Skip to main content

Inspiring Mother and Son: తల్లి పడ్డ కష్టం బిడ్డ అందుకు గెలుపు.. ఇదే వారి ప్రయాణం..!

ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నప్పటికి చిన్న వయసులోనే పెళ్ళి జరగడం.. అన్ని అర్థం అయ్యే వయసులో సంతానం కలిగి సంతోషంగా ఉండాల్సిన సమయంలో భర్త మరణం. ఇటువంటి ఒక జీవితం ప్రతీ ఆడపిల్లకు నరకమే. పిల్లలకు మంచి జీవితాన్ని అందజేయాలనే ఆశయం ముందు ఆ తల్లికి ఏదీ కనిపించలేదు. పిల్లల కోసం కష్టాలన్నింటినీ ఎదురుకొని నిలబడింది. అలాగే ముందుకు సాగింది. ప్రస్తుతం తన పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా.. ఈ కింది కథనం చదవండి.
Inspiring struggle and success of mother and children   A family's journey from struggle to success

విస్తారు బాయిది మారుమూల గిరిజన గ్రామం. కూలీనాలీ చేసుకుని బతికే మల్లయ్య నానాబాయిల ఐదుగురు సంతానంలో ఆమె ఒకరు. ఇల్లు గడవాలంటే.... ఇంటిల్లిపాదీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి కావడంతో అక్షరం ముక్క నేర్వలేదు. పదహారేళ్లు నిండకుండానే ఆమెకు తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి మనోహర్‌తో పెళ్లి చేశారు. ఐదేళ్లలో ముగ్గురు పిల్లలకు తల్లయ్యింది. వారిని పెద్ద చదువులు చదివిద్దామంటూ భర్త దగ్గర నుంచి మాట తీసుకుంది. కానీ, జీవితం ఎప్పుడూ ఊహించినట్లుగా ఉండదు కదా! ఆపై కొద్దిరోజులకే భర్త అనారోగ్యంతో మరణించాడు.

ఒంటరి కష్టం

‘మావారు చనిపోయే నాటికి నా వయసు 21 ఏళ్లు. బిడ్డల్ని ఎలా సాకాలో తెలియక నిద్రలేని రాత్రుళ్లెన్నో గడిపాను. నిలువ నీడ కూడా లేకపోవడంతో అన్నయ్య సాయంతో ఓ చిన్న గుడిసె వేసుకున్నా. ఇళ్లల్లో పాచిపనులు చేసి పిల్లల కడుపు నింపేదాన్ని. తినీ తినకా రూపాయి రూపాయి పొదుపు చేసి మహిళా సంఘంలో చేరాను. అప్పుడే స్థానిక పాఠశాలలో వంట చేసే అవకాశమూ దక్కింది. నెలకు రూ.1000 ఇచ్చి అన్నం పెడతామన్న మాట విని నా ప్రాణం లేచొచ్చింది’ అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది.

అన్నం తిననివ్వలేదు...  

ఈ ప్రయాణంలో ఒంటరి మహిళగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. వితంతువంటూ కొందరు హేళన చేసేవారు. తక్కువ కులమని ఆమె చేసిన వంటను తిననిచ్చేవారు కాదు ఇంకొందరు. వాటన్నింటినీ దిగమింగుకుని ఆ మాతృమూర్తి తన బిడ్డలకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలని భావించింది. అందుకు చదువే దారి చూపిస్తుందని నమ్మింది. తాను పడ్డకష్టాలేవీ పిల్లలకు తెలియనివ్వలేదు. వారి చదువులకు ఆటంకం కలగనివ్వలేదు. పిల్లలు అమ్మ కన్నీటి కష్టాలు తీర్చడానికి  రాత్రీ పగలూ జాగారం చేసి మరీ పుస్తకాలతో కుస్తీపట్టారు. ముగ్గురూ ఉన్నత స్థాయిలో నిలబడ్డారు.

దాతల సాయంతో...

పెద్ద కొడుకు రేవయ్య మద్రాసు ఐఐటీకి ఎంపికైనప్పుడు.. దాతలు స్పందించడంతో చదువు పూర్తయ్యింది. కూతురు స్వప్న నాగ్‌పుర్‌ ఐఐటీకి ఎంపికైనప్పుడూ దాతలే సహాయ పడ్డారు. ప్రస్తుతం స్వప్న అక్కడే కెమికల్‌ ఇంజినీరింగ్‌ చివరి ఏడాది చదువుతోంది. మరో కొడుకు తిర్యాణిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. చదువయ్యాక రేవయ్య ఓఎన్‌జీసీలో నెలకు రూ.2 లక్షల వేతనంతో ఉద్యోగం అందుకున్నాడు.

ఐఏఎస్‌ ప్రయాణం

ఐదేళ్లు చేశాక... తనలాంటి మరెందరికో చేయూతనివ్వాలనే లక్ష్యంఏర్పడింది. అలా, తన దారిని సివిల్స్‌కి మలుపుకున్నాడు. తన పట్టుదల కృషితో సివిల్స్‌కు సన్నద్ధమయ్యాడు. ఈ దారిలోనే నడవాలని ఎంచుకున్నాడు. ఎన్ని ఇబ్బందులోచ్చినా సరే ప్రయత్నానికి ముగింపు పలకోద్దని నిర్ణయించుకున్నాడు. తను ఎంతో ఆశతో చేసిన మొదటి ప్రయత్నం అనుకున్న గమ్యాన్ని చేర్చలేదు. తన తల్లి ఇచ్చిన స్పూర్తితో, తనకు ఉన్న విశ్వాసంతో ఎన్ని ఎదురుకున్నా ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదని తీర్మానించుకున‍్నాడు. అలా, మళ్ళీ రెండో ప్రయత్నంలోకి ప్రయాణాన్ని సాగించాడు. మొదటి ప్రయత్నంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దుకొని రెండో ప్రయత్నం చేయాలని మరింత కష్టపడ్డాడు. ఈ ప్రయత్నంలో తన కష్టానికి తగిన ఫలితం దక్కింది. రెండో ‍ప్రయత్నంలో 410 ర్యాంకుతో తక్కించుకొని, ఐఏఎస్‌ సాధించాడు. అమ్మ బతుకుపోరుకి విలువ కల్పించాడు.

- చొక్కాల రమేశ్‌, ఆసిఫాబాద్‌,

జగడం సత్యనారాయణ, రెబ్బెన

Published date : 20 Dec 2023 08:03AM

Photo Stories