Skip to main content

Anudeep Durishetty, IAS: నేను సివిల్స్‌లో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించ‌డానికి కార‌ణం ఇదే..

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటేనే ఒక మారథాన్. ఈ పరుగులో ఒక్క అడుగు తడబడ్డా.. విజయం ఎండమావే! తొలి ప్రయత్నంలో విఫలమైనా..
Anudeep Durishetty, IAS
Anudeep Durishetty, IAS

అది నేర్పిన పాఠాలతో ముందడుగు వేసి రెండో యత్నంలో ఐఆర్‌ఎస్‌ను చేజిక్కించుకున్నాడు.

ఏకంగా అయిదుసార్లు పరీక్షకు హాజరై..
అయితే తొలి నుంచి మనసంతా ఐఏఎస్‌పైనే ఉండటంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదుసార్లు పరీక్షకు హాజరై.. తన కలను సాకారం చేసుకున్నాడు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటాడు. దేశ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ యువకుడే దురిశెట్టి అనుదీప్.
రెండో అటెంప్ట్‌లోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన అనుదీప్.. తర్వాతి ప్రయత్నాల్లో నిరాశకు గురవడానికి కారణాలు.. తనలోని లోటుపాట్లు.. వాటిని సరిదిద్దుకున్న మార్గాలు.. చివరకు అనుకున్న లక్ష్యం.. ఐఏఎస్‌ను చేరుకునేందుకు అనుసరించిన విధానాలు.. సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులకు ఉండాల్సిన లక్షణాలు.. ఇలా వివిధ అంశాల సమాహారాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

సాఫ్ట్‌వేర్ కొలువు చేస్తున్నా..
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అది మనలోని పరిజ్ఞానానికి సరితూగుతుందా? అని ప్రశ్నించుకోవాలి. దీనికి సానుకూల సమాధానం లభిస్తే.. మన మనసే విజయానికి అవసరమైన మార్గనిర్దేశం చేస్తుంది. లక్ష్యం దిశగా కదిలేందుకు తోడ్పాటునందిస్తుంది. నా విషయంలో ప్రస్తుత విజయంలో ఇదే కీలక అంశం. సాఫ్ట్‌వేర్ కొలువు చేస్తున్నా.. ప్రజలకు సేవ చేయాలనే తపనతో సివిల్స్‌పై దృష్టిసారించాను. అందులోనూ అత్యున్నత సర్వీసు ఐఏఎస్‌ను లక్ష్యంగా ఎంపిక చేసుకున్నాను. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలో విజయం చేజారింది. రెండో ప్రయత్నంలో మాత్రం ఐఆర్‌ఎస్ లభించింది. అప్పటికైతే సర్వీసులో చేరాను. కానీ, మనసంతా ఐఏఎస్‌పైనే!

ఆ సమయంలో ఒక్క నిమిషం బ్రేక్ పడినా.. 
2012లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్ తొలి దశ ప్రిలిమ్స్‌లో విజయం సాధించాను. మెయిన్ ఎగ్జామినేషన్‌లో వైఫల్యం ఎదురుకావడంతో కొద్దిగా నిరాశ చెందాను. ఆ వైఫల్యానికి కారణాలు ఏంటనే దానిపై స్వీయ విశ్లేషణ చేశాను. ‘రాత’లో వెనకబడటం ప్రధాన కారణమని గుర్తించా! సివిల్ సర్వీసెస్‌కు ప్రిపరేషన్ అనేది మెగా మారథాన్ అయితే.. పరీక్ష గదిలో చూపే ప్రదర్శన మినీ మారథాన్. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో పద పరిమితి, అందుబాటులో ఉన్న సమయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటూ ఆన్సర్ షీట్‌పై పెన్‌ను కదిలించాలి. అలాంటి సమయంలో ఒక్క నిమిషం బ్రేక్ పడినా.. విజయావకాశాలకూ బ్రేక్ పడినట్లే. ఈ విషయంలోనే నాలో పొరపాటు ఉందని గుర్తించాను.

నాలో ప్రధాన లోపం..
వేగంగా సమాధానాలు రాయలేకపోవడమే నాలో ప్రధాన లోపమని గుర్తించడంతో.. రెండో అటెంప్ట్‌కు ప్రిపరేషన్ సయమంలో రైటింగ్ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. ఇది పరీక్ష హాల్లో సానుకూల ప్రదర్శనకు అవకాశం కల్పించింది. కానీ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో కొద్దిగా తడబడ్డాను. అయినా 790వ ర్యాంకుతో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) లభించింది. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగింది.

లక్ష్యం..

Anudeep durishetty


2013లో విజయంతో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై సర్వీసులో చేరినప్పటికీ.. మనసంతా ఐఏఎస్ సాధించాలనే దానిపైనే ఉంది. అందుకే ఒకవైపు ఐఆర్‌ఎస్ ప్రొబేషనరీ ట్రైనింగ్ తీసుకుంటూనే ఐఏఎస్ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాను. ప్రిపరేషన్‌కు మరింత పదునుపెడుతూ అటెంప్టులు ఇచ్చాను. కానీ, వరుసగా రెండేళ్లు (2014, 2015) నిరాశే ఎదురైంది. పరీక్ష శైలి, ప్రశ్నలు వస్తున్న తీరులో మార్పు, మూడు గంటల సమయంలో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన పరిస్థితికి అనుగుణంగా వేగాన్ని అందుకోలేకపోవడం వంటివన్నీ ప్రతికూల ఫలితాలకు కారణమయ్యాయి. ఒకవైపు ఐఆర్‌ఎస్ శిక్షణ, మరోవైపు స్వీయ ప్రిపరేషన్‌తో అధిక శాతం రీడింగ్‌పైనే దృష్టి పెట్టడంతో రైటింగ్‌పై ఎక్కువ దృష్టిసారించకపోయాను. దీనివల్ల వల్ల కూడా 2014, 15లో మెయిన్స్‌లో విజయం సాధించలేకపోయాను.

వరుసగా రెండుసార్లు ఓటమి..
వరుసగా రెండుసార్లు ఓటమి ఎదురు కావడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఎంత శ్రమించినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయాననే బాధ వెంటాడింది. అప్పటికే బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయింది. దీంతో 2016లో అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. ఇంత జరిగినా మనసు నుంచి ‘ఐఏఎస్’ దూరం కాలేదు.
‘‘సాధించాలి.. సాధించాలి..’’ అనే మాటలు మారుమోగుతూనే ఉన్నాయి. దీంతో నిరాశకు ఫుల్‌స్టాప్ పెట్టాను. 2017 నోటిఫికేషన్‌లో అటెంప్ట్ ఇచ్చాను. వాస్తవానికి ఇది చివరి అవకాశం. ఐఏఎస్ లక్ష్యం దిశగా ‘డూ’ ఆర్ ‘డై’ అనే స్థితి అని చెప్పొచ్చు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఏఎస్ సాధించాలి అని బలంగా నిశ్చయించుకున్నాను. అప్పటికే సబ్జెక్టు పరిజ్ఞానం పరంగా పట్టు లభించడంతో పూర్తిస్థాయిలో రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాను. పరీక్ష రాశాక ఐఏఎస్‌కు అవసరమైన ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ, ఏకంగా ఊహించని విధంగా ఆలిండియా స్థాయిలో టాప్-1 ర్యాంకు సాధించడం.. దాంతో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.

నేను చ‌దివిన పుస్త‌కాలు..Books
ఇక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్, మెటీరియల్ కోణంలో ఆలోచిస్తే.. పేపర్లకు సంబంధించి అభ్యర్థుల్లో అధిక శాతం మంది చదివే పుస్తకాలు ఒకే విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ మెటీరియల్, ఎకనామిక్స్‌కు మిశ్రా అండ్ పూరి.. ఇలా ప్రతి సబ్జెక్టుకు మార్కెట్‌లో మెటీరియల్ పరంగా ట్రేడ్ మార్క్ పుస్తకాలు ఉంటాయి. అభ్యర్థులందరూ దాదాపు అవే పుస్తకాలు ఉపయోగించుకుంటారు. కానీ, విజయం లభించేది కొందరికే. కారణం.. మెటీరియల్ చదివేటప్పుడు అనుసరించే ధోరణి, దృక్పథం. అంతేకాకుండా.. పరీక్షలో వచ్చేందుకు అవకాశమున్న ప్రశ్నలను గుర్తించగలిగే విలక్షణ నైపుణ్యం. దీనికోసం చేయాల్సిందల్లా గత మూడు, నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను విశ్లేషించడం. దినపత్రికలు, ఇంటర్నెట్‌ను సమర్థంగా ఉపయోగించుకోవాలి.
చదువుతున్నప్పుడే రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్‌కు ముందు ప్రిపరేషన్ నుంచే డిస్క్రిప్టివ్ అప్రోచ్‌ను అలవరచుకోవాలి. అప్పుడే పరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సరైన సమాధానాలు రాయగలిగే సామర్థ్యం, సమయ పాలన అలవడతాయి. ఇవే విజేతలకు, పరాజితులకు మధ్య ప్రధాన వ్యత్యాసాలు లేదా కారణాలు. అంతేగానీ విజేతలు హైపర్ యాక్టివ్ అనే ఆలోచనను వదులుకోవాలి. సివిల్ సర్వీసెస్‌లో విజయం అంటే ఏళ్లతరబడి చదివితేగానీ సాధ్యం కాదు అనేది కేవలం అపోహ మాత్రమే. అయితే ఒక శాస్త్రీయ పద్ధతిలో కష్టపడి చదివితే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించొచ్చు. స్మితా సబర్వాల్ వంటి వారు ఇందుకు ఉదాహరణ.

ఈ సమస్య.. ఓ అపోహ
చాలా మంది సివిల్స్ ఔత్సాహికుల్లో ఉండే మరో ప్రధాన అపోహ.. పరీక్ష రాసే మాధ్యమం. ఇంగ్లిష్, హిందీ మీడియంలలో పరీక్ష రాస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ప్రాంతీయ మాధ్యమంలో రాయడం వల్ల అవి కొంత తగ్గుతాయని అనుకుంటారు. కానీ, నా అభిప్రాయంలో ఇది కేవలం అపోహ మాత్రమే. మనం ఏ మాధ్యమంలో అటెంప్ట్ ఇచ్చినా.. రాసిన సమాధానంలో ఫ్లేవర్ ఉంటే ఫలితం మనకు ఫేవర్‌గా ఉంటుంది. సమాధాన పత్రాల మూల్యాంకనం పరంగా రేషనలైజేషన్ విషయంలో యూపీఎస్సీ పకడ్బందీగా వ్యవహరిస్తుంది. అందువల్ల మాధ్యమం విషయంలో ఆందోళన అనవసరం.
ప్రాంతీయ మాధ్యమంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎదురవుతున్న సమస్య.. మెటీరియల్. ఇది ఎక్కువగా ఇంగ్లిష్ మీడియంలోనే అందుబాటులో ఉంటోంది. దీంతో దీన్ని అర్థం చేసుకుని తెలుగులోకి అనువదించుకోవడం కొంత సమస్యగా మారింది. అంతేకాకుండా సమయ పాలన సమస్య కూడా కనిపిస్తోంది. అయితే కచ్చితంగా ప్రాంతీయ మాధ్యమంలోనే అటెంప్ట్ ఇవ్వాలనుకున్న అభ్యర్థులు తొలి అటెంప్ట్‌కు ఏడాది ముందుగానే మెటీరియల్ సేకరించుకుని సదరు మాధ్యమంలోకి అనువదించుకుని ప్రిపరేషన్ సాగించాలి. దీనివల్ల తొలి అటెంప్ట్ సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా అనువదించుకునే క్రమంలో సబ్జెక్టు నిపుణులు లేదా సీనియర్ల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ఒకవేళ తొలి అటెంప్ట్‌లో నిరాశాజనక ఫలితం ఎదురైనా ఆందోళన చెందకుండా అదే మాధ్యమంలో ప్రిపరేషన్ సాగించాలి. కచ్చితంగా విజయం లభిస్తుంది. అలా కాకుండా ప్రాంతీయ మాధ్యమంలో రాయడం వల్లే ఓటమి ఎదురైందనే భావనతో ఇంగ్లిష్ మీడియంకు మారితే.. కొత్త సమస్యలు ఎదురవుతాయి.
సివిల్ సర్వీసెస్ ఫలితాల పరంగా ఇటీవల కాలంలో మరో అపోహ.. సివిల్స్‌లో విజయం సాధించిన వారిలో బీటెక్, ఎంబీఏ, లేదా ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థులే అధికంగా ఉంటున్నారు. పరీక్ష శైలి వారికి ఉపయోగపడే విధంగా ఉంటోంది అనేది. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ప్రస్తుత పరీక్ష విధానంలో ఆప్షనల్స్‌కు ప్రాధాన్యం తగ్గింది. జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యం పెరిగింది. దీంతో బీఏ పట్టభద్రులైనా, ఎంబీఏ పట్టభద్రులైనా.. అందరికీ ఒకే విధమైన అంశాలు ఉంటాయి. అయితే సమాధానాలు ఇచ్చే సమయంలో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ అభ్యర్థులకు కలిసొస్తున్న అంశం.. ఒక అంశాన్ని అనలిటికల్ అప్రోచ్‌తో సమాధానం ఇవ్వగలగడం. ఇదే వారికి కొంత అడ్వాంటేజ్‌గా మారుతుండొచ్చు. దీనికి కారణంగా అకడెమిక్‌గా బీటెక్, ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో అనుసరిస్తున్న కరిక్యులంను పేర్కొనొచ్చు.

ఇంటర్వ్యూ.. 
చివరి దశ ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్‌ప్రెటర్ (అనువాదకుడు) సదుపాయాన్ని యూపీఎస్సీ కల్పిస్తోంది. ప్రాంతీయ భాషల్లో ఇంటర్వ్యూకు హాజరవ్వాలనుకున్న అభ్యర్థుల కోసం ఇంటర్‌ప్రెటర్‌‌సను కేటాయిస్తోంది. వీరు బోర్డు సభ్యులు, అభ్యర్థుల మధ్య అనుసంధానకర్తలుగా ఉంటారు. కానీ, దీనివల్ల ఎదురయ్యే సమస్య.. కొన్ని సందర్భాల్లో మన వ్యక్తం చేసిన భావం సరిగా బోర్డు సభ్యులకు చేరకపోవడం. ఈ విషయంలో నా సలహా.. ఇంగ్లిష్‌లో బేసిక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీలైనంత మేరకు ఇంటర్‌ప్రెటర్ అవకాశం లేకుండా నేరుగా సమాధానాలు ఇచ్చేలా సన్నద్ధం కావాలి. అప్పుడే బోర్డు సభ్యులకు, అభ్యర్థులకు మధ్య ఐ కాంటాక్ట్, ఇంటరాక్షన్ విషయాల్లో సరైన సమాచార మార్పిడి జరుగుతుంది.

ఇంటర్వ్యూ సాగిందిలా...

Interview


ఇంటర్వ్యూ విషయానికొస్తే 2018, ఫిబ్రవరి 12 మధ్యాహ్నం సెషన్‌లో జరిగింది. అజిత్ భోస్లే నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు అరగంటసేపు సాగిన ఇంటర్వ్యూలో సభ్యులందరూ ప్రశ్నలు సంధించారు. నాకు ఎదురైన కొన్ని ప్రశ్నలు..
1. చదివింది బీటెక్ కదా.. సివిల్స్‌వైపు ఎందుకు రావాలనుకున్నారు?
. ప్రజలకు సేవ చేయాలనేదే ప్రధాన ఉద్దేశం. అందుకు సరైన మార్గం సివిల్ సర్వీసెస్ అని నిర్ణయించుకున్నాను.

2. బీటెక్ చదివి ఆంత్రోపాలజీని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవడానికి కారణం?
. ఆంత్రోపాలజీ అధ్యయనంతో సమాజంలోని భిన్న సంస్కృతులు, వాటి పూర్వాపరాలు గురించి తెలుసుకునే వీలుంటుంది. ఇది భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ విధుల్లోనూ ఉపయోగపడే వీలుంటుందనే ఉద్దేశంతో ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నాను.

3. ఇప్పటికే ఐఆర్‌ఎస్‌లో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నారు. అయినా మళ్లీ సివిల్స్‌కు హాజరవడానికి కారణం?
. మొదటి నుంచి నా ప్రధాన లక్ష్యం ఐఏఎస్ సాధించడం. రెండో ప్రయత్నంలో ఐఆర్‌ఎస్ రావడంతో ఆ సర్వీసులో చేరాను. కానీ, నా లక్ష్యం నేరుగా ప్రజలకు సేవ చేయగలిగే సర్వీసు పొందడం. దీనికి సరైన మార్గం ఐఏఎస్ అని భావిస్తున్నాను. ఐఏఎస్ విధుల పరంగా.. ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలను నేరుగా ప్రజలకు చేరువయ్యేలా చేసేందుకు అవకాశం ఉంటుంది.

4. స్వచ్ఛ్ భారత్ పథకంపై మీ ఉద్దేశం?
జ. కచ్చితంగా ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే పథకం. దీనివల్ల అనారోగ్య, పారిశుద్ధ్య సమస్యలు తొలగుతాయి. అయితే దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది.

5. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మీ ఉద్దేశం?
. ఇవి కచ్చితంగా ప్రజలకు మేలు చేసే పథకాలే. అయితే వీటిని అమలు చేయడంలో నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా సంక్షేమ పథకాలతోపాటు దీర్ఘకాలికంగా మేలు చేసే సుస్థిరాభివృద్ధి పథకాలు చేపడితే బాగుంటుందనేది నా అభిప్రాయం.

6. మీ హాబీగా 'మెడిటేషన్'ను పేర్కొన్నారు? ఇది మీకు ఎలా ఉపయోగపడింది?
. జీవితంలో నిరాశకు గురైన సందర్భాలు, మానసిక వ్యాకులతకు గురైన పరిస్థితుల్లో వాటి నుంచి బయటపడటానికి మెడిటేషన్ ఎంతో ఉపయోగపడింది. ఇలాంటి సందర్భాల్లో మెడిటేషన్ చేయడం వల్ల చాలా తొందరగా తిరిగి మానసికోల్లాసం లభిస్తుంది.
నాకు స్ఫూర్తి కలిగించిన వ్యక్తులు, ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం విధులు ఇలా.. ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. అన్నిటికి సంతృప్తికరంగా సమాధానాలిచ్చాను అనిపించింది.
ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఐఏఎస్‌కు అవసరమైన ర్యాంకు వస్తుందని అనుకున్నాను. అయితే ఆలిండియా టాపర్‌గా నిలవడం మాటల్లో వర్ణించలేనిది.

సివిల్స్ ఔత్సాహికులకు నా సలహా..
1. మీపై మీరు నమ్మకం పెంచుకోండి.
2. వ్యూహాత్మకంగా అడుగులు వేయండి.
3. ఆప్షనల్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వండి.
4. చదివిన ప్రతి అంశాన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోండి.

దురిశెట్టి అనుదీప్ సివిల్స్ ప్రస్థానం..
2012 తొలి ప్రయత్నం - మెయిన్స్‌లో నిరాశ.
2013 రెండో ప్రయత్నం- ఐఆర్‌ఎస్‌కు ఎంపిక.
2014, 2015 మూడు, నాలుగు ప్రయత్నాలు - మెయిన్స్‌లో పరాజయం.
2017 అయిదో ప్రయత్నం - ఆలిండియా టాప్ ర్యాంకు.

అనుదీప్ గురించి త‌ల్లి జ్యోతి దురిశెట్టి మాట‌ల్లో..
అమ్మకు తేడా తెలీదు. అమ్మ చూపులో చిన్నచూపు పెద్దచూపు ఉండదు. కలిమిలేమి, రాజుపేద, తన పర భేదాలు చూడకుండా అవసరాన్ని మాత్రమే చూడమని చెప్తుంది! అమ్మ ప్రోత్సాహం అనుదీప్ జీవితంలో చాలా విలువైంది. అమ్మ ఇచ్చే సందేశం కూడా అంతే విలువైంది. అనుదీప్తో ఒక స్నేహితురాలిలామెలిగాను అంటున్నారు తల్లి జ్యోతి దురిశెట్టి.

‘‘బాగా గుర్తుంది ఆ రోజు. సివిల్స్‌ ఇంటర్వ్యూ అయిపోగానే నాకు ఫోన్‌ చేశాడు. ‘అమ్మా.. ఈసారి వస్తుంది.. గ్యారెంటీ’ అన్నాడు. అన్నట్టుగానే తెచ్చుకున్నాడు. వాడికెలా ఉందోగానీ నాకైతే సంతోషమే సంతోషం. సివిల్స్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ అనుదీప్‌ అని రిజల్ట్స్‌ రాగానే ఫోన్లే ఫోన్లు. అనుదీప్‌ మదర్‌గా చాలా గొప్ప‌గా ఫీలవుతున్నా. అమ్మగా నేనేం చేయాలో అది చేశాను తప్ప స్పెషల్‌గా ఏం పెంచలేదు. వాడే గోల్‌ సెట్‌ చేసుకున్నాడు. దానికి తగ్గట్టు కష్టపడ్డాడు. ఈ రోజు మీ అందరి అభినంద‌న‌లు, దీవెన‌లు అందుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఉంది.

మా ఊరు.. మా కుటుంబం :
మా సొంతూరు చిట్టాపూర్‌. ఇది జగిత్యాల జిల్లా, మల్లాపూర్‌ మండల్‌ కిందికొస్తది. కానీ మావారి (దిరిశెట్టి మనోహర్‌) ఉద్యోగం మెట్‌పల్లిలో కాబట్టి అక్కడే ఉంటాం. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌. మాకు అనుదీప్‌ కాకుండా ఇంకో అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు అభినయ్‌. బీటెక్‌ అయిపోయింది. తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుంటున్నాడు. ‘అన్నయ్యలాగే నేను కూడా సివిల్స్‌ రాస్తా’ అన్నాడు. వాడిష్టం. పిల్లల మీద మేమెప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. ఫలానా వాళ్ల పిల్లలు డాక్టర్స్‌ అయ్యారు.. ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీర్స్‌ అయ్యారు.. మీరూ అలాగే చదవాలి.. అని వాళ్లనెప్పుడూ ఫోర్స్‌ చేయలేదు. ఏం చదవాలన్నా.. ఏం కావాలన్నా వాళ్లిష్టమే. ఫ్యూచర్‌లో వాళ్లు ఏం కావాలో మేం డిసైడ్‌ చేయలేదు. చదువులో ఇంకే విషయాల్లో వాళ్లకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాం అంతే.

ఎప్పుడు చదువుకుంటావ్‌రా...?
పిల్లలిద్దర్నీ మెట్‌పల్లిలోనే చదివించాం. అనుదీప్‌ మొదట్నించీ క్లాస్‌ ఫస్టే. అట్లాగని 24 గంటలూ పుస్తకాలు పట్టుకుని కూర్చునే టైప్‌ కాదు. క్లాస్‌లో విన్నదే. గ్రాస్పింగ్‌ పవర్‌ ఎక్కువ. హోమ్‌వర్క్స్‌ కూడా స్కూల్లోనే చేసేసుకునేవాడు. ఇంటికొచ్చి స్నాక్స్‌ తిని, పాలు తాగి అలసిపోయేంతగా ఆడుకునేవాడు. ఇంటికొచ్చాక నేను కూడా పిల్లల వెంట పడేదాన్ని కాను చదువుకోమని. ఆడుకోమనే చెప్పేదాన్ని. పిల్లలకు ఫిజికల్‌ యాక్టివిటీ ఉండాలి. మా పిల్లలు ఆటలతోనే షార్ప్‌ అయ్యారని అనుకుంటా. ఫిజికల్‌ యాక్టివిటీ కాన్‌సన్‌ట్రేషన్‌ను పెంచుతుంది కదా. బహుశా అనుదీప్‌ను అంత షార్ప్‌ చేసింది వాడు ఆడిన ఆటలేనేమో. వాడికి ఫుట్‌బాల్‌ అంటే ఇష్టం. పోటీల్లో పాల్గొన్నాడు కూడా. మా ఇంటి పక్కన ఓ టీచర్‌ ఉండేది. ఆవిడ అనుదీప్‌ను చూసి ‘ఒరేయ్‌ ఎప్పుడు చూసినా ఆడుతూనే కనిపిస్తావ్‌... చదువులో మాత్రం ఫస్ట్‌ ర్యాంక్‌ తప్పవ్‌. ఎప్పుడు చదువుకుంటావ్‌రా నువ్వసలు?’ అని అంటుండేది. నిజమే.. ఆవిడ అన్నట్టుగా ఆటలతో అలసిపోయేవాడు చదువులో మాత్రం ఫస్ట్‌ ఎప్పుడూ తప్పలేదు. టెన్త్‌లోనూ స్కూల్‌ టాప్‌. కార్పోరేట్‌ కాలేజ్‌వాళ్లు ఫ్రీగానే ఇంటర్‌లో సీట్‌ ఇచ్చారు. ఫస్టియర్‌లో చాలా బెరుగ్గానే ఉన్నాడు. ‘అమ్మా.. ఇక్కడ అందరూ చాలా ఫ్లుయెంట్‌ ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. నాకేమో అంత ఫ్లుయెన్సీ లేదు. వాళ్ల లెవెల్‌కి రీచ్‌ అవుతానా?’ అని అనేవాడు. ‘ఏంకాదు నాన్నా... నలుగురితో మాట్లాడుతూ కలిసిపోతే భయం పోతుంది. భయంపోతే కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. ఈజీగా మాట్లాడేస్తావ్‌’ అని చెప్పేవాళ్లం. అన్నట్లుగానే త్వరగా ఆ ఫీలింగ్‌నీ ఓవర్‌కమ్‌ చేశాడు. ఎంసెట్‌లో స్టేట్‌ ర్యాంక్‌ తెచ్చుకున్నాడు. ఐఐటీకీ ప్రిపేర్‌ అయ్యాడు. చికెన్‌పాక్స్‌ రావడంతో ఎగ్జామ్‌ సరిగ్గా రాయలేకపోయాడు. ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రూమెంటల్‌) బిట్స్‌ పిలానీలో చేశాడు.

ఒరాకిల్‌లో జాబ్‌ వచ్చినప్పడు మాత్రం...
అనుదీప్‌కి పుస్తకాలు చదవడం అలవాటు. నా క్వాలిఫికేషన్‌ ఇంటర్‌. కాని కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. అలా నా చిన్నప్పుడు చదివిన చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, చిన్నయసూరి నీతికథలు.. అన్నిటినీ రాత్రి పిల్లలకు చెప్పేదాన్ని. అట్లా బుక్‌రీడింగ్‌ మీద అనుదీప్‌కి ఇంట్రెస్ట్‌ పెరిగింది. ఇవ్వాళ సివిల్స్‌ సక్సెస్‌కు అదీ ఒక రీజన్‌ అనుకుంటాన్నేను. ఇంజనీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడే క్యాంపస్‌ సెలక్షన్‌లో ఒరాకిల్‌లో జాబ్‌ వచ్చింది. అప్పుడు మాత్రం అనుకున్నాం.. వీడు ఉద్యోగంలో చేరకుండా సివిల్స్‌కి ప్రిపేర్‌ అయితే బాగుండు అని. అట్లా అనుకున్నామో లేదో తెల్లవారే ఫోన్‌ చేశాడు. ‘అమ్మా.. జాబ్‌లో చేరను. సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతా’ అని. ‘నీ ఇష్టం నాన్నా...’ అన్నాం. ఇంజనీరింగ్‌ ఫోర్త్‌ ఇయర్‌లో ఉన్నప్పుడే ఢిల్లీలో సివిల్స్‌కి కోచింగ్‌ తీసుకున్నాడు. ఫస్ట్‌ ఎటెంప్ట్‌లో రాలేదు. సెకండ్‌ ఎటెంప్ట్‌కి ఐఆర్‌ఎస్‌లో వచ్చింది. మేం హ్యాపీగానే ఉన్నాం. కాని వాడికే శాటిస్‌ఫాక్షన్‌ లేకుండింది. మళ్లీ ప్రిపేర్‌ అయ్యాడు. థర్డ్‌ ఎటెంప్ట్‌లో రాలేదు. పోనీలే నాన్నా.. వదిలెయ్‌ అన్నా వినలేదు. ‘లేదమ్మా.. నా గోల్‌ అది’ అంటూ మళ్లీ ఫోర్త్‌ టైమ్‌ రాశాడు. అప్పుడూ రాలేదు. అయినా ఊరుకోలేదు. అయిదోసారి.. ఇట్లా ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకొని మాకూ సర్‌ప్రైజే ఇచ్చాడు.

సమస్యలు తెలుసు...
వాళ్ల నాన్న ఇంజనీర్‌ కదా. మా ఇంటికెప్పుడూ రైతులు వస్తుండేవారు పొలంలో కరెంట్‌ సమస్యలతోని. వాళ్లు వాళ్ల ప్రాబ్లమ్స్‌ మావారితో చెప్పుకుంటుంటే మావారు వాళ్లకు సలహాలిస్తుంటే అనుదీప్‌ వెళ్లి వాళ్ల నాన్న పక్కన కూర్చుని అన్నీ వినేవాడు. రైతులు వెళ్లిపోయాక తనకొచ్చిన డౌట్స్‌ అన్నీ వాళ్ల నాన్నను అడిగి తెలుసుకునేవాడు. అట్లా చిన్నప్పటినుంచే వాడికి రైతుల ప్రాబ్లమ్స్, ఊళ్లో పరిస్థితుల గురించి తెలుసు. అవన్నీ వాడికిప్పుడు హెల్ప్‌ అవుతాయనే అనుకుంటున్నా. అనుదీప్‌ చాలా సెన్సిటివ్‌. పెద్దవాళ్ల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. ఆడవాళ్లంటే కూడా చాలా రెస్పెక్ట్‌. ఎవరినీ నొప్పించడు. అయినా వాడి నుంచి నేను కోరుకునేది ఒకటే. వాడి లైఫ్‌ ఇప్పుడు స్టార్ట్‌ అయింది. ఫ్యూచర్‌లో ఇంకా మంచి పొజిషన్‌కు వెళ్లొచ్చు. ఎప్పుడు ఎక్కడ.. ఏ పొజిషన్‌లో ఉన్నా అందరినీ రెస్పెక్ట్‌ చేయాలి. ప్రాబ్లమ్స్‌తో తన దగ్గరకు వచ్చిన వాళ్ల పట్ల భేదభావం చూపొద్దు. డబ్బున్నవాళ్లపట్ల, లేని వాళ్ల పట్ల ఎలాంటి తారతమ్యాలు చూపొద్దు అని. ఇదే మాట చెప్తాను వాడికెప్పుడూ. నా పిల్లల మీద నాకు చాలా నమ్మకం. తోటివాళ్లకు సహాయపడేలా ఉంటారని.

తొలి జీతంతో..
అనుదీప్‌ ఫోర్త్‌టైమ్‌ సివిల్స్‌ రాశాక మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేశాడు. నాకు, వాళ్ల నాన్నకు ఢిల్లీకి టికెట్స్‌ బుక్‌ చేశాడు. ఫోన్లో ఆ విషయం చెప్పేవరకు మాకు తెలీదు. ‘అమ్మా.. నీ కోసమే ప్లాన్‌చేశా ఇది. నువ్వెప్పుడూ ఇల్లూ పని అంటూ కదలనే కదలవు. అందుకే ఈ సర్‌ప్రైజ్‌’ అని చెప్పాడు. ఆగ్రా తీసుకెళ్లాడు. తాజ్‌మహల్‌ చూపించాడు. నిజానికి దానికన్నా కూడా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ వాడు ఐఏఎస్‌ కావడం. వాడి కలను నెరవేర్చుకోవడం. ఇందులో నేను వాడికి చేసిన హెల్ప్‌ ఏమీ లేదు. అమ్మలా కాకుండా ఓ ఫ్రెండ్‌లా ఉన్నా. అన్నీ షేర్‌ చేసుకుంటాడు. అనుదీప్‌లో నాకు బాగా నచ్చేది ఈగో లేకపోవడం. వాడు మంచి పెయింటర్‌ కూడా. ఐఆర్‌ఎస్‌గా జాయిన్‌ అయ్యాక వచ్చిన ఫస్ట్‌ శాలరీతో నాకు పట్టుచీర కొన్నాడు. సెల్‌ ఫోన్‌ కొనిచ్చాడు. ఇప్పుడు మేమెక్కడ కనపడినా అనుదీప్‌ వాళ్ల మదర్‌ కదా.. అని నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు చాలామంది. మదర్‌గా ఇంతకన్నా ప్రైడ్‌ ఏముంటుంది నాకు?

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Published date : 10 Dec 2021 05:59PM

Photo Stories