Skip to main content

బయలాజికల్‌, ఫిజికల్‌ సెన్సైస్‌లో పీహెచ్‌డీ.. కెరీర్‌ అవకాశాలు

పరిశోధనలు.. ఓ దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పట్టుగొమ్మలు.. శోధించి సాధించిన ఫలాలు జాతి నిర్మాణానికి ప్రగతి రథ చక్రాలు.. ఇలాంటి పరిశోధనలతో కొత్త ఆవిష్కరణలను అందించే మేధావులను తయారు చేయడమే డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) అసలు లక్ష్యం. అకడెమిక్‌గా అత్యున్నత డిగ్రీ అయిన ‘పీహెచ్‌డీ’ చేసిన వారే దేశ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) పరిశ్రమ ప్రగతికి కీలకం. ఈ నేపథ్యంలో సైన్స్‌లో బయలాజికల్‌ సైన్‌‌స, ఫిజికల్‌ సైన్‌‌సలలో పరిశోధనలు, అవకాశాలు, పీహెచ్‌డీతో కెరీర్‌ స్కోప్‌పై విశ్లేషణ..

ప్రస్తుతం దేశంలో పరిశోధన, అభివృద్ధిపై ఖర్చు చేస్తున్న మొత్తం జీడీపీలో 0.9 శాతం మాత్రమే. దీన్ని 12వ పంచవర్ష ప్రణాళిక అంతానికి రెండు శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు పీహెచ్‌డీ డిగ్రీలు అందించేలా ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు పరిశ్రమలు, ఉన్నత విద్యాసంస్థలు కూడా పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ డిగ్రీకి సంబంధించిన ప్రోగ్రామ్‌ల్లో చేరే వారిసంఖ్య పెరుగుతోంది. కేవలం పేరు ముందు ‘డాక్టర్‌’ అని రాసుకోవడానికే పీహెచ్‌డీ అని కాకుండా పరిశోధన రంగం లో ఉన్నత స్థానాలను అందుకుంటూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్న కాంక్షతో పీహెచ్‌డీలోకి అడుగుపెడుతున్న వారు అధికమయ్యారు.

శోధనతోనే సమస్యకు పరిష్కారం:
పరిశోధనలతోనే ఓ సమస్యకు శాస్ర్తీయ పరిష్కారం సాధ్యమవుతుంది. ప్రపంచంలో జనాభా పరంగా రెండో పెద్ద దేశమైన భారత్‌లో ఆహార భద్రత కల్పించడం పెద్ద సవాలుగా ఉంది. ఈనేపథ్యంలో పంటల దిగుబడిని పెంచడానికి కొత్త వంగడాల సృష్టి, మెరుగైన చీడపీడల నివారణ మందుల తయారీ వంటివి అవసరం. ప్రజారోగ్యానికి సంబంధించి మెరుగైన చికిత్సా విధానాలు, ఔషధాలను ఆవిష్కరించాల్సి ఉంది. అందుకే సైన్స్‌లో పరిశోధనలకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. కొత్త ప్రాజెక్టులతో వెళ్లేవారిని ఆహ్వానించేందుకు పరిశోధన సంస్థలు, పరిశ్రమలూ సిద్ధంగా ఉన్నాయి. పీజీ తర్వాత నెట్‌, జెస్ట్‌ ద్వారా పీహెచ్‌డీలో ప్రవేశాలు లభిస్తాయి.

పీహెచ్‌డీ-రీసెర్చ్‌ అంశాలు:
ఫిజికల్‌ సెన్సైస్‌: ఆస్ట్రోఫిజిక్స్‌, అట్మాస్ఫియరిక్‌ ఫిజిక్స్‌, అటామిక్‌ అండ్‌ మాలిక్యులర్‌ ఫిజిక్స్‌, ఎక్స్‌పెరిమెంటల్‌ కండెన్స్‌డ్‌ మ్యాటర్‌ ఫిజిక్స్‌, థీరిటికల్‌ కండెన్స్‌డ్‌ మ్యాటర్‌ ఫిజిక్స్‌, హై ఎనర్జీ ఫిజిక్స్‌ మొదలైనవి.

కెమిస్ట్రీ: ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బయలాజికల్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, మెటీరియల్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ కెమిస్ట్రీ మొదలైనవి.

బయలాజికల్‌ సెన్సైస్‌: బయోటెక్నాలజీ అండ్‌ బయోమెడిసిన్‌, జెనిటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌, సెల్‌ బయాలజీ అండ్‌ డెవలప్‌మెంట్‌, మాలిక్యులర్‌ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్‌ బయోఫిజిక్స్‌, బయోఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ థియరెటికల్‌ బయాలజీ.

ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ:
డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతో పాటు పీహెచ్‌డీ చేసే అవకాశాన్ని కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కల్పిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలుగా వ్యవహరిస్తారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌.. బయలాజికల్‌, ఫిజికల్‌ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌- భువనేశ్వర్‌ కూడా పలు కోర్సుల్లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలను ఆఫర్‌ చేస్తున్నాయి.

పరిశోధకులకు అండగా ఫెలోషిప్‌:
దేశంలో ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలతో పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతి నెలా ఫెలోషిప్‌ పొందుతూ పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు, దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు/ ఐఐటీలు, నిట్‌లలో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలనుకునే వారికి నిర్వహించే పరీక్ష జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది.

-నెట్‌లో మంచి ర్యాంకు సాధిస్తే జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) పొందడంతో పాటు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ చేయడానికి మార్గం ఏర్పడుతుంది.

-జేఆర్‌ఎఫ్‌ సాధించిన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.16 వేలు చెల్లిస్తారు. ఏడాదికి ఒకసారి కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌గా రూ.20 వేలు ఇస్తారు. ఆ తర్వాత పరిశోధనలో ప్రగతి, ఇంటర్వ్యూ ఆధారంగా మూడో సంవత్సరంలో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌) హోదా కల్పించి నెలకు రూ.18 వేలు ఇస్తారు. జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు కలిసి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఫెలోషిప్‌ లభిస్తుంది.

-నెట్‌లో ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన జేఆర్‌ఎఫ్‌ ఇవ్వరు. ప్రతి సబ్జెక్టుకు పరిమిత సంఖ్యలో ఫెలోషిప్‌లుంటాయి. ఉన్న జేఆర్‌ఎఫ్‌లు, వివిధ కేటగిరీలను దృష్టిలో ఉంచుకొని నెట్‌ పరీక్షలో ప్రతిభావంతులకు మాత్రమే ఫెలోషిప్‌లు దక్కుతాయి.

సీఎస్‌ఐఆర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ఫెలోషిప్‌:
సీఎస్‌ఐఆర్‌ నెట్‌లో మంచి మెరిట్‌ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ (ఎస్‌పీఎం) ఫెలోషిప్‌ను అందిస్తున్నారు. పరిశోధనలు చేసే విద్యార్థులను ప్రోత్సహించడం ఈ ఫెలోషిప్‌ ఉద్దేశం. దీనిద్వారా మొదటి రెండేళ్లకు నెలకు రూ.20 వేలు ఇస్తారు. విద్యార్థి ప్రతిభను బట్టి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఫెలోషిప్‌ అందిస్తారు. మూడో ఏడాది నుంచి నెలకు రూ.24 వేలు ఇవ్వడంతో పాటు ఏడాదికి రూ.70 వేల కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌ కూడా చెల్లిస్తారు.

జాయింట్‌ స్క్రీనింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (జెస్ట్‌):
సైన్స్‌కు సంబంధించిన అంశాల్లో పీహెచ్‌డీ చేయాలనుకుంటే దానికున్న చక్కని మార్గం జెస్ట్‌. ఏడాదికి ఒకసారి ఒక్కో ఇన్‌స్టిట్యూట్‌ ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు ఫెలోషిప్‌ అందుకోవడంతోపాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉన్న వివిధ ప్రతిష్టాత్మక సంస్థల్లో ఫిజిక్స్‌ సంబంధిత అంశాల్లో పీహెచ్‌డీ చేయొచ్చు.

అర్హత:
ఎమ్మెస్సీలో సంబంధిత కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలి. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల్లో ప్రవేశాలకు పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఎమ్మెస్సీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి.

వయోపరిమితి: జేఆర్‌ఎఫ్‌ పొందాలంటే 28 ఏళ్లకు మించరాదు. లెక్చర ర్‌షిప్‌కు వయోపరిమితి లేదు.

కెరీర్‌ గ్రాఫ్‌:
-పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఆయా విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తించవచ్చు. విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, నిట్‌లు వంటి ఉన్నత విద్యా సంస్థల్లో మెరుగైన వేతనంతో ఉద్యోగాల్లో స్థిరపడొచ్చు. ఇటీవల కాలంలో పీహెచ్‌డీ చేసిన వారికి విద్యా సంస్థలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

-జూనియర్‌ సైంటిస్ట్‌గా సీనియర్‌ శాస్తవ్రేత్తల వద్ద పనిచేసే అవకాశం లభిస్తుంది.
-ఇప్పుడు పెద్ద కంపెనీలకు సొంతంగా ఆర్‌ అండ్‌ డీ విభాగాలున్నాయి. పీహెచ్‌డీ చేసిన వారికి వీటిలో అవకాశాలు లభిస్తాయి. ఫార్మాస్యుటికల్‌ పరిశ్రమలో ఎక్కువ అవకాశాలున్నాయి.
-సొంతంగా పరిశోధన ప్రాజెక్టులు చేపట్టొచ్చు. సంస్థలను ఏర్పాటు చేయొచ్చు.
-సంబంధిత రంగంలో ఇౌటఠ్ట్చ్టటగా సేవలు అందించొచ్చు.
-పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలు.

వేతనాలు:
పీహెచ్‌డీ కెరీర్‌ను ప్రారంభిస్తే నెలకు రూ.35 వేలకు తగ్గకుండా వేతనం లభిస్తుంది. ఇతర సౌకర్యాలూ లభిస్తాయి. తర్వాత అనుభవం, పనితీరుతో రూ.లక్షల్లో వేతనం వచ్చే కొలువుల్లో స్థిరపడొచ్చు.

పీహెచ్‌డీతో ఉజ్వల భవిష్యత్తు
సైన్స్‌ కోర్సుల్లో పీజీతో ఫుల్‌స్టాప్‌ పెట్టకుండా పీహెచ్‌డీ చేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. పరిశోధనలు చేపట్టడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. పీజీ అనేది కేవలం తరగతి గదికే పరిమితం. ఇందులో నేర్చుకున్న అంశాల ఆధారంగా పరిశోధనలు చేపట్టేందుకు, కొత్త ఆవిష్కరణలకు పీహెచ్‌డీ వీలు కల్పిస్తుంది. యూజీసీ, డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ (డీబీటీ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) వంటి సంస్థలు ప్రోత్సహిస్తుండటంతో గతంలో కంటే ఇప్పుడు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. బోధనా సిబ్బంది నియామకాలకు సంబంధించి యూనివర్సిటీల్లో నెట్‌లో అర్హత సాధించిన వారికంటే పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెర్చ్‌ వైపునకు అడుగులు వేస్తున్న వారు అధికమయ్యారు.
- ప్రొఫెసర్‌ టి.పార్థసారథి, ప్రిన్సిపాల్‌
పీజీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌,
ఉస్మానియా యూనివర్సిటీ.

టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌
సీఎస్‌ఐఆర్‌:

కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) కు చెందిన సంస్థల్లో పీహెచ్‌డీ చేసిన వారికి ఉన్నత ఉద్యోగావకాశాలుంటాయి. ఈ లేబొరేటరీలు పరిశోధనలవైపు మొగ్గుచూపే వారిని ప్రోత్సహిస్తున్నాయి.

ఫిజికల్‌ సెన్సైస్‌:
సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఈఈఆర్‌ఐ)-పిలానీ.
వెబ్‌సైట్‌: www.ceeri.res.in

నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ), హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: www.ngri.org.in

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐవో), గోవా.
వెబ్‌సైట్‌: www.nio.org

నేషనల్‌ ఫిజికల్‌ లేబొరేటరీ (ఎన్‌పీఎల్‌), న్యూఢిల్లీ.
వెబ్‌సైట్‌: www.nplindia.org

సెంట్రల్‌ సాల్ట్‌ అండ్‌ మెరైన్‌ కెమికల్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ), భావ్‌నగర్‌.
వెబ్‌సైట్‌: www.csmcri.org

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: www.iictindia.org

నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీ- పుణె.
వెబ్‌సైట్‌: www.ncl-india.org

బయలాజికల్‌ సెన్సైస్‌:
సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: www.ccmb.res.in

సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీడీఆర్‌ఐ), లక్నో.
వెబ్‌సైట్‌: www.cdrindia.org

సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ), మైసూర్‌.
వెబ్‌సైట్‌: www.cftri.com

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ ఆరోమాటిక్‌ ప్లాంట్స్‌ (సీఐఎంఏపీ), లక్నో.
వెబ్‌సైట్‌: www.cimap.res.in

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (ఐఐసీబీ), కోల్‌కతా.
వెబ్‌సైట్‌: www.iicb.res.in

ఇండస్ట్రియల్‌ టాక్సికాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ (ఐటీఆర్‌సీ), లక్నో.
వెబ్‌సైట్‌: www.iitrindia.org

నేషనల్‌ బొటానికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌బీఆర్‌ఐ), లక్నో.
వెబ్‌సైట్‌: www.nbr.res.in
Published date : 07 Oct 2013 05:58PM

Photo Stories