Skip to main content

భవ్యమైన కెరీర్‌కు రాచబాట.. నెస్ట్‌

ఇంటర్మీడియెట్ తర్వాత అధిక శాతం మంది విద్యార్థుల చూపు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వైపే.. అలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తే ఎన్నో చక్కని అవకాశాలు కనిపిస్తాయి.. తద్వారా భవ్యమైన కెరీర్‌కు బాటలు వేసుకోవచు. శాస్త్రసాంకేతిక రంగంలో ఎన్నో చిక్కుముడులకు సమాధానాన్ని అన్వేషించే పరిశోధన కార్యకలాపాల్లో పాలుపంచుకునే అవకాశాలు కల్పిస్త్తుంది.. నెస్ట్ (నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్). ఈ పరీక్ష ద్వారా దేశంలోని మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సీ)లో ప్రవేశాన్ని ఖాయం చేసుకోవచ్చు.

సైన్స్ పట్ల అమితాసక్తి కలిగి శాస్త్ర, పరిశోధన రంగాల్లో ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించే విద్యార్ధులకు చక్కని వేదిక నెస్ట్ (నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్). దేశంలో విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించడానికి.. శాస్త్రీయ వైఖరులను పెంపొందించేందుకు నెస్ట్‌కు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో మొదటి సారిగా 2007లో ఈ పరీక్షను నిర్వహించారు.

పెరిగిన పోటీ:
గతంతో పోల్చితే ప్రస్తుతం నెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2009లో 70 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సారి హాజరయ్యే విద్యార్థుల సంఖ్య లక్షపైగానే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో విద్యార్థుల స్పందనను దృష్టిలో ఉంచుకుని నైసర్ కూడా సీట్లను క్రమంగా పెంచుతోంది. గతేడాది 60 సీట్లు ఉండగా..ఈ సారి సీట్లను 100కు పెంచారు. అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్-ముంబై కూడా సీట్ల సంఖ్యను 35కు పెంచింది.

పరీక్ష ఇలా:
పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎన్‌సీఆర్‌టీఈ/సీబీఎస్‌ఈ 11, 12వ తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు రూపొందిస్తారు. ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి. మొత్తం మార్కులు 200. ప్రతి విభాగానికి 50 మార్కులు కేటాయించారు. వీటికి మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
  • సెక్షన్-1 అందరికీ కామన్. ఇందులో విద్యార్థుల అవగాహనను పరీక్షించే విధంగా జనరల్ సైన్స్, రీజనింగ్, కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు.
  • సెక్షన్-2 నుంచి 5 వరకు ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి నాలుగు విభాగాల్లో ప్రశ్నలు ఇస్తారు. ఈ నాలుగు విభాగాల్లో ఏవైనా మూడు విభాగాలకు మాత్రమే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులోని ప్రశ్నలు విద్యార్థుల విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, గ్రహణ శక్తిని పరీక్షించే విధంగా ఉంటాయి. ఈ విభాగాలకు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలకు అన్ని సరైన సమాధానాలను గుర్తించినప్పుడే మార్కులు కేటాయిస్తారు.
ప్రయోజనాలు:
  • నైసర్, సీఈఎస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులో చేరిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందజేసే (నెలకు రూ. 5 వేలు) ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్‌నకు అర్హత లభిస్తుంది. సమ్మర్ ప్రాజెక్ట్‌కు రూ. 20 వేల గ్రాంట్ ఇస్తారు.
  • చివరి సెమిస్టర్‌లో విద్యార్థులు సాధించిన గ్రేడ్ల ఆధారంగా బార్క్ ట్రైనింగ్ స్కూల్ అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు. బార్క్‌లో ఏడాది శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని బార్క్, రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, వేరీబుల్ ఎనర్జీ సైక్లోట్రోన్ సెంటర్ వంటి సంస్థల్లోని ఆర్ అండ్ డీ విభాగంలో రిక్రూట్ చేసుకుంటారు.
ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు:
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-భువనేశ్వర్
  • సెంటర్ ఫర్ ఎక్సలెన్స్-డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (ముంబై యూనివర్సిటీ)
  • ఇంటిగ్రేటెడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్,విశ్వభారతి-శాంతినికేతన్
ఆఫర్ చేసే కోర్సు:
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ

ముఖ్య తేదీలు:
ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
మార్చి 8, 2014
అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్: ఏప్రిల్ 8, 2014
రాత పరీక్ష తేదీ: మే 31, 2014
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ఫలితాలు వెల్లడి: జూన్ 20, 2014.
వెబ్‌సైట్: www.nestexam.in

నెస్ట్-2014 సమాచారం:
అర్హత:
60 శాతం మార్కులతో 12వ తరగతి/తత్సమానం (బయాలజీ/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ). చివరి సంవత్సరం, 2012,13 సంవత్సరం ఉత్తీర్ణులు కూడా అర్హులే.
వయసు: జనరల్, ఓబీసీ విద్యార్థులు
1994, జూలై 22 రోజు లేదా తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడీ విద్యార్థులకు ఐదేళ్ల వయోసడలింపునిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ రెండు విధాలుగా.
దరఖాస్తు: జనరల్/ఓబీసీ-రూ.700 (ఎస్సీ/ఎస్టీ/పీడీ-రూ.350)
  • జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష కాబట్టి జ్ఞాపకశక్తి కంటే అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • సాధ్యమైనన్నీ గత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. దీని వల్ల సమస్య పరిష్కారంలో వేగంతోపాటు కచ్చితత్వం అలవడుతుంది.
  • ముఖ్య ఫార్ములాలు, కీలక పాయింట్లపై క్రమ పద్ధతిలో అవగాహన పెంచుకోవడం మంచిది.
  • ఎంట్రెన్స్‌లో ఒకే ప్రశ్న కోసం ఎక్కువ సమయం కేటాయించడం మంచిది కాదు. సమాధానం తెలియకపోతే మరొక ప్రశ్నను ప్రయత్నించడం ఉత్తమం.
  • సెక్షన్ల వారీగా సమయ విభజన చేసుకోవాలి. విరామం, మైండ్ రిలాక్స్ కోసం 10 నిమిషాలు కేటాయించుకోవాలి. విపరీతమైన పోటీ ఉండే ఈ ఎంట్రెన్స్‌లలో ఈ పద్ధతి ఎంతో లాభం చేకూరుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉండే ప్రశ్నలను ముందు ఎంచుకోండి. వీటి పరిష్కారానికి తక్కువ సమయం పట్టడమే కాకుండా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మిగతా విభాగాలను ఆత్మవిశ్వాసంతో చేయడానికి ఇది ఉపకరిస్తుంది.
రిఫరెన్స్ బుక్స్: సబ్జెక్ట్‌ల వారీగా సీబీఎస్‌ఈ/ఎన్‌సీఆర్‌టీఈ పుస్తకాలు.

జనరల్
జనరల్ విభాగానికి ప్రత్యేకంగా ఎటువంటి సిలబస్‌ను పేర్కొనలేదు. ఆయా అంశాల్లో విద్యార్థుల అవగాహన స్థాయిని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. ఈ క్రమంలో ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌కు సంబంధించిన పరిణామక్రమం, ఆయా శాస్త్రాలపై ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. రీడింగ్ కాంప్రెహెన్షన్ నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఇచ్చే వ్యాసాలు కూడా సైన్స్ అంశాలాధారితంగా ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి కూడా కొన్ని ప్రశ్నలు ఇస్తారు. వీటిని సాధించడానికి 10వ తరగతి స్థాయి గణిత పరిజ్ఞానం అవసరం. గ్రాఫ్, వెన్‌డయాగ్రామ్ ఆధారిత ప్రశ్నలు కూడా వస్తాయి.

మ్యాథమెటిక్స్
ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, అనలిటికల్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, వెక్టార్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవి సాధారణంగా ఇంటర్మీడియెట్‌లో ఉండే అంశాలే. ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఎంసెట్, జేఈఈ వంటి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల దృష్టి కోణంలో ప్రిపరేషన్ సాగిస్తుంటారు. కాబట్టి ఆ తరహా విధానాన్నే నెస్ట్‌కు అనుసరించండి. ఎంసెట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్‌డ్) ముగిసిన తర్వాత (మే 31న) నెస్ట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత ప్రశ్నాపత్రాలను ఒక్కసారి పరిశీలిస్తూ సంబంధిత సమస్యలను ప్రాక్టీస్ చేయడం మంచిది. ప్రతి అంశంలో ఐపీఈ, ఎంసెట్, జేఈఈ స్థాయి ప్రశ్నలను క్రమంలో సాధన చేయాలి. వాటిని తార్కికంగా విశ్లేషించాలి.

ఫిజిక్స్
మెకానిక్స్, థర్మల్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష కాబట్టి ప్రాబ్లమ్ లేదా ఫార్ములా దృక్పథంతోనే కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రశ్నలు అడిగే ఆస్కారం ఎక్కువ. కాబట్టి మ్యాథమెటికల్ స్కిల్స్‌ను కూడా అలవర్చుకోవాలి. సిలబస్‌లోని అంశాలను సూత్రాలు, భావనలు, నిర్వచనాలపై పట్టు సాధించాలి. ఫిజిక్స్ పేరుకు థియరీ సబ్జెక్టయినప్పటికీ సమస్య సాధన ప్రక్రియలతో కూడిన సబ్జెక్ట్. ఒక సమస్య సాధనకు ఉపక్రమించే ముందు కచ్చితంగా సంబంధిత ప్రాథమిక భావనలు, సంబంధిత చాప్టర్‌లోని ఫార్ములా చార్ట్ ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకునుండాల్సిందే. ఫిజిక్స్‌లో కొన్ని చాప్టర్ల మధ్య అంతర్గత సంబంధం ఉంటుంది. ఉదాహరణకు ఎలక్ట్రో స్టాటిక్స్ చాప్టర్‌పై పరిపూర్ణ అవగాహన పొందితే అందులోని కాన్సెప్ట్‌లనే కొద్దిపాటి మార్పులతో గ్రావిటేషన్, మ్యాగ్నటిజం చాప్టర్లలో కూడా అన్వయించవచ్చు. థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్‌లో కొన్ని అంశాలు ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండింటిలోనూ ఉన్నాయి. వీటిని చదివేటప్పుడు ఆ రెండు సబ్జెక్టుల సిలబస్‌ను పరిశీలిస్తూ చదివితే సమయం ఆదా అవుతుంది. ఆప్టిక్స్ విషయంలో.. జామెట్రికల్ ఆప్టిక్స్ కంటే తక్కువ సిలబస్ ఉండే వేవ్ ఆప్టిక్స్‌ను ముందు పూర్తి చేయాలి. మెకానిక్స్‌లో అధికశాతం ప్రాబ్లమ్స్ ‘లా ఆఫ్ కన్జర్వేషన్’ ఆఫ్ ‘లీనియర్ మొమెంటమ్, ఎనర్జీ, యాంగ్యులర్ మొమెంటమ్‌లకు సంబంధించినవే. కాబట్టి విద్యార్థులు వీటికి సంబంధించిన సిద్ధాంతాలు, పరిమితులు, సూత్రాలపై బాగా అవగాహన ఏర్పరచుకోవాలి.

కెమిస్ట్రీ
కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అంశాలు నేర్చుకున్నంత త్వరగా విస్మృతికి దారి తీస్తాయి. దీంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మేటర్; సొల్యూషన్స్; యాసిడ్స్ అండ్ బేసెస్; ఎలక్ట్రో కెమిస్ట్రీ; థర్మో డైనమిక్స్; సాలిడ్ స్టేట్; కెమికల్ కెనైటిక్స్; ఈక్విలిబ్రియం; కెమికల్ ఎనర్జిటిక్స్ కీలకమైనవి. ఈ నేపథ్యంలో సంబంధిత సూత్రాలను, ముఖ్యమైన అంశాలను నిరంతరం ప్రాక్టీస్ చేయడం వాటిని కూడా పాయింటర్ అప్రోచ్‌లో రూపొందించుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మూలకాల సాధారణ ధర్మాల మధ్య పోలికలు, భేదాలను బేరీజు వేసుకుని వాటిని నోట్స్ రూపంలో పొందుపర్చుకోవాలి. ముఖ్యంగా ఆయా అంశాల తయారీలో ఇమిడిఉన్న ధర్మాలు ఉదాహరణకు ఎలక్ట్రోడ్స్; ఎలక్ట్రోలైట్స్; మూలకాలు; ఎలిమెంట్స్ వంటి వాటి విషయంలో టాబ్యులేషన్ అప్రోచ్ ఎంతో ఉపకరిస్తుంది.

బయాలజీ
బయాలజీ అంటే బోటనీ, జువాలజీ రెండు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెల్ బయాలజీ, అనాటమీ-ఫిజియాలజీ, ఎకాలజీ, బోటనీ, హ్యూమన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను అనుసరించి ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. కాబట్టి బోర్డ్ సిలబస్‌కు-నెస్ట్ సిలబస్‌కు స్వల్ప తేడాలు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో బోర్డ్ సిలబస్‌ను చదువుతున్నప్పుడే బోటనీ, జువాలజీకి సంబంధించి ఆయా అంశాలలో నెస్ట్ సిలబస్‌కు సంబంధించి ఏయే అంశాలు ఇమిడి ఉన్నాయో క్షుణ్నంగా పరిశీలించాలి. దానికి అనుగుణంగా తమ సాధన కొనసాగించాలి. ఉదాహరణ: కుందేలు-వ్యవస్థలు చదువుతున్నప్పుడే ఆయా వ్యవస్థలకు సంబంధించి మానవుల వివిధ వ్యవస్థలలోని తేడాలను జాగ్రత్తగా గమనించి ఆ వివరాలను ప్రత్యేకంగా క్రోడీకరించుకోవాలి. ఒక్కొక్క చాప్టర్‌లోఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలో ఉండి తెలుగు అకాడెమీ పుస్తకాలలో లేని విషయాలను గుర్తించి వాటికి సినాప్సిస్ సిద్ధం చేసుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఒక అంశానికి సంబంధించి సోదాహరణంగా వివరణలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మొత్తం అంశం నుంచి అవసరమైన దాన్ని గ్రహించే విధంగా రీడింగ్ స్పీడ్ పెంచుకోవాలి. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏఐపీఎంటీ), జిప్‌మర్, ఏఎఫ్‌ఎంసీ పరీక్షల గత అయిదారేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. దీనివల్ల జాతీయ స్థాయి ఎంట్రన్స్‌లలో అడిగే ప్రశ్నల క్లిష్టతపై అవగాహన వస్తుంది.

Published date : 18 Jan 2014 10:31AM

Photo Stories