Skip to main content

ఫార్మసీ కొలువులకు... ఇదిగో దారి !

ఫార్మాస్యూటికల్ రంగం.. ఏటా క్రమంతప్పకుండా పురోగమనం! వందల సంఖ్యలో ఫార్మా సంస్థలు.. భారీస్థాయిలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు.. సరికొత్త ఔషధాల ఆవిష్కరణలు! అంతేకాదు అంతర్జాతీయంగా..టాప్-10లో నిలుస్తోంది భారత ఫార్మాస్యూటికల్ రంగం! ముఖ్యంగా మన హైదరాబాద్ చుట్టూ ఎన్నో పేరున్న ఫార్మా కంపెనీలు. అన్నీ ఉన్నా.. మన ఫార్మసీ విద్యార్థులకు మాత్రం ఉద్యోగాలు అరకొరే! కొలువులకు ఎప్పుడూ కటకటే!! ఒకవైపు.. ఫార్మా కంపెనీల్లో నియామకాలు ఊపందుకున్నాయనే వార్తలు.. మరోవైపు.. ఎలాంటి అవకాశం తలుపు తట్టక దిగాలు పడుతున్న ఫార్మసీ విద్యార్థులు ఎందరో..! ఎందుకో తెలుసుకుందామా...!!
ఓవైపు ఏటా ఆరు నుంచి ఏడు శాతం వృద్ధి నమోదు చేసుకుంటూ.. భారత ఫార్మాస్యూటికల్ రంగం 2020 నాటికి ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తుందని ఫిక్కీ, సీఐఐ, పీడబ్ల్యూసీ వంటి నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఫార్మసీ కోర్సులు పూర్తిచేసుకుంటున్న వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే లభిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా సర్టిఫికెట్లతో బయటికొస్తున్న ఫార్మసీ విద్యార్థుల గణాంకాలను పరిశీలిస్తే.. డి.ఫార్మసీ దాదాపు 50 వేలు; బీ ఫార్మసీ 40 వేలు; ఎం.ఫార్మసీ 15 వేలు; ఫార్మ్-డి 9వేల మంది కోర్సులు పూర్తిచేసుకొని జాబ్ మార్కెట్‌లో అడుగుపెడుతున్నారు. కానీ.. వీరిలో 25-30 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగతావారు అవకాశాల కోసం ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.

అదే కారణమా..?
ఫార్మా కంపెనీల నియామక విధానాల కారణంగానే ఫార్మసీ కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులందరికీ అవకాశాల సమాచారం లభించడంలేదనే వాదన వినిపిస్తోంది. ఫార్మా రంగంలోని బహుళ జాతి సంస్థలు.. కీలక విభాగాలైన ఆర్ అండ్ డీ, బల్క్ డ్రగ్ ప్రొడక్షన్ వంటి విభాగాల్లో నియామకాలకు మాత్రమే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నాయి. వీటిని కూడా నైపర్‌తోపాటు, ప్రముఖ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో మాత్రమే చేపడుతున్నాయి. ఈ విభాగాల్లో విధులు నిర్వహించేందుకు ఎం.ఫార్మసీ కనీస అర్హతగా పేర్కొంటున్నాయి. దాంతో డి.పార్మసీ, బీఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలకు దూరమవుతున్నాయి.

అధిక శాతం అలాగే..
ఫార్మా కంపెనీలు పైస్థాయి పోస్టులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తూ... కింది స్థాయిలోని సూపర్‌వైజర్, అంతకంటే తక్కువ హోదాలోని ఉద్యోగాల భర్తీకి కన్సల్టెన్సీలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ రంగంలోని పేరున్న కన్సల్టెన్సీలను సంప్రదిస్తూ.. వారిద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. కన్సల్టెన్సీలతోపాటు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్‌నూ టాలెంట్ హైరింగ్‌కు మరో మార్గంగా ఎంచుకుంటున్నాయి. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్, ముంబై ఫార్మసీ అసోసియేషన్ నివేదికల ప్రకారం 70 శాతానికిపైగా సంస్థలు కన్సల్టెన్సీలు, ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్ ఆధారంగా అభ్యర్థుల నియామకాలు చేపడుతున్నాయి. 30 శాతం సంస్థలు మాత్రమే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు మొగ్గు చూపుతున్నట్లు సదరు నివేదిక పేర్కొంది.

ఎంప్లాయీ రిఫరల్ :
ఫార్మాస్యూటికల్ సంస్థలు నియామక విధానాల్లో మరో అంశం.. ఎంప్లాయీ రిఫరల్ స్కీమ్. దీని ప్రకారం- తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు ఖాళీలు, అర్హతల వివరాలు తెలియజేసి సరైన అభ్యర్థులను సూచించాలని కోరుతున్నాయి. సదరు ఉద్యోగాలకు సరితూగే నైపుణ్యాలున్న అభ్యర్థులను సూచిస్తే.. సంబంధిత ఉద్యోగికి కొంత మొత్తం ప్రోత్సాహకం సైతం అందిస్తున్నాయి.

అలా 40 శాతం కంపెనీలే..
అవకాశాల పరంగా ఆయా సంస్థలు విడుదల చేసే పత్రికా ప్రకటనలు, నోటిఫికేషన్లపైనే ఎక్కువ మంది అభ్యర్థుల దృష్టి ఉంటుంది. కానీ.. ఫార్మా రంగం విషయానికొస్తే కేవలం 40 శాతం సంస్థలే ప్రకటనలు ద్వారా నియామకాలు జరుపుతుండటం గమనార్హం. ఇవి కూడా మార్కెటింగ్, సేల్స్ రిప్రజెంటేటివ్ పోస్టులే! మరోవైపు పలు ఫార్మసీ సంస్థలు తమ నియామకాల పరంగా సొంత వెబ్‌సైట్స్‌కే పరిమితం కావడం ఎక్కువగా కనిపిస్తోంది. వెబ్‌సైట్లలోనే కెరీర్ ఆప్షన్స్ లింక్‌లో తాజా ఖాళీల వివరాలు ప్రకటిస్తున్నాయి. దీని గురించి తెలియని విద్యార్థులు.. అర్హతలున్నప్పటికీ అవకాశాల సమాచారం తెలియక ఉద్యోగ వేటలో వెనుకబడుతున్నారు. అలా కోర్ నైపుణ్యాలు పొందిన డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ విద్యార్థులు కొలువుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

స్కిల్ గ్యాప్ కారణమా?
ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలు సైతం నియామకాల పరంగా ఔట్ సోర్సింగ్ విధానాలకు మొగ్గు చూపడానికి కారణమేంటి? అంటే.. విద్యార్థుల్లో స్కిల్ గ్యాప్ సమస్యే ఇందుకు ముఖ్య కారణమనే వాదన వినిపిస్తోంది. బీ ఫార్మసీ, డి.ఫార్మసీ కోర్సుల్లో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా బోధన ఉండట్లేదు. వందల సంఖ్యలో ఉన్న కళాశాలల్లో బోధనలో నాణ్యత అంతంత మాత్రమే! ఈ పరిస్థితుల్లో కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించడం.. కంపెనీల అవసరాలకు తగ్గ నైపుణ్యాలున్న అభ్యర్థులను గుర్తించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని ఫార్మా సంస్థలు భావిస్తున్నాయి. అందుకే సూపర్‌వైజర్, ఆ కిందిస్థాయి ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన ఓ ఫార్మాస్యూటికల్ సంస్థ హెచ్‌ఆర్ హెడ్ పేర్కొన్నారు. కీలక విభాగాల్లో నియామకాలకు మాత్రమే టాప్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఉద్యోగార్థులు ఏం చేయాలి ?
ఫార్మా సంస్థలు అనుసరిస్తున్న వివిధ నియామక విధానాల నేపథ్యంలో ఫార్మసీ అభ్యర్థులు సదరు ఉద్యోగాల గురించి తెలుసుకుని ‘కొలువు’ దీరేందుకు నిత్యం సంస్థల వెబ్‌సైట్స్‌ను వీక్షించడం.. సంబంధిత కన్సల్టెన్సీలను సంప్రదించడం.. ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్‌లో ప్రొఫైల్ అప్‌డేట్ చేస్తుండటం.. సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సంప్రదించడం.. తమ అర్హతలు, వాటికి లభించే ఉద్యోగాలు- అందుకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫార్మసీ కెరీర్స్..
ఆయా అర్హతల ఆధారంగా ఫార్మసీ రంగంలో లభించే కెరీర్ అవకాశాలు.. నిర్వర్తించాల్సిన విధులు..
డిప్లొమా ఇన్ ఫార్మసీ (డి.ఫార్మసీ): ఈ అర్హతతో ఫార్మసిస్ట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. ఈ సమయంలో డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకు ఔషధాలు తీసుకోవాల్సిన విధానాలపై రోగులకు తెలియజేయాల్సి ఉంటుంది.
బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (బి.ఫార్మసీ): బి.ఫార్మసీ అర్హతతో ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సంస్థల్లో కెమికల్ ప్రాసెసింగ్ యూనిట్స్, డ్రగ్ ఫార్ములేషన్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మ్-డి): ఈ సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులు ప్రాసెసింగ్ యూనిట్స్, ఫార్ములేషన్ విభాగాల్లో పర్యవేక్షణ స్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎం.ఫార్మసీ, పీహెచ్‌డీ: ఈ రెండు అర్హతలు పొందిన వారు ఆర్ అండ్ డీ విభాగంలో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. మెడికల్ కెమిస్ట్స్, మాలిక్యులర్ బయాలజిస్ట్స్, జెనెటిసిస్ట్స్, ఇమ్యునాలజిస్ట్స్, క్లినికల్ రీసెర్చర్స్, బయో-స్టాటిస్టిషియన్స్, కెమికల్ అండ్ బయోకెమికల్ ఇంజనీర్స్ వంటి హోదాలు అందుకోవచ్చు.

వేతనాలు ఇలా..
ఫార్మా రంగంలో ప్రారంభంలో ఫార్మసిస్ట్‌గా ఏడాదికి రూ.1.5 లక్షల వేతనం సొంతం చేసుకోవచ్చు. బి.ఫార్మసీ అర్హతతో రూ.రెండు లక్షల నుంచి రూ.రెండున్నర లక్షలు; ఎం.ఫార్మసీ, ఆపై అర్హతలతో రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల సగటు వేతనం లభిస్తోంది.

ఆ పోస్టులు క్యాంపస్ డ్రైవ్స్‌తోనే...
ఫార్మా సంస్థల్లో స్పెషలైజ్డ్ హోదాలకు క్యాంపస్ డ్రైవ్స్‌తోనే నియామకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టాక్సికాలజీ, ఫార్మా మేనేజ్‌మెంట్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్, మెడికల్ డివెజైస్, ఫార్మా టెక్నాలజీ, ఫార్మా ప్రాక్టీస్, క్లినికల్ రీసెర్చ్ వంటి విభాగాల్లో నిపుణుల కోసం సంస్థలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నాయి. నైపర్- హైదరాబాద్ క్యాంపస్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఏటా 80 శాతం మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారవుతున్నాయి.
- డా. ఎన్.శ్రీనివాస్, ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్, నైపర్-హైదరాబాద్.
Published date : 02 Nov 2018 06:27PM

Photo Stories