సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. పర్సనాలిటీ టెస్ట్‌కు పట్టు సాధించండిలా..!
తాజాగా మెయిన్ ఫలితాలను యూపీఎస్‌సీ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు చివరి దశగా పేర్కొనే.. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వూ) త్వరలోనే ప్రారంభంకానుంది. ప్రిలిమ్స్, మెయిన్‌లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షల ద్వారా.. తమ నైపుణ్యాలను, ప్రతిభను ప్రదర్శించిన అభ్యర్థులు.. ఇక చివరి దశ ఇంటర్వూలో రాణించాల్సి ఉంది! ఈ నేపథ్యంలో.. సివిల్స్ మెయిన్–2020లోవిజయం సాధించి.. పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులు.. తుది విజేతల జాబితాలో నిలిచేందుకు నిపుణుల సలహాలు, సూచనలు...
- 796 సివిల్స్–2020 ఎంపిక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్న పోస్ట్‌ల సంఖ్య.
- 48 శాతం: దరఖాస్తు చేసుకున్న దాదాపు తొమ్మిది లక్షల మందిలో ప్రిలిమ్స్‌కు హాజరైన వారి శాతం.
- 10,564 ప్రిలిమ్స్‌లో విజయం సాధించి మెయిన్ పరీక్షలకు ఎంపికైన వారి సంఖ్య.
- 2,046 మెయిన్‌లోనూ ప్రతిభ చూపి.. చివరి దశ పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వూ్య)కు ఎంపికైన అభ్యర్థుల సంఖ్య.
- తెలుగు రాష్ట్రాల నుంచి 75 నుంచి 90 మంది అభ్యర్థులు ఇంటర్వూ్యకు ఎంపికైనట్లు అంచనా. ఇప్పుడు.. వీరంతా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న పర్సనాలిటీ టెస్ట్‌కు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు రాత పరీక్షల్లో చూపిన నైపుణ్యం ఒక ఎత్తయితే.. పర్సనాలిటీ టెస్ట్‌లో చూపే ప్రతిభే అత్యంత కీలకం కానుందని నిపుణులు పేర్కొంటున్నారు.
మార్కులు తక్కువే కానీ.. కీలకం
మొత్తం 2025 మార్కులకు నిర్వహించే సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. ఇంటర్వూ్యకు కేటాయించిన మార్కులు 275మాత్రమే. కానీ.. ఈ 275 మార్కులే తుది జాబితాలో నిలపడంలో అత్యంత కీలకంగా మారుతున్నాయి. ముఖాముఖి విధానంలో జరిగే ఇంటర్వూ్యలో.. ఆయా అంశాలపై అభ్యర్థుల అవగాహనతోపాటు వ్యక్తిత్వ లక్షణాలను బోర్డు సభ్యులు పరిశీలిస్తారు. కాబట్టి ఏ మాత్రం తడబాటుకు గురైనా.. కొద్ది మార్కుల తేడాతో విజయం చేజారే ఆస్కారముంది. కాబట్టి ఇంటర్వూ్యకు ఎంపికైన అభ్యర్థులు.. వ్యక్తిత్వం నుంచి అకడమిక్ నేపథ్యం వరకూ.. అవసరమైన అన్ని అంశాలపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి.
భావ వ్యక్తీకరణలో స్పష్టత..
అభ్యర్థుల వ్యక్తిత్వం మొదలు సామాజిక అంశాలు, సమకాలీన పరిస్థితులు, సమస్యలపై వారికున్న అవగాహనను, అభిప్రాయాలను తెలుసుకునే విధంగా ఇంటర్వూ్య సాగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాలపై స్పష్టత, తార్కిక విశ్లేషణ, అభిప్రాయాలను వ్యక్తీకరించే నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా కృషి చేయాలి. అభిప్రాయాలను చెప్పే సమయంలో ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా మాట్లాడాలి. ముఖ్యంగా బోర్డ్ సభ్యులు ఏవైనా పథకాలు, వాటి అమలుకు సంబంధించి అభిప్రాయాలు అడిగినప్పుడు.. అందులో లోపాలు ఉంటే..వాటిని మెప్పించే రీతిలో చెప్పాలి.
బయోడేటాతో మొదలు..
పర్సనాలిటీ టెస్ట్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు.. ముందుగా తమ బయోడేటాపై దృష్టిపెట్టాలి. కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల వృత్తి, తమ స్వస్థలం, రాష్ట్రం, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత దశలో అకడమిక్‌గా బ్యాచిలర్, పీజీ స్థాయిలో చదివిన అంశాలపై పట్టు బిగించాలి. తమ కోర్ సబ్జెక్ట్‌లకు సంబంధించి.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వాస్తవ పరిణామాలను అన్వయం చేసుకుంటూ సన్నద్ధం కావాలి. ఇంటర్వూ ప్రిపరేషన్ సమయంలోనూ నోట్స్ రాసుకునే విధానాన్ని కొనసాగించడం మేలు చేస్తుంది. ప్రధానంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వాటి లక్ష్యాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, సదరు పథకాల అమలులో లోటుపాట్లు, వాటికి పరిష్కార మార్గాలతో ఈ నోట్స్ ఉండేలా చూసుకోవాలి.
అరగంటలో ఆసాంతం..
యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్స్ ఇంటర్వూ్యల సగటు వ్యవధి దాదాపు అరగంట ఉంటుంది. ఈ 30 నిమిషాల్లోనే అభ్యర్థుల నైపుణ్యాలను ఆసాంతం పరీక్షించగలిగే వ్యక్తులు ఇంటర్వూ్య బోర్డ్‌లో ఉంటారు. ఆయా రంగాల్లో ఆరితేరిన వ్యక్తులు, సీనియర్ సివిల్ సర్వెంట్లు.. బోర్డ్ సభ్యులుగా ఉంటారు. అభ్యర్థులు తమకు లభించే ఈ అరగంట సమయంలోనే బోర్డ్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగే సంసిద్ధత అలవర్చుకోవాలి. ఇందుకోసం మాక్ ఇంటర్వూ్యలకు హాజరవడం మేలు చేస్తుంది.
సానుకూల దృక్పథం..
పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులు పూర్తిగా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ప్రతికూల ఆలోచనలతో ఇంటర్వూకు హాజరైతే.. అది ఫలితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొందరు అభ్యర్థులు ఆయా పథకాలు, ప్రభుత్వ చర్యల విషయంలో తమకు కనిపించిన లోపాలనే ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు. ఇలాంటి ధోరణి వల్ల బోర్డ్ సభ్యులకు సదరు అభ్యర్థులపై ప్రతికూల అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఆయా పథకాల ఉద్దేశాన్ని సానుకూల దృక్పథంతో వివరించాలి. ఏమైనా లోటుపాట్లను గుర్తిస్తే.. పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను వివరించాలి.
సేవా తత్పరత..
ఇంటర్వూ్యలో చాలా మంది అభ్యర్థులకు ఎదురయ్యే ప్రధానమైన ప్రశ్న.. ‘సివిల్ సర్వీస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు?’ అనేది. దీనికి అభ్యర్థులు సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో వచ్చామని చెప్పి బోర్డ్ సభ్యులను ఆకట్టుకోవడం కష్టమే. కాబట్టి అభ్యర్థులు తమ సేవా దృక్పథం, సామాజిక అంశాలపై తమకున్న అవగాహన తోపాటు సివిల్ సర్వీసెస్‌కు అవసరమైన లక్షణాలు తమలో ఉన్నాయని నిరూపించే విధంగా సమాధానాలు ఇవ్వాలి. అదే విధంగా చిత్తశుద్ధి, నైతికత వంటి లక్షణాలు కూడా ఎంతో కీలకం అని గుర్తించాలి. ముఖ్యంగా ఇంటర్వూ సమయంలో అభ్యర్థులు సహజ సిద్ధమైన వ్యక్తిత్వంతో మెలగాలి.
బోర్డ్ రూమ్‌లో ఇలా..
అభ్యర్థులు బోర్డ్ రూమ్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇంటర్వూ పూర్తయ్యే వరకు.. అప్రమత్తంగా, బోర్డ్ సభ్యులను మెప్పించేలా వ్యవహరించాలి. ఇంటర్వూ గదిలోకి అడుగుపెట్టగానే.. బోర్డ్ సభ్యులకు అభివాదం చేయాలి. ముందుగా చైర్మన్‌కు, ఆ తర్వాత మిగతా సభ్యులకు విష్ చేయాలి. బోర్డులో ఒకవేళ మహిళా సభ్యురాలు ఉంటే ఆమెకు ప్రత్యేకంగా అభివాదం తెలపాలి.
వినమ్రత..
ఇంటర్వూ హాల్‌లోకి అడుగు పెట్టిన తర్వాత అభ్యర్థి వినమ్రతతో వ్యవహరించడం ఎంతో ప్రధానం అని గుర్తించాలి. దుందుడుకు ప్రవర్తన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. అదే విధంగా సమాధానం చెప్పేటప్పుడు అనవసరమైన, అసందర్భ విషయాలు మాట్లాడకూడదు. అలాగని మరీ తక్కువగా మాట్లాడటం కూడా సరికాదు. సమతులమైన దృక్పథం కలిగి ఉండాలి(బ్యాలెన్స్‌డ్ అప్రోచ్).
ప్రశ్న ఆధారంగా వ్యవధి..
ఇంటర్వూ సమయంలో అభ్యర్థులు చేస్తున్న పొరపాటు.. ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికే సుదీర్ఘంగా సమాధానమిస్తూ సమయం వృ«థా చేస్తుంటారు. అభ్యర్థులు తమకున్న విజ్ఞానాన్ని బయటపెట్టాలనే ఆతృతతో ఒకే ప్రశ్నకు అధిక సమయం కేటాయించడం వంటివి చేయకూడదు. అలాగే ప్రశ్న అడిగే సమయంలో బోర్డ్ సభ్యులకు అంతరాయం కలిగించొద్దు. ప్రశ్న పూర్తయ్యే వరకు వేచి చూడాలి. ప్రశ్న పూర్తి కాకుండానే.. సరిగా అర్థం చేసుకోకుండానే.. సమాధానం ఇవ్వకూడదు. సమాధానం తొందరగా చెప్పేలా ఉండాలి కానీ తొందరపాటుతో చెప్పేలా ఉండకూడదు. మీరు సమాధానం చెబుతున్న దాని కంటే వేగంగా బోర్డ్ సభ్యులు.. మీపై ప్రశ్నలు సంధించే ఆస్కారముంది. మీరు చెబుతున్న సమాధానమే కరెక్ట్ అని బోర్డ్ సభ్యులు భావించాలనుకోవడం సరికాదు.
ప్రస్తుత ఉద్యోగంపైనా ప్రశ్నలు..
సివిల్స్ ఇంటర్వూ్యకు ఎంపికైన అభ్యర్థుల్లో.. ఇప్పటికే ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉంటారు. వీరికి ఇంటర్వూ సమయంలో తొలుత సదరు ఉద్యోగంపైనే ప్రశ్న ఉంటుంది. ఇలాంటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. దానికి సంబంధించి అవసరమైనంత మేరకే సమాధానం చెప్పాలి. మీరు ఒక కొత్త ఉద్యోగ ఇంటర్వూలో ఉన్నారని గుర్తుంచుకోండి. సమాధానాలు సూటిగా చెప్పాలి. ఒకవేళ మీ అనుభవం నుంచి ఏదైనా చెప్పాలనుకుంటే.. తక్కువ వివరాలతో సమాధానం పూర్తి చేయాలి. సమాధానం వాస్తవాలతో కూడినదై ఉండాలే తప్ప.. ఊహాజనితంగా ఉండకూడదు.
ఈ అంశాలపై ప్రశ్నలు..
- యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ వైరస్, వ్యాక్సీన్ తయారీ, భారత్ పాత్ర.
- కరోనా కారణంగా సామాజికంగా ఏర్పడిన అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, ఆర్థికాభివృద్ధిపై చూపిన ప్రభావం, ప్రభుత్వం తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలు.
- అభ్యర్థి సొంత రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు.
- భారత రాజకీయ వ్యవస్థపై విస్తృత దృష్టి.
- దేశ ఆర్థిక వ్యవస్థపై అవగాహన, ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలు, దేశ పురోగమన అంశాలు, లక్ష్యాలు.
- ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్, ఆర్థిక సమ్మిళితత్వం అభివృద్ధి.
- పరిపాలనలో కొత్త పోకడలు, సుపరిపాలన విధానాలు, ఈ–గవర్నెన్స్, ఐసీటీ వినియోగం.
- అభివృద్ధి కార్యక్రమాల్లో జీవావరణ మూల్యాంకనం,బడ్జెట్–డెవలప్‌మెంట్,–భారత సహజ వనరులు.
- ప్రోగ్రామ్స్‌లో పర్యావరణ వ్యయాల ఏకీకరణ,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జీవావరణ వ్యవస్థలో నూతన అంశాలు, అభివృద్ధి.
- సుస్థిరాభివృద్ధిలో నూతన పోకడలు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా సంసిద్ధత, చేపడుతున్న కార్యక్రమాలు.
- శాస్త్రీయ, సాంకేతిక శక్తి, అభివృద్ధి అంశాలు.
- అంతర్జాతీయంగా జియో పాలిటిక్స్, ఎకానమీ, ప్రాంతీయ విభేదాలు, ఐరాస, ఇతర సంఘాలు, భారత ద్వైపాక్షిక, బహుముఖ ఒప్పందాలు.
- ప్రపంచీకరణలో భారత భాగస్వామ్యం, గ్లోబలైజేషన్ పర్యవసానాలు,అదే విధంగా అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు.
- సమకాలీన పరిణామాలు(కరెంట్ అఫైర్స్).
- ఇలా ఇప్పటి నుంచే అన్ని విధాలుగా పర్సనాలిటీ టెస్ట్‌కు సన్నద్ధమైతే.. తుది విజేతల జాబితాలో నిలిచి.. ఆల్ ఇండియా సర్వీస్‌కు ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
170 మార్కులు లక్ష్యంగా..
ఇంటర్వూకు ఎంపికైన అభ్యర్థులు మొత్తం 275 మార్కులకు గాను కనీసం 170 మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. అభ్యర్థులు ఇంటర్వూ అంటే ఆందోళన, ఒత్తిడిని వీలైనంత త్వరగా వదిలేయాలి. సాధ్యమైనంత తర్వగా ప్రిపరేషన్‌ను ప్రారంభించి..ముఖ్యమైన అంశాలను గుర్తించి.. వాటిపై అడిగేందుకు అవకాశం ఉన్న ప్రశ్నలను సాధన చేయాలి. అదే విధంగా తమ బలాలనే గుర్తుంచుకుని ముందుకు సాగాలి.
– వి.గోపాల కృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ.