెళితే.. బదిలీపై వెళ్లిపోయాడని ఇసుక మాఫియా తమకు అడ్డు తొలగిందని టపాసులు కాల్చేంతగా. మొత్తానికి అక్రమార్కులకు తెలుగోడి సత్తాను చూపించారు పవన్‌.
Published date : 10 Nov 2020 04:50PM

Photo Stories