Skip to main content

సివిల్స్ మెయిన్స్-2018 సక్సెస్ ప్లాన్...!

ఐఏఎస్, ఐపీఎస్ సహా మొత్తం 24 కేంద్ర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తోంది. మూడు దశల ఎంపిక ప్రక్రియలో తొలిదశ ప్రిలిమ్స్ కాగా.. రెండోదశ మెయిన్ ఎగ్జామినేషన్! సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2018కు సంబంధించి మెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 28న ప్రారంభం కానున్నాయి!
ప్రిలిమ్స్‌లో లక్షల మందితో పోటీలో నెగ్గి జాబితాలో నిలిచిన అభ్యర్థులు... అంతిమ విజయంలో నిర్ణయాత్మకమైన మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షకు ముందు అందుబాటులో ఉన్న ఈ విలువైన సమయంలో విజయానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలో తెలుసుకుందాం...

మొత్తం పోస్టులు: 782
ప్రిలిమ్స్‌కు హాజరైన వారి సంఖ్య: దాదాపు 4.5 లక్షలు.
ప్రిలిమ్స్‌లో విజయం సాధించి మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థులు: 10,468
అంటే.. ఒక్కో పోస్టుకు 13 మంది అభ్యర్థుల పోటీపడుతున్న పరిస్థితి. పరీక్షకు ఇంకా అందుబాటులో ఉన్న సమయం.. 25 రోజులు. ఈ విలువైన సమయాన్ని ఎవరైతే సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో వారే విజేతలన్నది నిపుణుల మాట.

కొత్త అంశాలు వద్దు...
  • మూడంచెల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో కీలకమైన రెండోదశ.. మెయిన్స్. ఇందులో ర్యాంకింగ్‌కు పరిగణనలోకి తీసుకునే ఏడు పేపర్లలో ఒక్కో పేపర్‌కు 250 మార్కులు చొప్పున మొత్తం 1750 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు పరీక్ష వ్యవధి మూడు గంటలు. పర్సనాలిటీ టెస్ట్‌కు కేటాయించిన 275 మార్కులను కలుపుకొని మొత్తం 2025 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా విజేతలను ప్రకటిస్తారు. ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ పరీక్షలు అర్హత పేపర్లు మాత్రమే.
  • పర్సనాలిటీ టెస్ట్‌లో మంచి స్కోర్ సాధించడమనేది ఒక్కోసారి అభ్యర్థి పరిధిలో ఉండదు. కాని మెయిన్స్‌లో మార్కుల సాధన పూర్తిగా అభ్యర్థి చేతిలోనే ఉంటుంది. ఇందులో మంచి మార్కులు సాధించిన వారే టాప్ ర్యాంకుల్లో నిలుస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి టాప్ సర్వీసులు సొంతం చేసుకుంటున్నారు. దీన్నిబట్టే మెయిన్ పరీక్షలు సివిల్ సర్వీసెస్ విజయంలో ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.
  • మరి కొద్ది రోజుల్లోనే మెయిన్స్ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా ప్రిపరేషన్ సాగించాలి. మెయిన్ పరీక్ష కోణంలో ఏది అవసరమో దానిపైనే పూర్తిగా దృష్టిపెట్టాలి. కొంతమంది అభ్యర్థులు.. ఇప్పటివరకు చదవని అంశాలను ఇప్పుడు ప్రిపేర్ అవుదామని ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, మానసికంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాకాకుండా ఇప్పటికే చదివిన అంశాలపై మరింత పట్టు సాధించేలా రివిజన్ సాగించడం మేలు చేస్తుంది.
పునశ్చరణే విజయసాధనం :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు పునశ్చరణ (రివిజన్)కే అధిక ప్రాధాన్యమివ్వాలి. ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తయిన సిలబస్ అంశాలను ఈ సమయంలో కనీసం మూడుసార్లు రివిజన్ చేసుకోవాలి. దీనికి అనుగుణంగా పటిష్ట ప్రణాళిక రూపొందించుకో వాలి. ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకొనే మొత్తం ఏడు పేపర్లలో ఒక్కో పేపర్‌కు ప్రతిరోజూ రోజుకు సగటున రెండు గంటలు కేటాయించి పునశ్చరణ చేస్తుండాలి.

రైటింగ్ ప్రాక్టీస్... నిర్ణయాత్మకం
సివిల్స్ టాపర్స్ ఎవరిని అడిగినా.. మెయిన్ పరీక్షలో విజయానికి రైటింగ్ ప్రాక్టీస్ కీలకమని చెబుతుంటారు. అభ్యర్థి దగ్గర ఎంత సమాచారం ఉన్నా.. పరీక్షలో అడిగిన ప్రశ్నలకు నిర్దిష్ట సమయంలో సముచిత సమాధానాలు రాయ లేకపోతే చదివినదంతా వృథా అవుతుంది. కాబట్టి అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమ యంలో పూర్తిగా రీడింగ్‌కే పరిమితం కాకుండా.. రోజూ కొంత సమయం రైటింగ్ ప్రాక్టీస్‌కు కూడా కేటాయించాలి. పరీక్షలో ఒక్కో ప్రశ్నకు సగటున లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని.. అం దుకు అనుగుణంగా నిర్దిష్ట సమయంలో సమాధా నాలు రాసేలా ప్రాక్టీస్ చేయాలి. వాటిని నిపుణులతో మూల్యాంకన చేయించుకుని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి.

ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ :
అడిగిన ప్రశ్నకు 150-200 పదాల్లో ఉత్తమ సమాధానం రాసేలా ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. అందు కోసం ప్రీవియస్ పేపర్లు లేదా నిపుణు లు రూపొందించిన కనీసం 5 మోడల్ పేపర్లు తీసుకొని మూడు గంటల సమయం పెట్టుకొని వాస్తవ పరీక్షలాగే సమాధానాలు రాయాలి. అలా రాసిన సమాధానాలను సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేసుకోవాలి.
  • అభ్యర్థులు సాధారణంగా ప్రశ్నలోని కీవర్డ్స్ చదివి.. తమ దగ్గర ఉన్న సమాచారం అంతా సమాధానంగా రాసేస్తుంటారు. ఇది సరికాదు. సమాధానం రాయడానికి ముందు ప్రశ్నను కనీసం మూడు నాలుగుసార్లు చదవాలి. ఎగ్జామినర్ సదరు ప్రశ్న ద్వారా ఏం ఆశిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. అడిగినంత మేరకే సూటిగా జవాబు రాయాలి.
  • సమాధానం రాసే క్రమంలో ప్రారంభం (ఇంట్రడక్షన్) కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు ప్రశ్నలో అడిగిన ముఖ్య అంశానికి నిర్వచనం రాయడం, సమకాలీన సంఘటనలను ప్రస్తావించడం, అవసరమైన చోట ఫ్లోచార్ట్స్, డయాగ్రమ్స్, మ్యాప్స్ వంటివి ఉపయోగించడం చేయాలి.
  • జనరల్ ఎస్సేకు సంబంధించి నిర్ణీత ఫార్మాట్... ఉపోధ్ఘాతం, వివరణ, ముగింపును అనుసరిస్తూ సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి. వీలైతే సమాధా నాల్లో సందర్భానికి తగిన కొటేషన్లు ఉటంకించేలా సిద్ధమవాలి.
జనరల్ ఎస్సే... విభిన్నంగా
  • జనరల్ ఎస్సే పేపర్.. ఒక్కో ఎస్సేకు 125 మార్కుల చొప్పున రెండు ఎస్సేలు మొత్తం 250 మార్కులకు ఉంటుంది. జనరల్ ఎస్సే ప్రశ్న పత్రంలో రెండు విభాగాలు సెక్షన్ ఏ, సెక్షన్ బీ ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో 4 ప్రశ్నలు ఇచ్చి.. ఒక్కో సెక్షన్ నుంచి ఒక ప్రశ్న చొప్పున రాయమని అడుగుతారు. ఒక్కో ఎస్సేను 1000 నుంచి 1200 పదాల్లో రాయాల్సి ఉంటుంది.
  • సాధారణంగా ఒక సెక్షన్‌లో జనరల్ కొటేషన్స్ ఇస్తారు. ఉదా: జాయ్ ఈజ్ సింప్లిస్ట్ ఫామ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మరో సెక్షన్‌లో పరిపాలన, జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక, పాలసీ అంశాలకు సంబంధించి అంశాలు ఉంటాయి.
  • పరీక్షలో మొత్తం మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది. రెండు ఎస్సేలు రాయాల్సి ఉంటుంది. అంటే... ఒక్కో ఎస్సేకు గంటన్నర సమయం కేటాయించుకోవాలి. ఎంపిక చేసుకున్న టాపిక్‌పై కనీసం 20 నిమిషాల సమయం కేటాయించి... రఫ్‌గా స్ట్రక్చర్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాతే ఎస్సే రాయడానికి ఉపక్ర మించాలి. అభ్యర్థి సానుకూల దృక్పథం, నిర్మాణాత్మక ధోరణి వ్యక్తమయ్యేలా ఎస్సే రాయాలి.
  • ప్రకృతి విపత్తులు(కేరళ తుఫాన్ నేపథ్యంలో), జీఎస్‌టీ- దాని ప్రభావం, ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, సామాజిక దృక్పథంలో వాటి ప్రభావం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ వ్యవస్థ, ఇటీవల కాలంలో భారత్-ఇతర దేశాల మధ్య కుదిరిన ప్రధాన ఒప్పందాలు, బ్రిక్స్ సదస్సు, సైన్స్ అండ్ టెక్నాలజీ-కొత్త ఆవిష్కరణలు, ఇస్రో పరిశోధ నలు.. వంటివి ఎస్సే పరంగా ముఖ్యాంశాలు నిలిచే అవకాశం ఉంది.
జీఎస్.. సమకాలీన అనుసంధానం
ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని జనరల్ స్టడీస్ పేపర్లను సమకాలీన అంశాలతో అనుసంధా నం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రివిజన్ చేస్తున్న సమయంలో సిలబస్‌ను సమకాలీన అంశా లతో అనుసంధానం చేసుకుంటూ.. ప్రిపరేషన్ సాగించాలి. ఎథిక్స్ పేపర్‌కు సంబంధించి వాస్తవ దృక్పథంతో ఆలోచించే నైపుణ్యంతో సాగాలి.

ఆప్షనల్స్..
మెయిన్ పరీక్షలో అభ్యర్థులు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున మొత్తం 500 మార్కులకు ఆఫ్షనల్ ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష వ్యవధి 3గంటలు. ప్రస్తుత సమయంలో.. అభ్యర్థి తాము ఎంపిక చేసుకున్న ఆప్షనల్‌కు సంబంధించి కోర్ అంశాలను, కాంటెపరరీ అంశాలతో బేరీజు వేసుకుంటూ చదవాలి. అదేవిధంగా కొన్ని ఆప్షనల్స్‌ను జీఎస్‌లోని పేపర్స్‌తో అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటీ, సోషియాలజీ, హిస్టరీ సబ్జెక్ట్‌లను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న వారికి ఈ వెసులుబాటు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీన్ని అనుకూలంగా మలచుకుని చదవాలి. ఈసారి మిగతా పేపర్లకు.. ఆప్షనల్ పేపర్‌కు మధ్య వారం రోజుల విరామం కూడా ఉంది. ఇది ఆప్షనల్‌లో పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.

గణాంకాలను పరిశీలిస్తే 60 శాతంలోపు మార్కులతోనే మెయిన్స్‌లో విజయం సాధించే ఆస్కారం కనిపిస్తోంది. అయితే 2015 నుంచి 2017 వరకు ఏటా చివరి ర్యాంకు పొందిన అభ్యర్థుల మార్కులు పెరుగుతున్నాయి. మరోవైపు పోస్ట్‌ల సంఖ్య తగ్గుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు లక్ష్యంగా కృషిచేయాలి.

సివిల్స్ మెయిన్ ఎగ్జామినేషన్ గత మూడేళ్ల కటాఫ్ :
సంవత్సరం

కేటగిరీ

జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ
2017 809 770 756 749
2016 787 745 739 730
2015 767 630 622 617

సివిల్స్ మెయిన్స్.. గత మూడేళ్లలో మొదటి, చివరి ర్యాంక్ మార్కులు :
సంవత్సరం మొదటి ర్యాంక్ మార్కులు చివరి ర్యాంక్ మార్కులు
2017 950 830
2016 927 861
2015 868 573

భావ వ్యక్తీకరణ ప్రధానం :
మెయిన్ ఎగ్జామినేషన్‌లో సమాధానాలు రాసే క్రమంలో భావ వ్యక్తీకరణ అత్యంత ప్రధానం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు విశ్లేషణాత్మక దృక్పథంతో సమాధానాలు ఇచ్చే నేర్పు పొందాలి. ఒక అధికారిగా ఫలానా సమస్యకు మీరు ఎలాంటి పరిష్కారం చూపుతారు? అనే రీతిలో ప్రశ్నలు ఎదురైనప్పుడు సామాజిక అంశాలను స్పృశిస్తూ సమాధానాలివ్వగలిగేలా చదవాలి.
- ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.

60 శాతం మార్కులు లక్ష్యంగా...
అభ్యర్థులు మెయిన్ ఎగ్జామినేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తే.. ఫలితాల్లో తమ పేరు కనిపించేలా చేసుకోవచ్చు. ప్రస్తుత సమయంలో అభ్యర్థులు రైటింగ్ ప్రాక్టీస్, మోడల్ పేపర్ల సాధన వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
- శ్రీరంగం శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్.

ఒత్తిడి లేకుండా...
పరీక్ష సమయం దగ్గరపడుతున్న కొద్దీ కొంత ఒత్తిడి సహజమే. అయితే మరీ ఎక్కువగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. సబ్జెక్ట్‌పై పట్టుతో పాటు సాధించగలననే ఆత్మవిశ్వాసం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చు. పరీక్షగదిలో తొలుత ప్రశ్నపత్రాన్ని ఆసాంతం చదవాలి. ఇందుకోసం పది నిమిషాలు సమయం కేటాయించినా ఇబ్బంది లేదు. ఆ తర్వాత తేలిక నుంచి క్లిష్టత విధానంలో సమాధానాలు రాయాలి.
- ఇ.పృథ్వితేజ్, 24వ ర్యాంకు, సివిల్స్-2017.
Published date : 04 Sep 2018 01:16PM

Photo Stories