Skip to main content

యూపీఎస్సీ-2020ఉద్యోగాల సమగ్ర సమాచారం...

యూపీఎస్సీ.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ నుంచి సీడీఎస్‌ఈ పోస్టుల వరకూ... ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాల నుంచి ఇండియన్ ఎకనామిక్ సర్వీసు కొలువుల దాకా... కేంద్ర ప్రభుత్వంలోని వివిధ కీలక పోస్టులను భర్తీ చేస్తుంది.
ఇందుకోసం ఏటా నియమిత సమయంలో ఆయా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసి.. ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. పోస్టుల భర్తీకి వివిధ దశల్లో రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి.. విజేతలను ప్రకటిస్తుంది. యూపీఎస్సీ 2020 క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో..ఈ ఏడాది విడుదల చేయనున్న నోటిఫికేషన్‌లు.. అర్హతలు.. ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం...

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2020 :
పోస్టులు: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా 24 కేంద్ర సర్వీసులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ
నోటిఫికేషన్ వెల్లడి: ఫిబ్రవరి 12, 2020
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 3, 2020
{పిలిమ్స్ పరీక్ష తేదీ: మే 31, 2020

ప్రిలిమ్స్ పరీక్ష స్వరూపం :
పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్-1 జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలు- 200 మార్కులకు; అలాగే పేపర్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్80 ప్రశ్నలు- 200 మార్కులకు పరీక్షలు జరుగుతాయి.
- ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండు గంటలు.

తొలిదశ.. ప్రిలిమ్స్ :
మూడు దశల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష. ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తారు. పోస్ట్‌ల సంఖ్య తక్కువయ్యే కొద్దీ మెయిన్‌కు పోటీ మరింత తీవ్రం అవుతుంది.
  • సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ తరహా పేపర్లు.. జనరల్ స్టడీస్-1, జనరల్ స్టడీస్-2(సీశాట్) ఉంటాయి. అభ్యర్థులు రెండు పేపర్లకు భిన్నమైన ప్రిపరేషన్ వ్యూహాలు అనుసరించాలి. జనరల్ స్టడీస్-1లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. రెండో పేపర్ సీశాట్‌లో... రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి.
  • పేపర్-1లో జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం; భారత, ప్రపంచ భౌగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్(రాజ్యాంగం,రాజకీయ వ్యవస్థ, పంచాయితీ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ తదితర); ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్(సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, పావర్టీ, ఇన్‌క్లూజన్, డెమోగ్రాఫిక్ డివిడెండ్, సోషల్ సెక్టార్ ఇనీషియేటివ్స్ తదితర); పర్యావరణ సమస్యలు; జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు; జనరల్ సైన్స్.
  • పేపర్-2(ఆప్టిట్యూడ్ టెస్ట్-సీశాట్): కాంప్రహెన్షన్; ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఇన్‌క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ; డేటా ఇంటర్‌ప్రిటేషన్.
రెండోదశ... మెయిన్ పరీక్ష:
 సివిల్స్ ఎంపిక ప్రక్రియలో ఎంతో నిర్ణయాత్మకమైంది.. రెండో దశ మెయిన్. ఇందులో ఇంగ్లిష్, స్థానిక భాష పేపర్(తెలుగు)లతోపాటు ఒక ఎస్సే, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, ఒక ఆఫ్షనల్ సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లు ఉంటాయి. ఎస్సే పేపర్, జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్టు పేపర్లు.. ఒక్కోటి 250 మార్కులకు చొప్పున మొత్తం 1750 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్, స్థానిక భాష(తెలుగు) పేపర్లు అర్హత పరీక్షలు మాత్రమే. మెయిన్ పరీక్షలు డిస్క్రిప్టివ్ తరహాలో జరుగుతాయి.
 
 మూడో దశ.. ఇంటర్వ్యూ :
 మెయిన్‌లో ప్రతిభ చూపిన వారిని పర్సనాలిటీ టెస్టులకు ఎంపిక చేస్తారు. భర్తీ చేయనున్న పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూకు 275 మార్కులు కేటాయించారు. మెయిన్ రాత పరీక్ష మార్కులతోపాటు ఇంటర్వ్యూలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా తుది విజేతలను ప్రకటిస్తారు.
 
 ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ (ఈఎస్‌ఈ) : 
 ఇది కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ కొలువులు ఆశించే అభ్యర్థులకు అవకాశం కల్పించే పరీక్ష. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తారు. బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిద్వారా ఇండియన్ డిఫెన్స్ సర్వీస్, ఇండియన్ రేడియో రెగ్యులేటరీ సర్వీస్, ఇండియన్ రైల్వే, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్, మిలిటరీ ఇంజనీరింగ్, సెంట్రల్ వాటర్, సెంట్రల్ ఇంజనీరింగ్, నేవల్, సెంట్రల్ పవర్, టెలికాం, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్, స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తదితర విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వీరికి ఏడో పే కమిషన్ ప్రకారం రూ.70వేల నుంచి రూ.75వేల వరకు ప్రారంభ వేతనం అందుతుంది.
 ఎంపిక :
 మూడంచెల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇందులో ప్రిలిమ్స్-500 మార్కులకు, మెయిన్-600 మార్కులకు, పర్సనాలిటీ టెస్ట్-200 మార్కులకు.. మొత్తం 1300 మార్కులకు పరీక్షలు జరుగుతాయి. ఈఎస్‌ఈ ప్రిలిమినరీని మెయిన్‌కు అర్హత పరీక్షగానే కాకుండా.. తుదిదశ ఎంపికలోనూ ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
 {పిలిమినరీ దశ:
 ఈ పరీక్షను మొత్తం 500 మార్కులకు, రెండు పేపర్లు (పేపర్-1, 2)గా నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టుల నుంచి 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు. మొత్తం 300 మార్కులకు జరిగే పేపర్-2లో సంబంధిత ఇంజనీరింగ్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు. పరీక్ష హాల్లోకి కాలిక్యులేటర్ అనుమతించరు. రుణాత్మక మార్కులుంటాయి.
 మెయిన్ పరీక్ష:
 ప్రిలిమ్స్ మార్కుల ఆధారంగా 1:7 లేదా 1:8 నిష్పత్తిలో అర్హులను ఎంపిక చేసి మెయిన్‌కు అనుమతిస్తారు. మొత్తం 600 మార్కులకు జరిగే మెయిన్ పరీక్ష కూడా రెండు పేపర్లు (పేపర్-1, 2)గా ఉంటుంది. రెండు పేపర్లలో పూర్తిగా సంబంధిత ఇంజనీరింగ్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్) సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపర్‌కు మూడు గంటలు.
 పర్సనాలిటీ టెస్ట్:
 200 మార్కులకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో ముఖాముఖి పరీక్షకు అనుమతిస్తారు. ఇక్కడ అభ్యర్థుల ఆలోచనా విధానం, శక్తి సామర్థ్యాలు, నిజాయతీని అంచనా వేస్తారు. హాబీలు, సామాజిక, వర్తమాన అంశాలు, ఎంటెక్ లేదా ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులకైతే సంబంధిత విభాగం నుంచి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
 
 అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ/ఎంఎస్సీ ఉత్తీర్ణత.
 వయసు: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
 దర ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తు ఫీజు: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఉచితం)
 మెయిన్ పరీక్ష తేదీ: జూన్ 28, 2020
 
 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) :
 

 ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత ఆ స్థాయి హోదా, గౌరవం ఐఎఫ్‌ఎస్ ద్వారా లభిస్తాయి. ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్‌కి జిల్లా స్థాయిలో తన విభాగానికి సంబంధించి న్యాయ, పాలన, ఆర్థిక పరమైన అంశాల్లో దాదాపు స్వయం ప్రతిపత్తి అధికారాలుంటాయి. అటవీ శాఖలోని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్‌వో), కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్), ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) పోస్టులను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
 ఎంపిక విధానం :
  - మూడు దశల్లో (ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ) ఎంపిక ఉంటుంది.
 1. ప్రిలిమ్స్:
 ఐఎఫ్‌ఎస్ ఎంపికలో భాగంగా మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు(పేపర్-1, 2) ఉంటాయి. 400 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల కోత విధిస్తారు. పేపర్-1,2ల్లో కనీస నిర్దేశిత కటాఫ్ సాధించిన అభ్యర్థులు మాత్రమే మెయిన్ రాసేందుకు అర్హులు. తుది ఎంపికలో ప్రిలిమ్స్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
 2. మెయిన్:
 ఇందులో ఆరు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ ఇంగ్ల్లిష్-300 మార్కులు, పేపర్-2 జనరల్ నాలెడ్జ్-300 మార్కులు, మిగతా 3,4,5,6 పేపర్లు ఆప్షనల్ సబ్జెక్టు (అగ్రికల్చర్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్/బోటనీ/కెమిస్ట్రీ/కెమికల్ ఇంజనీరింగ్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్/జువాలజీ) లకు సంబంధించిన పేపర్లు. ప్రతి సబ్జెక్టు నుంచి రెండు పేపర్లుంటాయి. ఆప్షనల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్‌ను 200 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ వ్యాస రూప విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం ఒక్కో పేపర్‌కు రెండు గంటలు.
 3. పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ:
 ఇది 300 మార్కులకు ఉంటుంది. ఇందులో సబ్జెక్టుకు సంబంధించిన అంశాలతోపాటు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, సమకాలీన అంశాలు, నూతన ఆవిష్కరణలు, సొంత రాష్ట్రం, దేశం గురించి అభ్యర్థుల అవగాహనను పరిశీలిస్తారు. అలాగే స్థితప్రజ్ఞత, క్రిటికల్ థింకింగ్, సమయస్ఫూర్తి, సందర్భానుసార నిర్ణయాలు, మానసిక, శారీరక సామర్థ్యాలు, భౌగోళిక అవగాహన, తాజా పరిణామాలపై ఆసక్తి తదితర అంశాలను పరీక్షిస్తారు. అనంతరం మెయిన్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా, అభ్యర్థుల రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని తుది ఎంపిక చేస్తారు.
 
 అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్/బోటనీ/కెమిస్ట్రీ/జియాలజీ/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్/జువాలజీ/అగ్రికల్చర్/ఫారెస్ట్రీ/ఇంజనీరింగ్)ఉత్తీర్ణత.
 వయసు: 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.
 దర ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
 దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 12, 2020
 దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 3, 2020
 {పిలిమినరీ పరీక్ష తేదీ: మే 31, 2020
 మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 1, 2020.
 
 జియాలజిస్ట్ :
 జియోసైంటిస్ట్-జియాలజిస్ట్ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి గ్రూప్-ఏ హోదాతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ), మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. క్షేత్రస్థాయిలో, ప్రయోగశాలల్లో టెక్నీషియన్ల విధులను పర్యవేక్షించడం, ఇతర శాస్త్రవేత్తలతో పనిని సమన్వయపరచడం, క్షేత్ర అధ్యయనాల ప్రణాళిక రూపకల్పన, అమలు వీరి ప్రధాన విధులు. నేలల చరిత్ర, పదార్థాలూ, ప్రక్రియలను అధ్యయనం చేస్తారు. శిలల ఉద్భావన, మార్పులు తదితర అంశాలను పరిశీలిస్తారు.
 ఎంపిక విధానం :
 - కంబైన్డ్ జియో సైంటిస్ట్ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తారు. స్టేజ్-1 ప్రిలిమినరీ, స్టేజ్-2 మెయిన్, స్టేజ్-3 ఇంటర్వ్యూ ఉంటుంది.
 స్టేజ్-1: ప్రిలిమినరీ(స్టేజ్-1) పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లుంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 400 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ 100 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. పేపర్-2 దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మారుతుంది. ఆయా సబ్జెక్టుల్లో 300 మార్కులకు ఉంటుంది. పేపర్-1, పేపర్-2 ఒక్కో పరీక్ష వ్యవధి 2 గంటలు.
 స్టేజ్-2: మెయిన్ ప్రశ్నపత్రం డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్‌లో అడుగుతారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న విభాగం నుంచి మూడు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్ 200 మార్కుల చొప్పున 600 మార్కులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్ పరీక్ష సమయం 3 గంటలు.
 స్టేజ్-3: చివరి దశ ఇంటర్వ్యూ. దీనికి 200 మార్కులు కేటాయించారు. నాయకత్వ లక్షణాలతో పాటు సబ్జెక్టు అవగాహనను అంచనా వేసి మార్కులు కేటాయిస్తారు.
 
 అర్హత: జియాలజీ లేదా అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. చివరి సంవత్సరం విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
 వయసు: పోస్టులను బట్టి 32-35 ఏళ్ల మధ్య ఉండాలి.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
 దరఖాస్తు ఫీజు: రూ.200
 మెయిన్ పరీక్ష: 27.06.2020
 వెబ్‌సైట్: www.upsc.gov.in
 
 సీఎంఎస్‌ఈ:
 కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థల్లో వైద్య విభాగాల్లో పనిచేయడానికి వీలు కల్పించేదే సీఎంఎస్‌ఈ(కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్). యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్ష ద్వారా మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగావకాశం పొందవచ్చు.
 ఎంపిక విధానం:
 ఈ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. అవి సీబీటీ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), పర్సనాలిటీ టెస్ట్‌లు. మొదటి దశలో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ మెడిసిన్ నుంచి 96 ప్రశ్నలు, పీడియాట్రిక్స్ నుంచి 24 ప్రశ్నల చొప్పున మొత్తం 120 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 250. పరీక్ష సమయం రెండు గంటలు. పేపర్-2లో కూడా సర్జరీ నుంచి 40 ప్రశ్నలు, గైనకాలజీ అండ్ అబ్‌స్ట్రటిక్స్-40 ప్రశ్నలు, ప్రివెన్‌టివ్ అండ్ సోషల్ మెడిసిన్ నుంచి 40 ప్రశ్నలు చొప్పున మొత్తం 120 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 250. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. రుణాత్మక మార్కులుంటాయి.
 
 పర్సనాలిటీ టెస్ట్: సీబీటీలో అర్హత సాధించిన అభ్యర్థులకు 100 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. ఇందులో అకడమిక్, సామాజిక, సమకాలీన అంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తారు. సీబీటీ, పర్సనాలిటీ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, ఖాళీలు, కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
 
 అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం విద్యార్థులు అర్హులే.
 వయసు: 32 ఏళ్లకు మించకూడదు.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తు ఫీజు: రూ.200
 దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 8, 2020
 దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 28, 2020
 పరీక్ష తేదీ: జులై 19, 2020
 
 ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ:

 {తివిధ దళాల్లో కెరీర్ కోరుకునే యువతకు ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ చక్కటి వేదిక. ఇంటర్ విద్యార్హతతో ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ఇందులో అర్హత సాధించిన వారు శిక్షణ పొందుతూ.. బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులు చదువుకోవచ్చు. అనంతరం సంబంధిత విభాగంలో ప్రత్యేక శిక్షణ పొంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో ఆఫీసర్ హోదాతో ఉద్యోగంలో చేరొచ్చు. రెండేళ్ల సర్వీసుతోనే పదోన్నతి లభిస్తుంది. ఈ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది.
 ఎంపిక విధానం:
 - ఈ పరీక్ష ప్రశ్నపత్రం మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లుంటాయి. పేపర్-1లో మ్యాథ్స్ నుంచి 300 మార్కులకు ప్రశ్నలొస్తాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. పేపర్-2లో 600 మార్కులకు జనరల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలుంటాయి. వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో ఇంగ్లిష్‌కు 200 మార్కులు, జనరల్ నాలెడ్జ్‌కి 400 మార్కులు కేటాయించారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. దీనికి 900 మార్కులు కేటాయించారు. తొలిరోజు ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్), పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్(పీపీ అండ్ డీటీ) నిర్వహిస్తారు. ఇందులో అర్హులకు మిగిలిన నాలుగు రోజులు ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్, ఆఫీసర్ టాస్కులు, సైకాలజీ టెస్టులుంటాయి. రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుదిఎంపిక జరుగుతుంది.
 శిక్షణ: తుది ఎంపికలో అర్హత సాధించిన వారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ-పుణేలో చదువు, శిక్షణ ఇస్తారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి, నేవల్ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఏడాది నుంచి 18 నెలల వరకు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టయిపెండ్ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు.
 
 అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు ఏదైనా గ్రూపుతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్స్(ఎన్డీఏ), 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్(ఇండియన్ నేవల్ అకాడమీ)కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారూ అర్హులే. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
 పరీక్ష తేదీ: ఏప్రిల్ 19, 2020
 
 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ :
 {తివిధ దళాల్లో ఉద్యోగం, దేశ రక్షణలో భాగస్వామ్యం.. తలచుకుంటేనే ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆకర్షణీయమైన వేతనం, మంచి జీవనశైలి, ఉన్నతస్థాయి సీడీఎస్‌ఈ ద్వారా సొంతమవుతాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ టెస్టుల్లో సత్తా చాటితే.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో కొలువు ఖాయం అవుతుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారు లెఫ్టినెంట్(ఆర్మీ), సబ్ లెఫ్టినెంట్(నేవీ), ఫ్లయింగ్ ఆఫీసర్ (ఎయిర్‌ఫోర్స్) హోదాతో కెరీర్ ప్రారంభిస్తారు. యూపీఎస్సీ ప్రతిఏటా రెండుసార్లు సీడీఎస్ పరీక్ష నిర్వహిస్తుంది.
 
 ఎంపిక విధానం :
 రెండంచెల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. స్టేజ్-1 రాతపరీక్ష, స్టేజ్-2 ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ, మెడికల్ టెస్టులు ఉంటాయి. స్టేజ్-1 రాతపరీక్షలో.. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌పై ప్రశ్నలుంటాయి. ఒక్కో పేపర్ వంద మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి విభాగాన్ని రెండు గంటల్లో పూర్తి చేయాలి. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకున్న వారికి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పేపర్ నుంచి మినహాయిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. నెగిటివ్ మార్కులుంటాయి.
 స్టేజ్-2: ఇది ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. స్టేజ్-1 ఉత్తీర్ణులకు ఈ టెస్ట్ ఉంటుంది. వీటిని సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. ఇవి అయిదు రోజులు కొనసాగుతాయి. తొలిరోజు ప్రతిభ చూపిన వారికి మిగిలిన నాలుగు రోజులు వీటిని కొనసాగిస్తారు. ఎంపికైన వారికి మెడికల్ టెస్టులుంటాయి. అందులో కూడా విజయం సాధించిన వారిని శిక్షణలోకి తీసుకుంటారు. పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి అదనంగా కంప్యూటర్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ (సీపీఎస్‌ఎస్) లేదా పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్(పీఏబీటీ) నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 300 మార్కులు కేటాయించారు. ఓటీఏ పోస్టులకైతే 200 మార్కులు.
 
 అర్హత: ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ) పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ; నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ పోస్టులకు ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(షార్ట్ సర్వీస్ కమిషన్) పోస్టులకు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 వయసు: 20-24 ఏళ్ల మధ్య ఉండాలి.
 దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
 సీడీఎస్‌ఈ-1 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2, 2020.
 సీడీఎస్‌ఈ-2 దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 5, 2020
 సీడీఎస్‌ఈ-2 దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 25, 2020
 సీడీఎస్‌ఈ-2 పరీక్ష తేదీ: నవంబర్ 8, 2020
Published date : 07 Feb 2020 03:23PM

Photo Stories