Skip to main content

ఫార్మా రంగంలో ఉన్నత ఉద్యోగాలు.. విశ్లేషణ

సర్టిఫికెట్ చేతికందుతూనే అవకాశాలను ఖాయం చేస్తోంది ఫార్మాస్యూటికల్ రంగం. అకడమిక్ పరంగా బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూప్‌ల విద్యార్థులకు అవకాశాలు కల్పించే కోర్సు బీఫార్మసీ. ఈ ఏడాది తాజాగా ముగిసిన ఫార్మసీ సీట్ల కేటాయింపులో 97 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. ఎంసెట్ బీ ఫార్మసీ కౌన్సెలింగ్ ముగిసి సీట్ల కేటాయింపు పూర్తయిన నేపథ్యంలో.. ఫార్మా రంగంలో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై విశ్లేషణ..
ఇటీవల కాలంలో మన దేశంలో డ్రగ్ రీసెర్చ్, డ్రగ్ ఫార్ములేషన్, ప్రొడక్షన్ వంటి కార్యకలాపాలు పెరుగుతున్నాయి. విదేశాలకు చెందిన ఔషధ సంస్థలు సైతం మన దేశంలోని సంస్థలతో సంయుక్త భాగస్వామ్యంతో పలు ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మిగిలిన రంగాలతో పోల్చితే ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా కెరీర్ పరంగా అవకాశాలకు వేదికగా ఫార్మాస్యూటికల్స్ రంగం నిలుస్తోంది. అయితే చదివిన కళాశాలకున్న పేరు, అకడమిక్ రికార్‌‌డ ఆధారంగా జాబ్స్ లభిస్తాయి. ప్రస్తుతం ఫార్మాస్యూటికల్ సంస్థలు ఎంట్రీ లెవల్ నుంచి ఆర్ అండ్ డీ స్థాయి వరకు నిపుణులైన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే తాజాగా బీఫార్మసీ కోర్సులో ప్రవేశించినవారు కోర్సు పూర్తి చేసుకునే నాటికి మంచి అవకాశాలు లభిస్తాయని ఆశించొచ్చు.

వివిధ విభాగాల్లో..
కేంద్ర ప్రభుత్వం ఫార్మా రంగంలో నిపుణులైన మానవ వనరులను అందించేందుకు దేశవ్యాప్తంగా ఏడు నైపర్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్)లను నెలకొల్పింది. ఇవి ఎంఫార్‌‌మ, ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్), పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. ఎంఫార్‌‌మలోని వివిధ స్పెషలైజేషన్‌‌సలో ప్రవేశాలకు జాయింట్ ఎంట్రెన్‌‌స ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. హైదరాబాద్‌లో కూడా నైపర్ ఉంది. అవకాశాల విషయానికొస్తే బీఫార్మసీ ఉత్తీర్ణులు ఆయా సంస్థల్లో కెమికల్ ప్రాసెసింగ్ యూనిట్స్, డ్రగ్ ఫార్ములేషన్ యూనిట్లలో పనిచేయొచ్చు. ఫార్‌‌మ-డి పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కూడా ఇవే విభాగాల్లో పర్యవేక్షణ స్థాయి హోదాల్లో అవకాశాలుంటాయి. హెల్త్‌కేర్, డయాగ్నస్టిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాల్లోనూ జాబ్స్ ఉంటాయి. ఫార్మసీలో పీజీ స్థాయి కోర్సులు పూర్తి చేస్తే మంచి అవకాశాలు పొందొచ్చు. హెల్త్‌కేర్ రంగానికి సంబంధించి ఆయా డయాగ్నొస్టిక్ ప్రొడక్ట్‌లు, ఇతర మెడికల్ ట్రీట్‌మెంట్ ప్రొడక్ట్‌ల రూపకల్పనలో భాగంగా క్వాలిటీ అష్యూరెన్స్ విభాగంలోనూ జాబ్స్ లభిస్తాయి.

ఇంజనీరింగ్ విద్యార్థులకు సైతం
ఎంపీసీ గ్రూప్‌తో బీఫార్మసీ పూర్తి చేసిన వారితోపాటు ఎంపీసీ అర్హతగా బీటెక్ పట్టా అందుకున్న అభ్యర్థులకు సైతం ఫార్మా రంగంలో అవకాశాలు పుష్కలం. ముఖ్యంగా బీటెక్ ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌ల ఉత్తీర్ణులకు ఆయా సంస్థల్లో యంత్రాల నిర్వహణ, ఎలక్ట్రిఫికేషన్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫార్మా కంపెనీలు ప్రీ-ప్రొడక్షన్ కార్యకలాపాల్లో సాఫ్ట్‌వేర్ ఆధారితంగా ముందుకు సాగుతున్నాయి. కాబట్టి సీఎస్‌ఈ విద్యార్థులకు సైతం ఫార్మా రంగం కెరీర్ అవకాశాలకు వేదికగా నిలవనుంది.

ఉన్నత విద్యతో ఉజ్వల భవిత..
ఫార్మాస్యూటికల్ రంగంలో అత్యున్నత భవిష్యత్ కోరుకునే అభ్యర్థులు ఈ విభాగంలో పీజీ కోర్సులు చేయడం ఉత్తమం. ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, టాక్సికాలజీ, క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మకోగ్నసీ, ఫార్మా మేనేజ్‌మెంట్ ఇలా పలు రకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ఫార్మకాలజీ, ఫార్మకోగ్నసీ, ఫార్మా మేనేజ్‌మెంట్‌లకు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. అలాగే ఫార్మా రంగంలో కీలక విభాగాల్లో, ఉన్నత హోదాలు అందించేందుకు మార్గం పీహెచ్‌డీ. దీన్ని పూర్తి చేసిన అభ్యర్థులు ఆయా సంస్థల్లో సైంటిస్ట్‌లుగా అవకాశాలు అందుకోవచ్చు. క్లినికల్ రీసెర్చ్ సంస్థలు కూడా పీహెచ్‌డీ అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి.

నైపుణ్యాలు సాధిస్తేనే..
కెరీర్‌పరంగా ఫార్మాస్యూటికల్ రంగంలో చక్కటి అవకాశాలు సొంతం చేసుకోవాలంటే.. నాలుగేళ్ల బీ ఫార్మసీ కోర్సులో తొలి రోజు నుంచే ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో అభ్యసనం సాగించాలి. ముఖ్యంగా బల్క్ డ్రగ్ ఫార్ములేషన్, క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ ప్రొడక్షన్ ప్రాసెస్, కెమికల్ ఫార్ములేషన్‌లపై పట్టు సాధించాలి. ఈ విభాగంలో తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రాజెక్ట్ వర్క్ పరంగా లైవ్ ప్రాజెక్ట్ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. వీలైతే సమీపంలోని ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల కెరీర్ పరంగా అదనపు ప్రయోజనం ఉంటుంది.

ఆకర్షణీయ వేతనాలు
ఫార్మసీ కోర్సులు పూర్తి చేసుకున్నవారికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. బీఫార్మసీ డిగ్రీతో కెమిస్ట్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో ప్రవేశించేవారు ప్రారంభంలో ఏడాదికి రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు అందుకోవచ్చు. ఉన్నత స్థాయిలో ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వేతనాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి.

ఫార్మాస్యూటికల్ రంగం.. ముఖ్య సమాచారం
గ్లోబల్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ పరంగా భారత్.. టాప్ సిక్స్ దేశాల జాబితాలో నిలిచింది.
ఈ రంగంలో 2020 నాటికి 21.5 మిలియన్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా.
ఫార్మా విజన్-2020 పేరిట ప్రత్యేకంగా ఫార్మాస్యూటికల్ రంగం విస్తృతికి కేంద్రం ప్రణాళికలు రూపొందించింది.
దిగువ స్థాయిలో ఫార్మసిస్ట్ నుంచి సైంటిస్ట్ వరకు అన్ని హోదాల్లో అవకాశాలు లభిస్తాయి.
ఎన్‌ఎస్‌డీసీ అంచనా ప్రకారం- మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

టాప్ రిక్రూటర్‌గా ఫార్మా రంగం..
భారత ఫార్మాస్యూటికల్ రంగం నియామకాల పరంగా అంతర్జాతీయ స్థాయిలో టాప్ రిక్రూటర్‌గా నిలుస్తోంది. కేవలం బీఫార్మసీ, ఎం ఫార్మసీ వంటి ప్యూర్ ఫార్మసీ విభాగాలే కాకుండా.. బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) చేసిన వారికి సైతం ఈ రంగంలో అవకాశాలు లభిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు ఫార్మా సంస్థలు తమ కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకు సైతం (ఉదా: విశాఖపట్నం) విస్తరిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే డిమాండ్ - సప్లయ్ మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. డొమైన్ ఏరియాలో ఉన్నత హోదాలు అందుకోవాలంటే.. పీజీ స్థాయి కోర్సులు పూర్తి చేయడం మేలు. బీఫార్మసీ విద్యార్థులు మొదటి నుంచే సబ్జెక్ట్ నైపుణ్యాలు పెంచుకోవాలి. అప్లికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో ముందుకు సాగాలి.
- డాక్టర్. సీహెచ్.వేణుగోపాల్ రావు, సీఐఐ మాజీ సభ్యులు
Published date : 15 Aug 2016 06:15PM

Photo Stories