Armstrong Pame, IAS: నా ఫేస్‌బుక్ పేజీ ద్వారా 40 లక్షల రూపాయల విరాళాలను సేకరించా.. వాటితో..
ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా 40 లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. వాటితో రోడ్డును నిర్మించడంతో రోడ్డుకు కూడా ‘పీపుల్స్ రోడ్’ అని పేరు వచ్చింది.
వారానికోసారి ఇంటికి పిలిచి...
ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేసే ఈ కలెక్టర్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఇటీవల ఓ కొత్త ఆలోచన వచ్చింది. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను వారానికోసారి ఇంటికి పిలిచి భోజనం పెట్టాలని, ఈ సందర్భంగా వారి నుంచి వారి కలలు, ఆశయాల గురించి తెలసుకోవాలని, అలాగే వారు జిల్లా ఎలా అభివృద్ధి చెందాలనుకుంటున్నారో తెలసుకోవాలని. వెంటనే ఆయన తన ఆలోచనను అమల్లో పెట్టారు. ప్రతి శుక్రవారం ఆయన విద్యార్థులను తన అధికార బంగ్లాకు పిలిపించి వారికి మంచి భోజనంపెట్టడమే కాకుండా వారికి వంతులవారిగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎలా పనిచేస్తుందో చూపిస్తున్నారు.
ఆ రోజుల్లో రోజూ కలెక్టర్ కార్యాలయానికి..
కలెక్టర్ ఆర్మ్‌స్ట్రాంగ్, తాను విద్యార్థిగా చదువుతున్న రోజుల్లో రోజూ కలెక్టర్ కార్యాలయం ముందు నుంచి వెళ్లేవారట. ఆ కార్యాలయంలో ఎవరెవరూ ఉంటారో, వారు ఎలా పనిచేస్తారో చూడాలనిపించేదట. అయితే ఆయనకు విద్యార్థి దశలో ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు అదే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తున్నారు. 2005లో ఢిల్లీలోని స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆర్మ్‌స్ట్రాంగ్ 2007లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఆ తర్వాత 2008లో యూపీఎస్సీ పరీక్షలు రాసి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2015లో భారత్‌లోనే అత్యుత్తమ సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా అవార్డు అందుకున్నారు.