Skip to main content

కెరీర్ గైడెన్స్.. సైన్స్ స్ట్రీమ్

పరిశోధనలకు ఆస్కారం.. సృజనాత్మకతకు అవకాశం ఉన్న రంగాల్లో ప్రముఖమైంది సైన్స్. నేచురల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ ఇలా పలు శాఖలుగా విస్తరించిన సైన్స్ ప్రపంచంలో.. స్థిరపడడానికి మార్గాలెన్నో.. పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సులను చదవడం ద్వారా భావి సైంటిస్టులుగా ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం. ఇప్పటి వరకు ఇల్ నెస్ విభాగానికే పరిమితమైన పరిశోధనలు.. భవిష్యత్తులో ‘వెల్‌నెస్’ విభాగంలోనూ ఊపందు కోనున్న తరుణంలో.. రాబోయే శతాబ్దం సైన్స్‌దే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెరీర్ పరంగా సైన్స్ స్ట్రీమ్‌పై ఫోకస్..

సాధారణంగా సైన్స్‌లో భవిష్యత్తు కోరుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్ నుంచే పునాదులు వేసుకోవడం సముచితం. దీనివల్ల సబ్జెక్ట్‌పై అవగాహనతోపాటు ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో విద్యార్థుల ముందున్న అవకాశాలు..

సబ్జెక్టులు.. అవకాశాలు:
పదో తరగతి తర్వాత +2 స్థాయిలో సైన్స్ కోర్సు చదవడానికి ఉన్న మార్గం బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూప్. గతంలో డిగ్రీలో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వంటి సంప్రదాయ ఆప్షన్స్ ఉండేవి. కానీ ప్రస్తుతం పలు రకాల కాంబినేషన్స్‌తో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫారెస్ట్రీ, బయోఇన్ఫర్మాటిక్స్, న్యూట్రిషన్, హోమ్‌సైన్స్ వంటి పలు నూతన కోర్సులను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సును అందిస్తుంది. ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా సైన్స్ రంగంలో సమున్నత కెరీర్‌కు మార్గం సుగమవుతుంది.

ఉన్నత విద్య:
సైన్స్ విద్యార్థులకు కె రీర్ పరంగా కీలక దశ పీజీ. కాబట్టి ఈ స్థాయిలో ఎంచుకున్న బ్రాంచ్ విద్యార్థి భావి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పీహెచ్‌డీ ఉండడం కెరీర్ పరంగా విస్తృత అవకాశాలకు వారధిగా నిలుస్తుంది. పీజీ కోర్సులతోపాటు కొన్ని వర్సిటీలు ఇంటిగ్రేటెడ్-ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ వంటి కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

సైన్స్ విద్యార్థులకు కోర్సుల వారీగా ఉండే సబ్జెక్టులు:
ఇంటర్మీడియెట్: బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
బ్యాచిలర్ డిగ్రీ: ఈ స్థాయిలో పలు రకాల కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. వర్సిటీల వారీగా అప్షనల్ కాం బినేషన్స్ కోసం ఆయా వర్సిటీల వెబ్‌సైట్లను చూడొచ్చు.

ఎంఏస్సీ:
మాస్టర్స్ స్థాయిలో సైన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆప్షన్స్.. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ(ఇన్‌ఆర్గానిక్/ఆర్గానిక్/ఫిజికల్ ఆర్గానిక్/ఫిజికల్/అనలిటికల్/ఫార్మాస్యుటికల్/ఫార్మకోఇన్ఫర్మాటిక్స్), జీయాలజీ, జాగ్రఫీ, ఫిజిక్స్, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, అప్లయిడ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, క్లినికల్ న్యూట్రిషన్ డైటిక్స్, సీడ్ టెక్నాలజీ, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, ఫోర్సెనిక్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ జియోకెమిస్ట్రీ, నానోసైన్స్ తదితరాలు.

ప్రవేశం:
మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, జాతీయ స్థాయిలో సెంట్రల్ వర్సిటీలుపై పేర్కొన్న కాంబినేషన్స్‌లో ఎంఎస్సీ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి సాధారణంగా మార్చి/ఏప్రిల్‌లలో నోటిఫికేషన్ వెలువడుతుంది. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.

పీహెచ్‌డీ కోర్సులు:
లైఫ్ సెన్సైస్ పీహెచ్‌డీలు:
బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయాలజీ, సెల్‌బయాలజీ, ఎకాలజీ, ఎవల్యూషనరీ బయాలజీ, జెనెటిక్స్, జీనోమిక్స్, న్యూరో బయాలజీ, న్యూరోసైన్స్, ఫిజియాలజీ తదితర విభాగాలు.

ఫిజికల్ సెన్సైస్ అండ్ మ్యాథమెటిక్స్ పీహెచ్‌డీ ప్రోగ్రాంలు:
అప్లయిడ్ మ్యాథమెటిక్స్, ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ, కెమిస్ట్రీ, ఎర్త్ సెన్సైస్, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్ సెన్సైస్, మెటీయరాలజీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ తదితరాలు.

హెల్త్ సెన్సైస్ పీహెచ్‌డీ ప్రోగ్రాంలు:
ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, టాక్సికాలజీ తదితరాలు.
అగ్రికల్చరల్ సెన్సైస్ పీహెచ్‌డీ ప్రోగ్రాంలు: ఫారెస్ట్రీ అండ్ ఫారెస్ట్ సెన్సైస్, ప్లాంట్ సెన్సైస్, ఫుడ్ సైన్స్ తదితరాలు.

ప్రవేశం:
మన రాష్ట్రంలో అన్ని వర్సిటీలు, జాతీయ స్థాయిలో సెంట్రల్ వర్సిటీలు సైన్స్‌లో పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పీహెచ్‌డీ చేసిన తర్వాత యూనివర్సిటీలు, పీజీ కళాశాలలు, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్‌లో లెక్చరర్‌‌స, రీడర్‌‌సగా, ప్రొఫెసర్‌‌స, హెచ్‌ఓడీ వంటి వివిధ హోదాల్లో స్థిర పడొచ్చు. హోదాను బట్టి వేతనాలు రూ. 15,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉంటున్నాయి. విదేశాల్లోను అవకాశాలుంటాయి.

ఐఐటీల్లో..ఎంఎస్సీ:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్(ఐఐటీ)ల్లోనూ ఎంఎస్సీ చేసేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్) ఎంట్రెన్స్‌కు హాజరు కావాలి. దీనికి అర్హత సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్. ఈ పరీక్ష ఆధారంగా ఎంఎస్సీ, జాయింట్ ఎంఎస్సీ- పీహెచ్‌డీ, ఎంఎస్సీ- పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ, పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను చదివే అవకాశం ఉంది. జామ్ నోటిఫికేషన్ సాధారణంగా సెప్టెంబర్/అక్టోబర్/ నవంబర్‌ల్లో వెలువడుతుంది.

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్):
ఈ ఇన్‌స్టిట్యూట్ పలు రకాల కాంబినేషన్స్‌తో పీజీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. దేశ వ్యాప్తంగా నిర్వహించే రాత పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏడాది మార్చిలో వెలువడుతుంది. జూలైలో ఎంట్రెన్స్ ఉంటుంది.
వివరాలకు: www.aiims.edu

ఆల్ ఇండియూ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్:
పీజీ స్థాయిలో బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆల్ ఇండియూ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ప్రాతిపదికగా దేశంలోని దాదాపు 32 వర్సిటీలు ప్రవేశం కల్పిస్తున్నారు.
వెబ్‌సైట్: www.jnu.ac.in

ఇంటిగ్రేటెడ్ కోర్సులు:
ఇంటర్మీడియెట్ అర్హతతో డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఇంటిగ్రేటెడ్ కోర్సులు. రాష్ట్రంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న వర్సిటీలు..
ఆదికవి నన్నయ వర్సిటీ- రాజమండ్రి
కోర్సులు: ఎంఎస్ బయోటెక్నాలజీ, ఎంఎస్ మైక్రోబయాలజీ
వెబ్‌సైట్: www.nannayauniversity.info

ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
కోర్సులు: ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీ
వెబ్‌సైట్: www.osmania.ac.in

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
కోర్సులు: ఎంఎస్సీ కెమికల్‌సెన్సైస్/బయాలజీ
వెబ్‌సైట్: www.uohyd.ernet.in

ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ:
డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ చేసే అవకాశాన్ని కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కల్సిస్తున్నాయి. ఈ కోర్సులనే ఇంటిగ్రెటెడ్ పీహెచ్‌డీలుగా వ్యవహరిస్తారు. వివరాలు..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ)-బెంగళూరు- ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. సంబంధిత నోటిఫికేషన్ జనవరి/ఫిబ్రవరిలలో వెలువడుతుంది.
వెబ్‌సైట్: www.iisc.ernet.in

జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జెఎన్‌సీఏఎస్‌ఆర్)-బెంగళూరు-ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. సంబంధిత నోటిఫికేషన్ జనవరి/ఫిబ్రవరిలలో వెలువడుతుంది.
వెబ్‌సైట్: www.jncasr.ac.in

స్పెషలైజేషన్స్-కెరీర్స్
జువాలజీ:
జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జువాలజీ. ఈ విభాగంలో మాస్టర్స్ కోర్సు చేసిన వారికి ‘జూ’, వైల్డ్‌లైఫ్ సర్వీసెస్, బొటానికల్ గార్డెన్స్, నేచర్ రిజర్వ్స్, వివిధ పరిశోధన సంస్థలలో.. పలు హోదాల్లో స్థిరపడొచ్చు.

కెమిస్ట్రీ:
ప్రస్తుతం క్రేజీ సబ్జెక్ట్ కెమిస్ట్రీ. పీజీ తర్వాత బోధన రంగంతోపాటు పరిశ్రమల్లోనూ సమాన అవకాశాలు ఉండడంతో చాలా మంది కెమిస్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నారు. వివిధ ఫార్మాస్యుటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, బెవరేజెస్ కంపెనీల్లో క్వాలిటీ కంట్రోల్, ఆర్ అండ్ డీ, ప్రొడక్షన్ తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి.

బయోటెక్నాలజీ:
గత దశాబ్ద కాలంగా ఎన్నో కొత్త కోర్సులు ప్రారంభమయ్యాయి. అలాంటి వాటిలో బయోటెక్నాలజీ ఒకటి. మెడికల్ బయోటెక్నాలజీ, అగ్రి బయోటెక్ రంగాల్లో ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటాయి. మొత్తం బయోటెక్ రంగంలో 70 శాతం ఆదాయం.. మెడికల్ బయోటెక్ నుంచే వస్తుంది. మెడికల్ బయోటెక్‌లో శాంతా బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ, రాన్‌బాక్సీ, వోకార్ట్ వంటి ప్రముఖ సంస్థలున్నాయి.

జెనెటిక్స్:
జీవుల్లో జన్యువులకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేసే శాస్త్రమే జెనెటిక్స్(జన్యుశాస్త్రం). హ్యుమన్ జెనెటిక్స్,మాలిక్యులర్ జెనెటిక్స్,మెడికల్ జెనెటిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఇందులో ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ రంగంతో ముడిపడి ఉన్న పరిశ్రమల్లో అవకాశాలుంటాయి.

బోటనీ:
వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే బోటనీ. ఈ విభాగంలో మాస్టర్స్ కోర్సు చేసిన తర్వాత వృక్ష సంబంధ సంస్థల్లో ఎన్విరాన్‌మెంట్ కన్సల్టెంట్స్, ప్లాంట్ ఎక్స్‌ప్లోరర్స్, ఎకాలజిస్ట్, పార్క్ రేంజర్, ఫారెస్టర్, నర్సరీ మేనేజర్, ప్లాంట్ బయోకెమిస్ట్, ప్లాంట్ ఫాథాలాజిస్ట్, ఫార్మింగ్ కన్సల్టెంట్ హోదాలో అవకాశాలుంటాయి.

మైక్రోబయాలజీ:
సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రమే మైక్రోబయాలజీ. ఈ కోర్సులో మెడికల్ మైక్రోబయాలాజిస్ట్‌లు, అగ్రికల్చరల్ మైక్రో బయాలాజిస్ట్‌లు, ఇండస్ట్రియల్ బయాలజిస్ట్‌లు, జనరల్ బయాలజిస్ట్‌లు వంటి సబ్ కేటగిరిలు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, పరిశోధన సంస్థలు, ఫార్మాస్యుటికల్, ఫుడ్, బెవరేజ్, కెమికల్ పరిశ్రమల్లో ఉద్యోగాలుంటాయి. సొంతంగా డయాగ్నోస్టిక్ సెంటర్‌‌సను నిర్వహించుకోవచ్చు.

ఫోరెన్సిక్ సైన్స్:
ఏదైనా నేరం జరిగిన వెంటనే..అవసరమైన డీఎన్‌ఏ శాంపిల్స్ కోసం నేరం జరిగిన చోట లభించే ఆధారాలు, అనుమానితుల నుంచి వేలిముద్రలు సేకరించే పనిని ఫోరెన్సిక్ నిపుణులు మాత్రమే చేయగలరు. ఉస్మానియా విశ్వ విద్యాలయం-ఎంఎస్సీ(ఫోరెన్సిక్ సైన్స్) అందిస్తోంది.
వెబ్‌సైట్: www.osmania.ac.in.

దేశంలోని ప్రముఖ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు)
వెబ్‌సైట్: www.iisc.ernet.in/

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ (భువనేశ్వర్)
వెబ్‌సైట్: www.iopb.res.in/

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (ముంబై)
వెబ్‌సైట్: www.barc.ernet.in/

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.uohyd.ac.in

స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ,జేఎన్‌యూ
వెబ్‌సైట్: www.jnu.ac.in/

స్కూల్ ఆఫ్ బయో టెక్నాలజీ బీహెచ్‌యూ
వెబ్‌సైట్: www.bhu.ac.in

లయోలా కాలేజ్ (చెన్నై)
వెబ్‌సైట్: www.loyolacollege.edu/

సెయింట్ జేవియర్స్ కాలేజ్ (ముంబై)
వెబ్‌సైట్: www.xaviers.edu/

సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ
వెబ్‌సైట్: www.ststephens.edu

ఫెర్గ్యూసన్ కాలేజ్, పుణే
వెబ్‌సైట్: www.fergusson.edu

మౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగళూరు
వెబ్‌సైట్: www.mountcarmelcollegeblr.co.in

మద్రాస్ క్రిష్టియన్
వెబ్‌సైట్: www.mcc.edu.in

క్రిష్ట్ కాలేజ్-బెంగళూరు
వెబ్‌సైట్: www.christcollege.edu
Published date : 15 Oct 2012 06:41PM

Photo Stories