Skip to main content

Practicals : ఇంటి నుంచే ‘ప్రాక్టికల్స్‌’..వీళ్ల‌కు మాత్ర‌మే..

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా పాఠశాలలను చాలాకాలంగా మూసి ఉంచినందున విద్యా సంవత్సరపు పని దినాలను తగ్గించి పాఠ్యప్రణాళికలో మార్పులు చేసిన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) అందుకు అనుగుణంగా ల్యాబ్‌ ప్రయోగాల (ప్రాక్టికల్స్‌)లోనూ మార్పులు చేసింది.
CBSE
CBSE

9, 10 తరగతుల విద్యార్థులకు అనుకున్న మేర ప్రయోగాల ప్రక్రియను ల్యాబ్‌లలో నిర్వహించే పరిస్థితులు లేనందున ఇంటినుంచే అందుబాటులో ఉన్న వనరులతో ప్రయోగాలు చేపట్టేలా ప్రత్యామ్నాయాలను నిర్దేశించింది. ఇందుకు సంబంధించి సీబీఎస్‌ఈ తాజాగా విధివిధానాలను ప్రకటించింది.

ఈ రూపంలో విద్యార్థులకు..
ఉపాధ్యాయుల ముఖాముఖి సూచనలతో నిర్వహించే ల్యాబ్‌ ప్రయోగాలకు బదులు వారి మార్గనిర్దేశంలో ఇంటి నుంచే విద్యార్థులు తమ ప్రాక్టికల్‌ వర్కులు, ప్రాజెక్టు వర్కులు పూర్తిచేయవచ్చని సూచించింది. ఈ ప్రయోగాల ద్వారా అభ్యాస ఫలితాలు ఒకే విధంగా ఉండేలా ఆయా అంశాలను రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాక్‌డౌన్‌ కారణంగా ల్యాబ్‌ ప్రయోగాలు నిర్వహించలేని పరిస్థితుల్లో సీబీఎస్‌ఈ అన్ని పాఠశాలల్లోని 9 నుంచి 12 తరగతుల విద్యార్థులతో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ‘ఓల్యాబ్‌స్టో’ ద్వారా సీబీఎస్‌ఈ కరిక్యులమ్‌ను, ప్రయోగాల ప్రక్రియలను వర్చువల్‌ రూపంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. తాజాగా వీటితోపాటు జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) మాన్యువల్‌ నుంచి మరికొన్ని ఇతర ప్రయోగ కార్యకలాపాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది.

అందుబాటులో ఉండే వనరులతోనే...
విద్యార్థులు తమ ఇంటివద్ద అందుబాటులో ఉండే వనరులతోనే ఈ ప్రయోగాలు చేపట్టేలా ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన ప్రక్రియలను విద్యార్థులతో అనుసరింప చేయాలని సీబీఎస్‌ఈ ఆయా పాఠశాలలకు సూచనలు చేసింది. ఈ కంటెంట్‌ దీక్షా పోర్టల్‌ ద్వారా కూడా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. విద్యార్థులకు ఇబ్బంది రాకుండా రక్షిత పద్ధతుల్లో ఇంటివద్దే ప్రయోగాలు చేసేలా ఆయా మెటీరియల్‌ను సూచించాలని టీచర్లకు నిర్దేశించింది. విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంలో పాఠ్యబోధన ఎంత ముఖ్యమో.. ప్రాక్టికల్స్‌ కూడా అంతకంటే ముఖ్యమైనవని పేర్కొంటున్న సీబీఎస్‌ఈ వీటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. సీబీఎస్‌ఈలో ప్లస్‌ 2లోనే ప్రయోగాలు చేపట్టించేలా కాకుండా 9వ తరగతి నుంచే విద్యార్థులకు వాటిని అమలు చేయిస్తోంది.

Published date : 08 Nov 2021 02:49PM

Photo Stories