Skip to main content

కెరీర్ గైడెన్స్ - స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్

ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం సాధించడం..ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) చదువుతున్న వారిలో మెజారిటీ విద్యార్థులఅభిప్రాయం ఇదే! మరి ఒకేసారి ఇంజనీరింగ్ డిగ్రీ..సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం లభిస్తే.. ఈ అవకాశానికి మార్గం వేస్తోంది.. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్.

స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్.. ఇంటర్మీడియెట్ అర్హతతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్ష. ఇందులో విజయంతో దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన రైల్వే శాఖలో క్లాస్-1 హోదాలో మెకానికల్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభిం చడానికి తొలి అడుగు పడినట్లే. ఈ పరీక్షపై మన రాష్ట్రంలోని విద్యార్థుల్లో అవగాహన తక్కువగా ఉంటోంది. ఇంటర్ స్థాయి సిలబస్‌తో నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధించడం సులువే.. తద్వారా మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు ఉద్యోగం కూడా సొంతమవుతుంది.

ఎంపిక విధానం:
రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ అనే దశలుగా ఎంపిక విధానం ఉంటుంది.

పరీక్ష ఇలా

స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ పరీక్ష మూడు పేపర్లలో మొత్తం 600 మార్కులకు ఉంటుంది. ఆ
వివరాలు..

పేపర్-1 జనరల్ ఎబిలిటీ టెస్ట్
సమయం-రెండు గంటలు మార్కులు:
200

పేపర్-2 ఫిజికల్ సెన్సైస్
సమయం-రెండు గంటలు మార్కులు:
200

పేపర్-3 మ్యాథమెటిక్స్
సమయం-రెండు గంటలు మార్కులు:
200

ప్రిపరేషన్
పేపర్ -1 జనరల్ ఎబిలిటీ టెస్ట్:
రెండు వందల మార్కులకు 2 గంటల వ్యవధిలో జరిగే ఈ పరీక్షలో.. జనరల్ నాల్జెడ్, ఇంగ్లిష్, పర్సనాలిటీ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంగ్లిష్‌కు సంబంధించి బేసిక్ రూల్స్, గ్రామర్ కచ్చితంగా తెలిసి ఉండాలి. ముఖ్యంగా వొకాబ్యులరీ పెంచుకునే దిశగా కృషి చేయాలి. అంతేకాకుండా యాంటానిమ్స్, సినానిమ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెంన్సెస్ తదితర ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి. ఈ క్రమంలో హైస్కూల్ స్థాయి ఇంగ్లిష్ పుస్తకాలను చదివితే ప్రయోజనం ఉంటుంది.

జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ప్రముఖంగా పర్యావరణం, సమకాలీన అంశాలు, జీవులు- జాతులు, వృక్షాలు- రకాలు ఇలా.. సమాజం, పరిసరాల్లోని ఆయా అంశాలపై కనీస అవగాహన ఏ మేరకు ఉందనే విధంగా ప్రశ్నలు అడుగుతారు. అంతేకాక భారత చరిత్ర, స్వాంతంత్య్ర పోరాటంలోని ముఖ్య సంఘటనలు, రాజ్యాంగంపై కనీస అవగాహన పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. హై స్కూల్, ఇంటర్మీడియెట్ స్థాయిలో సైన్స్, ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులపై పట్టున్న వారు సులభంగానే ఇందులో రాణించ వచ్చు. ఇక ఈ పేపర్‌లోనే పార్ట్-బిగా నిర్వహించే పర్సనాలిటీ టెస్ట్‌లో అభ్యర్థి బేసిక్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఆప్టిట్యూడ్‌ను తెలుసుకునే రీతిలో ప్రశ్నలుంటాయి. కరెంట్ అఫైర్స్ సంబంధ ప్రశ్నలు కూడా ఉంటాయి. కాబట్టి పరీక్ష తేదీ నాటికి ముందు సంవత్సర కాలంలోని పరిణామాలను తేదీల వారీగా తెలుసుకోవడం మంచిది.

పేపర్-2 ఫిజిక్స్:
ఈ పేపర్ కూడా 200 మార్కులతో ఉంటుంది. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ అంశాల్లో ఉన్న సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ క్రమంలో విద్యార్థులు ఇంటర్మీడియెట్ స్థాయిలోని ఫిజిక్స్ అంశాలు (లైట్, టైం అండ్ మాస్, స్ట్రెయిట్ లైన్ మోషన్, వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్, న్యూటన్ లా ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ పవర్ తదితర)పై పట్టు సాధించాలి. ఇక కెమిస్ట్రీకి సంబంధించి ఫిజికల్ కెమిస్ట్రీలోని అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఎనర్జీ ఛేంజెస్ ఇన్ కెమికల్ రియాక్షన్, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆక్సిడేషన్ రిడక్షన్, నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ అంశాలపై దృష్టి సారించాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలోని గ్రూప్ ఎలిమెంట్స్‌తోపాటు మెటలర్జికల్ ప్రాసెస్‌లను తెలుసుకోవడం ప్రయోజనం. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీలో హాలోజన్ డెరివేటివ్స్, హైడ్రాక్సీ కాంపౌండ్స్, ఈథర్స్, నైట్రో కాంపౌండ్స్ ఎమైన్స్ వంటి అంశాలను నేర్చుకోవాలి.

పేపర్ 3.. మ్యాథమెటిక్స్
ఇది కూడా రెండొందల మార్కులకు రెండు గంటల సమయంలో జరిగే పరీక్షే. ఇంటర్మీడియెట్ స్థాయిలోని మొత్తం మ్యాథమెటిక్స్ సిలబస్‌ను పుక్కిటపట్టాల్సిందే. అల్జీబ్రా మొదలు.. ఇంటెగ్రల్ కాలిక్యులేషన్స్ వరకు ప్రతి అంశంపై పట్టు సాధిస్తేనే ఈ పేపర్‌లో విజయం సులభం. అయితే మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్షలో విజయం సాధించాలంటే ప్రశ్నను వేగంగా అర్థం చేసుకుని అందులోని ‘కీ’లక అంశాన్ని గుర్తించే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని ఆయా అంశాలకు సంబంధించి సాంకేతిక నామాలు, యూనిట్లు- ప్రమా ణాలు, బేసిక్ ప్రిన్సిపుల్స్ వంటివి నోటి మాటగా చెప్పే నైపుణ్యం ఉండాల్సిందే. నెగెటివ్ మార్కింగ్ (ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు) ఉంటుంది కాబట్టి పరీక్ష సమయంలో తొందరపాటు పనికిరాదు. ముఖ్యంగా పదుల సంఖ్యలోనే ఉండే ఖాళీలను చేజిక్కించుకోవాలంటే ఎంతో అప్రమత్తంగా ఉండాలి.

అయితే ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈ వంటి పోటీ పరీక్షలకు హాజరైన వారు సులువుగానే ఈ రాత పరీక్షలో నెగ్గొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రోజుకు కనీసం 8 గంటల ప్రిపరేషన్‌తో విజయానికి చేరువకావచ్చు. ప్రిపరేషన్ క్రమంలో.. ఇంటర్మీడియెట్ స్థాయిలో ‘ఛాయిస్’ కింద వదిలేసిన అంశాలపై ముందుగా దృష్టి కేంద్రీకరించడం మంచిది. అకడెమిక్ పరీక్షల్లో లభించే ఛాయిస్ సౌలభ్యం కాంపిటీటివ్ పరీక్షల్లో లభించదు కాబట్టి అభ్యర్థులు ప్రతి అంశంపైనా పట్టు సాధించే దిశగా కృషి చేయాలి. ‘ఎలిమినేషన్’ ప్రాసెస్‌కు ఎంత దూరంగా ఉంటే విజయానికి అంత దగ్గరవుతారని గుర్తించాలి. ప్రిపరేషన్ సమయంలో స్టాండర్డ్ మెటీరియల్‌తోపాటు రివిజన్ సమయంలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ టెస్ట్‌లను సాల్వ్ చేయడం ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది.

యూజ్‌ఫుల్ బుక్స్
ఎస్‌సీఆర్‌ఏ సెల్ఫ్‌స్టడీ గైడ్ - డా’’ సుశీల్ వర్మ, ఎం.కె.దీక్షిత్ అండ్ ఆర్.కె. అగర్వాల్
ఉప్‌కార్స్ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ - డా’’ లాల్ అండ్ జైన్
ప్రముఖ ఇంగ్లిష్, తెలుగు దిన పత్రికలు
ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ మెటీరియల్

పరీక్ష పాసైతే
స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 200. పలు బోర్డుల నేతృత్వంలో సాగే ఈ పర్సనాలిటీ టెస్ట్‌లలో సాధారణ అంశాలపైనా, బయోడేటా ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ పర్సనాలిటీ టెస్ట్ ప్రధానంగా.. అభ్యర్థికున్న నాయకత్వ లక్షణాలు, ఆసక్తి, సమర్థత, ప్రత్యేకతలు, మానసిక పరిపక్వత స్థాయిని తెలుసుకునే విధంగా ఉంటుంది. ఈ క్రమంలో అభ్యర్థులు తమ హాబీలు, ఇతర అలవాట్లు తెలియజేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణంగా ఇంటర్వ్యూల్లో హాబీలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. వాటికి సంబంధించిన ప్రశ్నలను అడగడం సహజం. కాబట్టి భేషజాలకు పోకుండా నిజంగా ఆసక్తి ఉన్న వాటినే తెలియజేయడం వల్ల ఇంటర్వ్యూ సమయంలో నిశ్చింతగా ఉండొచ్చు.

బిట్స్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ:
దేశ వ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకుంటూ రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండు దశల్లోనూ విజయం సాధించి మెరిట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులకు రైల్వేలో ఉద్యోగానికి అడుగు పడినట్లే. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాత బిర్లా ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీకి చేరువలో ఉన్నట్లే. ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల పాటు రైల్వే వర్క్‌షాప్‌లలో అప్రెంటీస్ ట్రైనింగ్ అందిస్తారు. ఈ సమయంలో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెర్సా (రాంచీ) నుంచి బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ సొంతమవుతుంది. ఈ దిశగా థియరిటికల్, ప్రాక్టికల్ శిక్షణ కూడా రైల్వే వర్క్‌షాప్‌లలో లభిస్తుంది. ఈ శిక్షణ సమయంలో అభ్యర్థి సాధించిన పరిజ్ఞానాన్ని నిరంతరం పరీక్షిస్తారు. ఈ క్రమంలో నాలుగేళ్ల కాలంలో ఎనిమిది సెమిస్టర్‌లలో పరీక్షలు రాయాలి. అన్ని సెమిస్టర్లలోనూ సగటున 40 శాతం, నిర్ణీత ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ ఇచ్చే పెర్ఫార్మెన్స్ రిపోర్ట్‌లో 60 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి రైల్వేలో క్లాస్-1 హోదాలో మెకానికల్ ఇంజనీర్‌గా ప్రొబేషనరీ అపాయింట్‌మెంట్ లభిస్తుంది. ఈ ప్రొబేషన్ పిరియడ్ 18 నెలలు. అంతేకాక ప్రతి సెమిస్టర్ మధ్యలో ఆన్-జాబ్ ట్రైనింగ్ క్లాస్‌లను కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు సొంతంగా ప్రాజెక్ట్ వర్క్ చేపట్టే అవకాశం కూడా పొందవచ్చు. ఇది భవిష్యత్తులో కచ్చితంగా మేలు చేస్తుంది.

స్టైపెండ్ కూడా:
ఎస్‌సీఆర్‌ఏ పరీక్ష పూర్తై రైల్వే వర్క్ షాప్‌లో శిక్షణకు ఎంపికైన వారికి స్టైపండ్ లభించడం మరో విశేషం. నాలుగేళ్ల శిక్షణ సమయంలో మొదటి రెండేళ్లు నెలకు రూ. 9,100 చొప్పున, మూడో ఏడాది నుంచి నాలుగో ఏడాది మొదటి ఆరు నెలల వరకు నెలకు రూ. 9,400, శిక్షణ చివరి ఆరు నెలలు నెలకు రూ. 9700 చొప్పున స్టైపండ్ అందజేస్తారు.

సర్వీస్ అగ్రిమెంట్ తప్పనిసరి:
స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎంపిక ప్రక్రియలోని రాత పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించి అప్రెంటీస్ ట్రైనింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా సర్వీస్ అగ్రిమెంట్ రాయాలి. ఈ అగ్రిమెంట్‌పై అభ్యర్థితోపాటు మరొకరు ష్యూరిటీ ఇవ్వాలి. అప్రెంటీస్‌షిప్ పూర్తయ్యాక ఇండియన్ రైల్వేస్ డిపార్ట్‌మెంట్‌లో రైల్వేలో సేవలందిస్తామని హామీ తీసుకోవడమే ఆ అగ్రిమెంట్ ఉద్దేశం.

ఎస్‌సీఆర్‌ఏ సమాచారం
అర్హత:
ఇంటర్మీడియెట్(మ్యాథ్స్ కంపల్సరీ సబ్జెక్టుగా, ఫిజిక్స్/కెమిస్ట్రీలో ఏదో ఒక సబ్జెక్టు) ఉత్తీర్ణత.
వయో పరిమితి: 17 నుంచి 21 ఏళ్లు (పరీక్ష జరిగే సంవత్సరం ఆగస్టు 1 నాటికి).

నోటిఫికేషన్ షెడ్యూల్:
నోటిఫికేషన్ విడుదల:
ప్రతి ఏడాది ఫిబ్రవరి

పరీక్ష నిర్వహణ: ప్రతి ఏడాది జూలై

వెబ్‌సైట్: www.upsc.gov.in
Published date : 28 May 2012 06:26PM

Photo Stories