Skip to main content

భవిష్యత్తుకు భరోసా...భౌతికశాస్త్రం !

దేశం ప్రగతిబాటలో నడవాలంటే శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ఎంతో ముఖ్యం. దేశాభివృద్ధితో ముడిపడి ఉన్న ప్రతి అంశంలోనూ ఫిజిక్స్ అవసరం ఉంటుంది.
యంత్రాలు, పరికరాలు, విద్యుత్, అంతరిక్షం.. ఇలా ఫిజిక్స్ విశ్వవ్యాప్తమైంది. సబ్జెక్టు కొంచెం కష్టమైనప్పటికీ దానిపై పట్టుసాధిస్తే అవకాశాలు సొంతం చేసుకోవడం సులువే. భౌతికశాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఉన్నతవిద్య పూర్తిచేయడం ద్వారా మంచి ఉద్యోగాలు సొంతం చేసుకోవడమే కాకుండా పరిశోధనా రంగంలోనూ రాణించొచ్చు.

ఫిజిక్స్‌పై ప్రత్యేక అభిరుచి ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో అది ఒక సబ్జెక్టుగా ఉన్న గ్రూప్ తీసుకోవాలి. ఆ తర్వాత బీటెక్ ఫిజికల్ సెన్సైస్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ లేదా ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ చేయొచ్చు. లేదంటే నాలుగేళ్ల బీఎస్/మూడేళ్ల బీఎస్సీ కోర్సుల్లోనూ చేరొచ్చు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల ద్వారా ప్రముఖ సంస్థల్లో ఫిజిక్స్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఇంటర్ విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్, డిగ్రీ విద్యార్థులు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్), పీజీ విద్యార్థులు జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్) తదితర పరీక్షలు రాసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ఐఐటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సుల్లో చేరొచ్చు. అలాగే జామ్ ద్వారా ఎంఎస్సీ ఫిజిక్స్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ఐఐఎస్సీ, ఐఐటీల్లో ప్రవేశం లభిస్తుంది. జెస్ట్ ద్వారా పరిశోధనా సంస్థలు, ప్రత్యేక విద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరొచ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ :
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరు ఫిజిక్స్‌లో నాలుగేళ్ల బీఎస్ కోర్సు అందిస్తోంది.
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సు అందిస్తోంది.
  • ఐఐటీ కాన్పూర్ ఫిజిక్స్‌లో బీఎస్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది.
  • ఐఐటీ మద్రాస్.. ఫిజిక్స్‌లో బీఎస్, ఎంఎస్ ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ అందిస్తోంది.
  • ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సు అందుబాటులో ఉంది.
జామ్ :
ఐఐటీ ఢిల్లీ, గాంధీనగర్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ, రోపార్‌లో రెండేళ్ల ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సు నిర్వహిస్తున్నారు. కాన్పూర్ ఐఐటీలో అదనంగా ఫిజిక్స్‌లో ఎంఎస్సీ పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ కూడా ఉంది. ఐఐఎస్సీ బెంగళూరు ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలో ప్రవేశం కల్పిస్తోంది. ఈ సంస్థల్లో ఎక్కడ చేరాలన్నా ఐఐటీలు ఏటా నిర్వహించే జామ్ రాయడం తప్పనిసరి.

నెస్ట్ :
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్), భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) రాయాలి.

జెస్ట్ :
ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్) మార్గం. ఈ పరీక్ష ద్వారా దేశంలో పరిశోధన రంగంలో ప్రసిద్ధి చెందిన సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో చాలా సంస్థలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ)కి అనుబంధంగా ఉన్నవే. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్- ముంబై, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్-బెంగళూరు, హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- అలహాబాద్, ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ- అహ్మదాబాద్, ఎస్‌ఎస్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సెన్సైస్- కోల్‌కతా, జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ స్టడీస్-బెంగళూరు వంటి సంస్థల్లో జెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ రెండేళ్ల ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సు అందిస్తోంది.
వెబ్‌సైట్: www.bitsadmission.com

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్, రెండేళ్ల ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సు అందిస్తోంది.
వెబ్‌సైట్: www.uohyd.ac.in

నిట్ దుర్గాపూర్, తిరుచురాపల్లి, అగర్తల, జైపూర్ ఇలా పలు సంస్థల్లో ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సు అందుబాటులో ఉంది. అయితే ఇవన్నీ ఉమ్మడిగా ప్రవేశం కల్పించడం లేదు. వేటికవే ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..
1. ఆంధ్రా యూనివర్సిటీ :

కోర్సులు: ఎంఎస్సీ- ఫిజిక్స్, స్పేస్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, మెటియోరాలజీ, ఫిజికల్ ఓషియనోగ్రఫీ, జియోఫిజిక్స్, మెరైన్ జియోఫిజిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

2. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ :

కోర్సు: ఎంఎస్సీ- ఫిజిక్స్.
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in

3. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ :
కోర్సు: ఎంఎస్సీ- ఫిజిక్స్.
వెబ్‌సైట్: www.svuniversity.edu.in

4. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ :
కోర్సు: ఎంఎస్సీ-ఫిజిక్స్
వెబ్‌సైట్: www.skuniversity.org

5. ఉస్మానియా యూనివర్సిటీ :
కోర్సులు:
ఎంఎస్సీ-ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, జియోఫిజిక్స్.
వెబ్‌సైట్: www.osmania.ac.in

6. కాకతీయ యూనివర్సిటీ :
కోర్సు:
ఎంఎస్సీ-ఫిజిక్స్.
వెబ్‌సైట్: www.kakatiya.ac.in

పోస్ట్ ఎంఎస్సీ కోర్సులు..
ఎంఎస్సీ (ఫిజిక్స్) చేసిన అభ్యర్థులు ఎంటెక్ (అట్మాస్ఫిరియక్ సైన్స్), ఎంటెక్- బయోమెడికల్, ఫిజిక్స్ అప్లైడ్ ఆప్టిక్స్, లేజర్‌టెక్, మెటీరియల్ సైన్స్, న్యూక్లియర్ ఇంజనీరింగ్ అండ్ టెక్, ఫైబర్ ఆప్టిక్స్ అండ్ లైట్, మెటీరియల్ సైన్స్, సాలిడ్‌స్టేట్ ఫిజిక్స్, ఫిజిక్స్ అండ్ మెటీరియల్ అట్మాస్పియరిక్ సైన్స్ అండ్ టెక్ తదితర సబ్జెక్టులు చదవొచ్చు. పరిశోధన కోర్సులు చేయొచ్చు.

కె రీర్ అవకాశాలు..
ఫిజిక్స్‌లో పీజీ పూర్తిచేసిన వారు నెట్ జేఆర్‌ఎఫ్ ద్వారా పీహెచ్‌డీలో చేరొచ్చు. ఈ సమయంలో మొదటి రెండేళ్లు నెలకు రూ.25 వేల చొప్పున, తర్వాత రెండేళ్లు నెలకు రూ.28 వేల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. నెట్‌లో అర్హత సాధించిన వారు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు పోటీ పడొచ్చు. టెలికమ్స్, ఎలక్ట్రానిక్స్ నుంచి డిఫెన్స్ వరకు ఫిజిక్స్ అప్లికేషన్స్ అవసరం. ఈ కారణంగా ఫిజిక్స్‌లో కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలకు కొదవలేదు. టెలికమ్యూనికేషన్స్, రక్షణశాఖ, ఆస్పత్రులు, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఎండీసీ, గ్రౌండ్ వాటర్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్స్, మైనింగ్ క్వారీలు, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ తదితర విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. స్వయం ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి.

స్పెషలైజేషన్లు..
ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్: ఇది ఇండస్ట్రీ ఓరియెంటెడ్ కోర్సు. దీనిలో మేనేజ్‌మెంట్ అంశాలు కూడా ఉంటాయి. వీరికి సాధారణంగా 4-6 వారాల పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. సిమెంట్, ఫెర్టిలైజర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అవసరమున్న పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్/సాలిడ్‌స్టేట్ అండ్ మెటీరియల్ సైన్స్: కాకతీయ, ఉస్మానియా, ఆంధ్రా వర్సిటీల్లో ఈ స్పెషలైజ్డ్ కోర్సు చదవొచ్చు. ఎంఎస్సీ తర్వాత పీహెచ్‌డీ చేయాలనుకున్న వారికి ఇది మంచి ఎంపిక. ప్రపంచంలో చాలా మంది రీసెర్చ్ విషయంలో సాలిడ్ స్టేట్ అండ్ మెటీరియల్ సైన్స్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వీరికి అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి.
న్యూక్లియర్ ఫిజిక్స్: ఎంఎస్సీలో ఈ స్పెషలైజేషన్ దాదాపు అన్నీ వర్సిటీల్లోనూ ఉంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, న్యూక్లియర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్లలో తొలుత ట్రైయినీ సైంటిస్టుగా తీసుకుని తర్వాత ఉద్యోగాల్లో నియమిస్తారు.
స్పేస్ ఫిజిక్స్/స్పేస్ ఇంజనీరింగ్ అండ్ రాకెటరీ: ఈ స్పెషలైజేషన్ చదివిన వారికి స్పేస్ రీసెర్చ్ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. వీరు స్పేస్ శాటిలైట్స్, రాకెటరీ, స్పేస్ వెహికల్స్, స్పేస్ ప్రోగ్రామ్, డేటా అనాలసిస్ తదితర అంశాలను చదువుతారు. ఆంధ్రా యూనివర్సిటీ ఎంఎస్సీ-స్పేస్ ఫిజిక్స్ మూడు సంవత్సరాల కోర్సును ఆఫర్ చేస్తోంది.
ఆస్ట్రో ఫిజిక్స్: సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలను అధ్యయనం చేయడానికి పనికొచ్చే సబ్జెక్టు ఇది. ఉస్మానియా వర్సిటీ ఈ కోర్సును అందిస్తోంది. పీహెచ్‌డీ కూడా చేయొచ్చు. ఈ కోర్సు చేసిన వారికి మన దేశంలో కంటే విదేశాల్లో ఆదరణ ఎక్కువ.
బయో ఫిజిక్స్: ఫిజిక్స్‌ను జీవశాస్త్రానికి అన్వయించేదే బయో ఫిజిక్స్. ఈ స్పెషలైజేషన్ చేసిన వారికి మెడికల్ లేబొరేటీరీల్లో ఉపాధి లభిస్తుంది. సొంతంగా ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేయొచ్చు.
ఫైబర్ ఆప్టిక్స్: ఈ కోర్సు టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్‌కు బాగా ఉపయోగపడుతోంది.
జియో ఫిజిక్స్: భూమి లోపలి భాగాల్లోని లోహాలు, ఇంధనాలు తదితరాలను వెలికితీయడం జియోఫిజిక్స్ పరిధిలోకి వస్తుంది. అన్ని వర్సిటీలు ఫిజిక్స్‌లో స్పెషలైజ్డ్ సబ్జెక్టుగా అందిస్తున్నాయి. వీరికి ఓఎన్‌జీసీ, భూగర్భ పరిశోధనా సంస్థల్లో, మెరైన్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్లలోనూ ఉద్యోగాలు లభిస్తాయి.
Published date : 11 Apr 2018 06:07PM

Photo Stories