Skip to main content

సివిల్స్ ఇంటర్వ్యూకు నిపుణుల సలహాలు..

సివిల్స్ మెయిన్స్‌-2018 పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ ఇటీవల వెల్లడించింది. మెయిన్స్‌లో ప్రతిభ చూపి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహించనుంది.
మూడు దశల(ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) సివిల్స్ సమరంలో చివరి అంకం..పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ). తొలిదశ ప్రిలిమ్స్‌లో లక్షల్లో ఉండే పోటీని తట్టుకొని మెయిన్స్‌కు చేరుకోవడం.. అందులోనూ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికవడమంటే కీలక మైలురాయిని చేరుకున్నట్లే! ప్రిలిమ్స్, మెయిన్స్ దాటుకొని గెలుపు వాకిట నిలిచిన అభ్యర్థులు.. 30-40 నిమిషాల పాటు జరిగే ఇంటర్వ్యూలో.. సివిల్ సర్వీసెస్‌లో రాణించేందుకు అవసరమైన వ్యక్తిత్వ లక్షణాలు తమలో ఉన్నాయని నిరూపించుకుంటే.. విజేతగా నిలిచినట్టే!! ఫిబ్రవరి నెలలోనే ఇంటర్వ్యూలు జరగనున్న నేపథ్యంలో నిపుణుల గెడైన్స్‌తోపాటు గత విజేతల సలహాలు, సూచనలు...

సివిల్స్ ఇంటర్వ్యూ 275 మార్కులకు జరుగుతుంది. ఇంటర్వ్యూలో సాధించే ప్రతి మార్కు.. తుది జాబితాలో అభ్యర్థి స్థానాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్)తోపాటు దాదాపు 20కిపైగా కేంద్ర సర్వీసుల్లో నియామకానికి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) అత్యంత కీలకం. ఏకాగ్రతతో ఎన్నో ఏళ్లు కష్టపడి సర్వం ఒడ్డితేగానీ సివిల్స్ ఇంటర్వ్యూ దశకు చేరుకునే అవకాశం లభించదు. కొంతమంది ఇంటర్వ్యూ దాకా వచ్చి.. గెలుపు వాకిట నిలిచిపోతారు. ఇలాంటి వారు మరికాస్త ప్రణాళికతో ప్రయత్నిస్తే..గెలుపు గమ్యాన్ని దాటవచ్చు. అందుకోసం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పరంగా జాగ్రత్తలు తీసుకోవడం.. ఇంటర్వ్యూ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం ముఖ్యం. ఇంటర్వ్యూలో అభ్యర్థి సివిల్ సర్వీస్ కెరీర్‌కు సరిపోయే వ్యక్తిత్వ, మూర్తిమత్వ లక్షణాలు ఉన్నాయా అనే విషయాన్ని యూపీఎస్సీ బోర్డు పరిశీలిస్తుంది.

పర్సనాలిటీ టెస్ట్:
పర్సనాలిటీ టెస్ట్ అనేది మెయిన్స్ పరీక్షకు కొనసాగింపనే అభిప్రాయం సరికాదంటున్నారు నిపుణులు. మెయిన్స్‌లోనే అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని అంచనావేశారు. కాబట్టి ఇంటర్వ్యూలో అభ్యర్థి ఆలోచనా దృక్పథం, కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్ణయాత్మక సామర్థ్యం, ఒత్తిడిలోనూ సమర్థంగా పనిచేయగలిగే నేర్పును అంచనావేసే ప్రయత్నం చేస్తారు. మొత్తంగా సివిల్ సర్వీసెస్ అధికారిగా పనిచేసేందుకు అవసరమైన వ్యక్తిత్వ లక్షణాలు అభ్యర్థిలో ఉన్నాయా లేవా తెలుసుకోవడమే ఇంటర్వ్యూ ఉద్దేశం. ఇందుకోసం అభ్యర్థి బయోడేటా నుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ.. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తుంటారు. దాంతోపాటు ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల నుంచి అధిక శాతం మంది సివిల్స్‌వైపు వస్తుండటంతో..భవిష్యత్తు లక్ష్యం గురించి ప్రశ్నలు సంధిస్తున్నారు.

బయోడేటాపైలోతుగా..
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అభ్యర్థి బయోడేటా(డీఏఎఫ్)లో పేర్కొన్న అంశాల నుంచి మొదలవుతుంది. మీ గురించి చెప్పండి? అనే ప్రశ్న నుంచి ప్రారంభించి.. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, హాబీల వరకూ.. వివిధ కోణాల్లో ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి డీఏఎఫ్‌లో పేర్కొన్న అంశాల్లో నుంచి అభ్యర్థి ప్రశ్నలు సిద్ధం చేసుకొని.. వాటికి సమాధానాలు రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. నాణ్యమైన సమాధానాలు సిద్ధం చేసుకోవాలి. హాబీల నుంచి లోతైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు సంగీతం హాబీగా పేర్కొనడం వల్ల.. సంగీతానికి సంబంధించి అభ్యర్థికి ఎంతలోతైన అవగాహన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆయా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతే.. బోర్డు సంతృప్తి చెందదని గుర్తించాలి. పోస్టుల ప్రాథమ్య క్రమం(ప్రిఫరెన్సెస్) జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎంచుకున్న సర్వీస్ ప్రాధాన్యంపైనా ప్రశ్నలు సంధించే ఆస్కారముంటుంది. ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ కాకుండా ఐఎఫ్‌ఎస్ ఎంచుకుంటే.. ఐపీఎస్ ఎందుకు ఎంచుకోలేదు.. మొదటి ప్రాధాన్యం ఐఏఎస్‌కు ఎందుకు ఇచ్చారు వంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు.. బోర్డు సంతృప్తి చెందేలా ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పడం లాభిస్తుంది.

ఇవీ ముఖ్యమే..
  • పుట్టిన ప్రాంతం, చదివిన స్కూల్, కాలేజీ, పని అనుభవానికి సంబంధించి ఏ ఒక్క కోణాన్ని వదిలిపెట్టకుండా ప్రిపరేషన్ సాగించాలి.
  • గ్రాడ్యుయేషన్ స్థాయిలో చదివిన సబ్జెక్టుపైనా ఇంటర్వ్యూలో తప్పనిసరిగా ప్రశ్నలు అడిగే అవకాశముంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్‌ను, సమాజాభివృద్ధిలో దాని పాత్ర.. చదివిన చదువును సమాజ ప్రగతికి ఎలా అనువర్తిస్తారో చెప్పమని అడిగే వీలుంది.
  • తల్లిదండ్రుల వృత్తి మీద కూడా ప్రశ్నలు అడుగుతారు. వాటికి సంబంధించిన పూర్వాపరాలపై అభ్యర్థి పరిజ్ఞానాన్ని తెలుసుకుంటారు.
  • తెలంగాణ, ఏపీ ప్రాంత అభ్యర్థులు.. రాష్ట్ర పునర్విభజన చట్టం గురించి పూర్తి సమాచారంతో ఉండాలి. కొత్త రాష్ట్రాల అభివృద్ధి, పరిపాలన, ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కరెంట్ అఫైర్స్ :
సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు సమకాలీన పరిణామాలపై సమాచార సేకరణ చేసుకోవాలి. ప్రధానంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు.. ట్రెండింగ్ టెక్నాలజీ, డెవలప్‌మెంట్స్ గురించి తెలుసుకోవాలి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆధార్, టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్ మొదలైన అంశాలను అధ్యయనం చేసి నోట్స్ సిద్ధం చేసుకోవాలి. ఇంటర్వ్యూ రోజు వరకూ.. రాష్ట్రీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగిన.. రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. అంతర్జాతీయ ఒప్పందాలు; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు-వాటి లక్ష్యాలు, లక్షిత వర్గాలు.. నేపథ్యం, క్షేత్ర స్థాయిలో అమలు తీరుతెన్నులు, సమస్యలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన ఏర్పరచుకోవాలి. దాంతోపాటు అభ్యర్థుల్లోని పాలనాదక్షతను పరీక్షించేలా.. ఏదైనా ఒక సమస్యను ప్రస్తావించి..మీరే కలెక్టర్ అయితే ఏం చేస్తారు? వంటి ప్రశ్నలు సైతం సంధిస్తున్నారు.

బాడీ లాంగ్వేజ్, డ్రెస్..
డ్రెస్సింగ్: ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. అంటారు. కాబట్టి సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరవుతున్న అభ్యర్థులు ధరించే దుస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దుస్తులు హుందాగా ఉండాలి. చలికాలంలో ఫార్మల్‌సూట్, టై ధరించవచ్చు. ఫార్మల్ లైట్ కలర్ షర్ట్, డార్క్ కలర్ ట్రెజర్, టై ధరించవచ్చు. సరిపోయే షూస్ ధరించడం మంచిది. మహిళా అభ్యర్థులు చీర ప్రిఫర్ చేయడం మంచిది.

విషింగ్: ఇంటర్వ్యూ రూంలోకి అడుగుపెట్టాక.. బోర్డ్ సభ్యులను పలకరించే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. సభ్యులందరినీ చూస్తూ విష్ చేయడంపై ప్రాక్టీస్ చేయాలి. సంప్రదాయం ఉట్టి పడేలా నమస్తే సర్/మేడమ్ అని సంబోధించడం మేలు. లేదా సమయాన్ని బట్టి గుడ్‌మార్నింగ్ సర్/మేడమ్ అని కూడా చెప్పొచ్చు. ముందుగా బోర్డ్ చైర్మన్‌ను విష్ చేయాలి. అలాగే ఇంటర్వ్యూ ముగిసి వెళ్లిపోయేటప్పుడు కూడా ముందుగా బోర్డ్ చైర్మన్‌కు, ఆ తర్వాత బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు చెప్పాలి.

మాక్ టెస్టులతో మేలెంత?
బోర్డ్ సభ్యులు అభ్యర్థులకు ఆహ్లాదకర వాతావరణం కలిగించేలా వ్యవహరిస్తారు. కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండేలా సంసిద్ధత సాధిస్తే.. పర్సనాలిటీ టెస్ట్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం ద్వారా అభ్యర్థి డ్రెస్ కోడ్ మొదలు, వాయిస్, బాడీ లాంగ్వేజ్‌కు సంబంధించిన అంశాలపై నిపుణుల సలహాలు పొందొచ్చు. అయితే మాక్ టెస్టుల సంఖ్య మరీ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గత విజేతల ఇంటర్వ్యూ ప్రశ్నలు..
మీ గురించి చెప్పండి, ఎక్కడ చదువుకున్నారు? ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ఎందుకు ఇష్టంలేదు; ఆ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు; శామ్‌సంగ్ వంటి కంపెనీలను మన దేశంలో పెట్టుబడులు పెట్టమని ప్రభుత్వం కోరుతోంది..దీనివల్ల మనకు ప్రయోజనం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ విభజనపై మీ అభిప్రాయం ఏమిటి; ఆంధ్రప్రదేశ్ విభజనను సమర్థిస్తారా? చిన్న రాష్ట్రాల ఏర్పాటు సరైందేనా? కోటాలో ఐఐటీ కోచింగ్‌లో విద్యార్థుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించడం ఎలా; ఆర్టికల్ 370? ఉడాన్ అంటే ఏమిటి; ఇది ధనవంతులకు సబ్సిడీ కాదా? దేశాలు అణ్వస్త్ర నిరాయుధీకరణ గురించి మాట్లాడుతుంటాయి.. కానీ, అణ్వాయుధాలను పెంచుకుంటున్నాయి.. దీన్ని ఎలా చూస్తారు; నోస్ట్రో అకౌంట్ అంటే ఏమిటి? ప్రొటక్షనిజంపై ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యలు, ప్రొటెక్షనిజం సైరెందేనా? బ్రెక్జిట్ కూడా ప్రొటెక్షనిజమేనా? అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం గురించి చెప్పండి? చైనాపై మనం టారిఫ్‌లు ఎందుకు విధించ కూడదు? చైనాతో వాణిజ్య లోటును పూడ్చుకోవడం ఎలా? భారత్ ఏఏ రంగాలపై దృష్టిపెట్టాలి; ఆగ్రో సబ్సిడీలు, గ్రీన్ బాక్స్ సబ్సిడీలు; భారత్ ఒలింపిక్స్‌ను నిర్వహించాలా?రాజకీయాల్లో నేరస్థులు? న్యాయవ్యవస్థ క్రియాశీలత మంచిదేనా? ఎస్సీ/ఎస్టీ చట్టం; భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం, ఆపరేషన్ పోలో; క్రీడల్లో డోపింగ్-సమస్యకు పరిష్కాం వంటి ప్రశ్నలను అడిగారు.

భయం వీడాలి..
Bavitha ఇంటర్వ్యూకు ఉన్న మార్కుల వెయిటేజీ చాలా ఎక్కువ. కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభం నుంచే పర్సనాలిటీ టెస్టును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. విస్తృతంగా పుస్తకాలు చదవటం ద్వారా ఆలోచన పరిధి పెరుగుతుంది. ఏదైనా ఒక అంశంపై అన్ని కోణాల్లో విశ్లేషించే నైపుణ్యం అలవడుతుంది. సమస్యలకు సొంత పరిష్కారాలను ఆలోచించగలిగితే... ఇంటర్వ్యూకు 80 శాతం సన్నద్ధత లభించినట్లే. చాలామంది క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతారని ఆందోళన చెందుతుంటారు. అది సరైన విధానం కాదు. ఇంటర్వ్యూ అనేది మీ ఆలోచనలు, విలువలు, సమాజంలో సమస్యలకు మీ పరిష్కారాలను పంచుకునే వేదికని భావించాలి. అభ్యర్థి వ్యక్తిత్వం.. సివిల్ సర్వీసెస్‌కు సరిపోతుందా లేదా అనేది పరిశీలించడానికేఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కాబట్టి అందుకు తగ్గుట్టు సిద్ధమవ్వాలి!!
- రిషాంత్‌రెడ్డి, ఐపీఎస్, 2015 విజేత(ఇంటర్వ్యూలో 204 మార్కులు వచ్చాయి).
Published date : 07 Jan 2019 07:50PM

Photo Stories