Skip to main content

విజ్ఞాన శాస్త్రంతో విలువైన అవకాశాలెన్నో...

ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశోధనలను ప్రోత్సహించాలి. అందులోనూ సెన్సైస్‌కు పెద్దపీట వేయాలి. భూగర్భం నుంచి అంతరిక్షం వరకు.. వ్యాధుల నివారణ నుంచి మనిషి జన్యుపటం ఆవిష్కరణ దాకా.. ఎక్కువ దిగుబడి నిచ్చే పంటలు, ఆయుధాలు, క్షిపణుల తయారీ.. ప్రతిదీ సైన్స్‌తోనే! మానవ ప్రగతి విజ్ఞానశాస్త్రంతోనే ముడిపడి ఉంది!! అంగారక కక్ష్యలోకి ‘మామ్’ వంటి అద్భుతాలు సైన్స్‌తోనే సాధ్యం. సైన్స్ పరిశోధనలతో వివిధ దేశాలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందాయో తెలిసిందే. మన పొరుగు దేశం చైనా పరిశోధనలను ప్రోత్సహించడానికి భారీగా ఖర్చు చేస్తోంది. సైన్స్ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తోంది. నగరంలోని పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకూ కోర్సులను అందిస్తున్నాయి. పరిశోధనల్లో ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్, గ్రాంట్లు మంజూరు చేస్తూ భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో సైన్స్ కోర్సులు అందిస్తున్న విద్యా సంస్థలు, కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఫోకస్...

సెన్సైస్‌లో స్పెషలైజేషన్లు..
పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సైన్‌‌స సబ్జెక్టులు ఉంటాయి. బీఎస్సీలో ఎన్నో సబ్జెక్టులను ఎంచుకునే వీలుంది. అవి.. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, జెనెటిక్స్, ఫుడ్‌సైన్స్, ఎలక్ట్రానిక్స్ మొదలైనవి. ఇక పీజీ కోర్సుల్లో భాగంగా పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. పైన పేర్కొన్నవాటితోపాటు నానోటెక్నాలజీ, జియాలజీ, మెరైన్ బయాలజీ, మెరైన్ జియాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రీషనల్ సెన్సైస్, ఆయిల్ అండ్ ఫ్యాట్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మెరైన్ బయోటెక్నాలజీ, ఫిషరీ సైన్స్, ఓషనోగ్రఫీ, స్పేస్ ఫిజిక్స్, జియోఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, మెటియోరాలజీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, మెరైన్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, జియోఇన్ఫర్మేటిక్స్, యానిమల్ బయోటెక్నాలజీ, ప్లాంట్ బయాలజీ, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్‌లో కోర్సులను నగరంలో, దేశంలో వివిధయూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.

అందుబాటులోని కోర్సులివే..
నగరంలో ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వంటివి వివిధ విభాగాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ప్రవేశపెట్టాయి. వీటిలో ప్రస్తుతం డిమాండ్ ఉన్న, భవిష్యత్‌లో కెరీర్‌కు అవకాశమున్న స్పెషలైజేషన్లు కూడా ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో భాగంగా కెమికల్ సెన్సైస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్ వంటివాటిని అందిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో కెమిస్ట్రీని ఆఫర్ చేస్తోంది. సబ్జెక్టును బట్టి ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆయా యూనివర్సిటీలు దూరవిద్యలో కూడా వివిధ కోర్సులను అందిస్తున్నాయి.

ప్రత్యేక విద్యా సంస్థలు:
City Plus సైన్స్ పట్ల ఆసక్తి ఉండి.. పరిశోధనల్లో రాణించాలనుకునే ఔత్సాహిక యువతకు.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది.
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)ను దేశంలో మొత్తం ఐదు చోట్ల ఏర్పాటు చేశారు. అవి..తిరువనంతపురం, మొహాలి, కోల్‌కతా, భోపాల్, పుణె. ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) - మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) పేరుతో ఐదేళ్ల డ్యుయెల్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సులో చేరిన విద్యార్థులకు నెలకు రూ. 5 వేల స్కాలర్‌షిప్ కూడా ఇస్తారు. బీఎస్-ఎంఎస్ కోర్సులే కాకుండా పీహెచ్‌డీ కోర్సులను కూడా ఐఐఎస్‌ఈఆర్ ఆఫర్ చేస్తోంది.
  • సైన్స్ కోర్సులను అందించడం కోసమే ఏర్పడిన మరో ప్రతిష్టాత్మక సంస్థ.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్). భువనేశ్వర్‌లో ఉన్న ఈ సంస్థ సైన్స్‌లోని వివిధ విభాగాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను అందిస్తోంది.
    వెబ్‌సైట్: www.niser.ac.in
  • దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా నిలుస్తోంది.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) - బెంగళూరు. నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నిబంధనలకనుగుణంగా భారీ స్థాయిలో స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ కూడా అందిస్తోంది.
    వెబ్‌సైట్: www.iisc.ernet.in
  • ఇవేకాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సంస్థలు కూడా సెన్సైస్‌లో వివిధ విభాగాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు) కూడా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఫ్యాకల్టీగా, పరిశోధకులుగా అవకాశాలు
సైన్స్ కోర్సులు పూర్తిచేసినవారికి ఉన్నన్ని కెరీర్ అవకాశాలు మరే కోర్సుల విద్యార్థులకు లేవంటే అతిశయోక్తి కాదు. పీజీ పూర్తిచేసి సెట్, సీఎస్‌ఐఆర్-నెట్ వంటి వాటిలో అర్హత సాధిస్తే బోధన రంగంలో లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా పనిచేయొచ్చు. జూనియర్ లెక్చరర్‌కు నెలకు రూ.12,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుంది. నిపుణులకు లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. పీహెచ్‌డీ పూర్తిచేస్తే ఆయా విభాగాల పరిశోధన సంస్థల్లో జూనియర్, సీనియర్ సైంటిస్టులుగా పనిచేయొచ్చు. తద్వారా నెలకు రూ.లక్షల్లో వేతనాలు పొందొచ్చు. ఇంకా ఇతర సదుపాయాలు ఉంటాయి. నెట్‌లో జేఆర్‌ఎఫ్ పొంది పీహెచ్‌డీ చేసేవారికి మొదటి రెండేళ్లు నెలకు రూ. 16,000, తర్వా త మూడేళ్లు నెలకు రూ.18,000 ఫెలోషిప్ ఇస్తారు. వివిధ సెమినార్లకు హాజరయ్యేందుకు, పరికరాల కొనుగోలుకు ఏడాదికి రూ.20,000 కాంటిన్‌జె న్సీ గ్రాంట్ కూడా అందిస్తారు. బీఎస్సీ ఉత్తీర్ణులు సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్ వంటి పరీక్షలు రాసుకోవచ్చు. ఇంకా సాధారణ డిగ్రీ అర్హతగా ఉండే అన్ని కొలువుల్లో చేరొచ్చు.

సిటీలో పరిశోధన సంస్థలు
మెడికల్ హబ్, ఫార్మా హబ్, ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన భాగ్యనగరంలో దాదాపు 100కుపైగా పరిశోధన సంస్థలున్నాయి. వీటిలో అత్యధికం సైన్స్, సంబంధిత పరిశోధన సంస్థలే. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటివి ఉన్నాయి. ఇవేకాకుండా డీఆర్‌డీవో పరిశోధన సంస్థలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ తదితర సంస్థలు నగరంలోనే కొలువుదీరాయి. సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఫర్) కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ సంస్థల్లో సైన్స్‌లోని వివిధ విభాగాల్లో ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతున్నాయి.

సైన్స్ కోర్సులతో మంచి కొలువులు
‘‘ప్రపంచీకరణ నేపథ్యంలో సైన్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి విస్తృత అవకాశాలున్నాయి. ఇతర కోర్సులతో పోలిస్తే సైన్స్ అభ్యర్థులు బోధనలో, పరిశోధనల్లో ఎక్కువగా రాణిస్తున్నారు. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, మ్యాథమెటికల్ మోడలింగ్ తదితర విభాగాల్లో సైన్స్ అభివృద్ధి వేగంగా జరుగుతోంది. తాజాగా మామ్(మార్స్ ఆర్బిటార్ మిషన్) విజయం సైన్స్ నిపుణుల కృషి ఫలితమే. కాబట్టి సైన్స్ నిపుణులు లేని ఏ రంగాన్నీ ఊహించలేం. సెన్సెక్స్ లోనూ మ్యాథమెటికల్ మోడల్స్ రూపొందించడానికి సైన్స్ నిపుణులు అవసరం. దాదాపు అన్ని యూనివర్సిటీలు సెన్సైస్‌లో యూజీ, పీజీ కోర్సుల నుంచి పీహెచ్‌డీ కోర్సుల వరకు ఆఫర్ చేస్తున్నాయి. సైన్స్ రంగంలో పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర ప్రత్యేక విద్యాసంస్థలూ సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. కాబట్టి ఆసక్తికి అనుగుణంగా సైన్స్ కెరీర్‌ను ఎంచుకుంటే మంచి కొలువులు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లో అర్హత సాధించి ప్రభుత్వ విభాగాల్లో ఉన్నత స్థాయి హోదాల్లో చేరొచ్చు. మంచి గణిత, తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్నవారు కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు’’
డాక్టర్. టి.పార్థసారథి, ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
Published date : 26 Sep 2014 04:43PM

Photo Stories